దుమ్ము దులుపుతున్న విజయ్ ప్రతాప్..! సంక్షేమ హాస్టళ్లపై ఏపీ సర్కార్ వార్నింగ్

పీలో ప్రభుత్వం నిర్వహిస్తున్న బీసీ, ఎస్సీ, ఎస్టీ సంక్షేమ హాస్టళ్లలో సదుపాయాలపై విమర్శల జడి కొనసాగుతోంది. ఇప్పటికే రాష్ట్ర ఫుడ్ కమిషన్ ఛైర్మన్ విజయ్ ప్రతాప్ రెడ్డి పలు చోట్ల పర్యటనలు చేస్తూ లోపాల్ని గుర్తిస్తూ అధికారులపై చర్యలు తీసుకుంటూనే ఉన్నారు.


అయినా హాస్టళ్ల నిర్వాహకుల తీరు మారడం లేదు. అదే సమయంలో హాస్టళ్లలో విద్యార్ధులు అస్వస్థతకు గురవుతున్న ఘటనలు పెరుగుతున్న ఘటనలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో సర్కార్ స్పందించింది.

రాష్ట్రంలోని సంక్షేమ హాస్టళ్లలో ఫుడ్ కమిషన్ ఛైర్మన్ చిత్తా విజయ్ ప్రతాప్ రెడ్డి గత కొంతకాలంగా వరుస తనిఖీలు చేస్తున్నారు. ఇందులో విద్యార్ధులకు సరైన ఆహారం ఇవ్వకపోవడం, ఇచ్చినా అరకొరగా ఇవ్వడం, నాసిరకం వంటలు, ఇతర లోపాలు బయటపడుతూనే ఉన్నాయి. వీటిపై ఆయన ఎప్పటికప్పుడు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న వీడియోలు వైరల్ అవుతూనే ఉన్నాయి. అయితే ఈ మధ్య కాలంలో హాస్టళ్లలో నీటి కాలుష్యంతో విద్యార్ధులు అస్వస్థతకు గురవుతున్న ఘటనలు కూడా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో సీఎస్ విజయానంద్ ఇవాళ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు.

ఇందులో సంక్షేమ హాస్టళ్లలో వరుస సంఘటనలు ఎందుకు జరుగుతున్నాయి, హాస్టళ్లలో వార్డెన్లు ఏం చేస్తున్నారు అంటూ సీఎస్ విజయానంద్ అసంతృప్తి వ్యక్తం చేశారు. అల్లూరి సీతారామరాజు జిల్లా రాజేంద్రపాలెం గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో బాలికలు అస్వస్థతకు గురైన అంశాన్ని ప్రస్తావిస్తూ.. అధికారుల తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. అసలు సంక్షేమ హాస్టళ్లలో ఏం జరుగుతోంది అంటూ ఆయన అధికారులను ప్రశ్నించారు. వరుస సంఘటనలు జరుగుతుంటే కఠిన చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. హాస్టళ్లలో వార్డెన్లు ఏం చేస్తున్నారు. హాస్టళ్లలో పరిశుభ్రత, శుచికరమైన భోజనం, విద్యార్థులు ఆరోగ్య పరిస్థితి గురించి పట్టించుకోకుండా వారు ఇంకేం పనిచేస్తున్నారని ప్రశ్నించారు.

వార్డెన్లు ఏం పట్టించుకోరా? ఇంత బాధ్యతారాహిత్యంగా పనిచేస్తుంటే చర్యలు తీసుకోకుండా మీరేం చేస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. హాస్టళ్లలో ప్రతి రోజూ నీటి పరీక్షలు ఎందుకు చేయించడం లేదన్నారు. నీటి పరీక్షలకు చేయించడానికి ప్రతి చోటా సదుపాయాలున్నాయని వాటిని ఎందుకు ఉపయోగించుకోవడం లేదన్నారు. హాస్టళ్ల పనితీరు ఇలాగే ఉంటే ప్రభుత్వం ఏమాత్రం ఉపేక్షించబోదని, బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిన అధికారులపై కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. హాస్టళ్ల పనితీరు మెరుగుపడాలని, స్వచ్ఛాంధ్ర నిధులతో అన్ని హాస్టళ్లలో ఎక్కడా కూడా మరుగుదొడ్లు, బాత్‌రూముల కొరత అనేదే లేకుండా చూడాలన్నారు. యుద్ద ప్రాతిపదికన ఈ పనులు చేపట్టాలన్నారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.