నాలుగు రోజులు గడిచిపోయింది. ఇంకా వరద ముంపులోనే ఉంది విజయవాడ. బుడమేరు, కృష్ణా వరద సగానికి సగం విజయవాడ నగరాన్ని ముంచెత్తింది. బుడమేరు పరిసర ప్రాంతాల్లోని కాలనీలన్ని నీటమునిగాయి.
వరద ఉధృతి తగ్గినా సింగ్‌నగర్ ముంపులోనే ఉంది. సింగ్‌నగర్‌లో ఎటు చూసినా మోకాళ్ళ లోతు వరద నీరు చేరడంతో స్థానికులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. నాలుగు రోజులుగా వేలాది మంది ప్రజలు జలదిగ్బంధంలో ఉన్నారు. వేలాది మంది తాత్కాలిక పునరావాస కేంద్రాల్లోనే తలదాచుకుంటున్నారు.
విజయవాడకు వరద మిగిల్చిన విషాదం నుంచి పూర్తిగా కోలుకోకుండానే.. మళ్లీ పిడుగులాంటి వార్త చెప్పింది వాతావరణశాఖ. బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడుతుందని.. దీని ప్రభావంతో కృష్ణా, గుంటూరు, గోదావరి, ఉత్తరాంధ్ర జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది.