ప్రతి ఊరికి ఓ చరిత్ర ఉంటుంది. ఆ చరిత్రకు మరో ప్రత్యేకత ఉంటుంది. అలాంటి ప్రత్యేకమైన గ్రామమే ఈ హాల్ బ్రదర్స్ విలేజ్. ఇక్కడ ఏ గల్లీలో చూసినా మన కళ్లు మనల్ని మోసం చేస్తూనే ఉంటాయి.
ఇలా చూసి అలా వెనక్కి తిరగ్గానే అచ్చు అలాంటి మనిషే మన కళ్ల ముందు ప్రత్యక్షమవుతుంటారు. సింపిల్ గా చెప్పాలంటే ఇది ట్విన్స్ విలేజ్. ఆ హాలో బ్రదర్స్ విలేజ్ మరెక్కడో కాదు.. మన అడవుల జిల్లా ఆదిలాబాద్.
అడవుల జిల్లా ఆదిలాబాద్.. ఎన్నో ప్రకృతి రమణీయతలకు పుట్టినిల్లు.. వింతలు విశేషాలు ఘనం.. వెలికి తీయలేని సిరి సంపదలకు నిలయం. అంతేనా అంతకు మించిన చరిత్రను తనలో దాచుకుని దక్షిణ కాశ్మీరంగా పరిడవిల్లుతున్న ప్రకృతి నిలయం. ఇక్కడ అడుగు పెడితే ఇంత ప్రశాంతతనే.. ఇన్ని వింతలా ఇన్నిన్ని విశేషాల అని నోరెళ్ల పెట్టడం పక్కా..! అలాంటి మరో విశేషమైన గ్రామమే వడ్డాడి. కేరాఫ్ కవలల గ్రామం. ఆదిలాబాద్ జిల్లా తాంసి మండలంలో ఉంది ఈ గ్రామం. ఇక్కడ అడుగు పెడితే హాయ్ బ్రదర్స్ అంటూ కవలలు స్వాగతం పలుకుతారు. ముద్దు ముద్దుగా కనిపించి చిన్నారులు.. కనులను మాయచేసే కవలలు మన ముందు కనిపిస్తారు.
రెండై తిరిగే ఒకే ఓ రూపం వీళ్లేనంట అనేలా మాయ చేస్తారు ఈ విలేజ్ ట్విన్స్. కవలలు.. కన్నవారికి సిరిసంపదలు.. మురిపాల ముద్దు బిడ్డలు. చూసేవారికి ఆశ్చర్యం కలిగిస్తూ.. ఇంట్లో ఉన్నా.. బడికెళ్లినా.. బజారుకెళ్లినా.. బంధువులతో కలుసున్నా ప్రత్యేకతను చాటుకుంటారు వీళ్లంతా. ఇక ఇద్దరూ ఒకే డ్రెస్ వేసుకుంటే ఒక్కోసారి ఇంట్లో వాళ్లే గుర్తుపట్టలేరంటే నమ్మక తప్పదు. ఇక వీరి పేర్లు కూడా అంతే రమ్యంగా ఉంటాయి కూడా. విరాట్ – విశాల్, గౌతమి – గాయత్రి , హర్షిత్ – వర్షిత్, కావ్య – దివ్య, అలేహ – సలేహలు, ప్రత్యక్ష – ప్రణాళిక, రామలక్ష్మణ్, రామన్న – లచ్చన్న ఇలా పదికి పైగా కవల జంట ఉన్నాయి.
వీరిలో ప్రత్యక్ష – ప్రణాళిక వయసు 10 ఏళ్లు కాగా.. వీరి స్థానిక పాఠశాలలో అయిదో తరగతి చదువుతుండగా.. 11 ఏళ్ల గౌతమి, గాయత్రిలు ఇదే పాఠశాలలో ఆరో తరగతి చదువుతున్నారు. హర్షిత్, వర్షిత్ లు ఏడో తరగతి చదువుతున్నారు. వీరందరిదీ ఒకే పాఠశాల కావడం ఈ మూడు జంటల్లోని కవలలను గుర్తు పట్టలేక పాఠశాల సిబ్బంది.. ఉపాద్యాయులు తికమక పడుతుంటారు. స్నేహితులైతే ఎవరు గౌతమో ఎవరు గాయత్రినో.. ఎవరు వర్షిత్ , ఎవరి హర్షిత్ నో తెలియక గందరగోళానికి గురవడం కామన్.
ఉన్నత విద్యాభ్యాసం కోసం గ్రామం నుండి ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి వెళ్లే కావ్య – దివ్య, అలేహ – సలేహలు, రామ్ లక్ష్మణ్, విరాట్ – విశాల్ విషయంలోను సేమ్ టూ సేమ్ సీన్. సాధారణంగా ఇద్దరు వ్యక్తులు ఒకే ముఖచిత్రంతో కనిపిస్తేనే చిత్రంగా అనిపిస్తుంటుంది. అలాంటి ఊరంతా కవలలే కనిపిస్తే వడ్డాడి గ్రామంలాగే ఉంటుందేమో. ఇలా కవలల కారణంగా జిల్లాలోనే తమ గ్రామం ప్రత్యేకంగా నిలవడం తమకు ఎంతగానో ఆనందానిస్తుందంటున్నారు వడ్డాడి గ్రామస్తులు. అయితే ఇలాంటి ప్రత్యేకతకు కారణం మాత్రం గ్రామంలో స్వయంభువుగా వెలుసిన లక్ష్మి నారసింహుడి కృపాకటాక్షాలే అంటారు. వీరందరూ ఆ నృసింహుడి ప్రసాదంగానే భావిస్తున్నామంటున్నారు వడ్డాడి వాసులు. ఈ ప్రత్యేకతతో వడ్డాడి గ్రామం కవలల గ్రామంగా ఆదిలాబాద్ జిల్లాకు మరింత గుర్తింపును తెచ్చిపెట్టింది..