Ap Govt: గ్రామ, వార్డు, సచివాలయ ఉద్యోగులపై ఫోకస్.. త్వరలో కీలక ప్రకటన

గ్రామ, వార్డు, సచివాలయ ఉద్యోగుల(Village, Ward, Secretariat employees)పై ఏపీ ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే కీలక ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.


గుర్తింపు పొందిన సంఘాలతో సోమవారం మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి(Minister Dola Bala Veeranjaneya Swamy) సమావేశం నిర్వహించనున్నారు. ఉద్యోగ సంఘాల వినతులు, సూచనలపై ఈ సమావేశంలో చర్చించిన తర్వాత ప్రభుత్వానికి అధికారులు నివేదిక ఇవ్వనున్నారు.

కాగా గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ద్వారా మంచి సేవలు పొందేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోంది. ముందుగా వారిని రేషనలైజేషన్ చేయాలని భావిస్తోంది. గ్రామ, వార్డు సచివాయాల ఉద్యోగులు కొన్ని చోట్ల ఎక్కువగా.. మరికొన్ని చోట్ల తక్కువగా ఉన్నట్లు గుర్తించింది. రేషనలైజేషన్ ప్రక్రియ ద్వారా సరిదిద్దాలని కసరత్తులు చేస్తోంది. రాష్ట్రంలో ప్రస్తుతం 11,162 గ్రామ సచివాలయాలు, 3,842 వార్డు సచివాలయాలు ఉన్నాయి. వాటిలో 1,27,175 మంది పనిచేస్తున్నారు. ప్రతి సచివాలయంలో 10 మంది ఉద్యోగులు ఉండేలా ఈ విభాగాన్ని డిజైన్‌ చేయగా.. చాలా ప్రాంతాల్లో తక్కువ మందితోనే నడిపిస్తున్నారు. దీంతో మల్టీపర్పస్‌ ఫంక్షనరీస్‌, టెక్నికల్‌ ఫంక్షనరీస్‌గా వారిని విభజించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు గుర్తింపు పొందిన సంఘాలతో డోలా బాల వీరాంజనేయ స్వామి సమావేశం నిర్వహించనున్నారు.