ప్రభుత్వ ఉద్యోగులకు వినాయక చవితి గిఫ్ట్‌.. రూ.700 కోట్ల చెల్లింపు?

అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎన్నికల ముందు ప్రభుత్వ ఉద్యోగులకు భారీ హామీలు ఇచ్చింది. అయితే అధికారంలోకి వచ్చి 20 నెలలు గడిచినా ఇప్పటివరకు ఒక్క హామీ నెరవేర్చలేదు.


కరువు భత్యంతో వేతన సవరణ సంఘంతోపాటు పెండింగ్‌ బిల్లులు చెల్లించడం లేదు. పెద్ద కొండలాగా బిల్లులు బకాయిపడడంతో ప్రభుత్వ ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. తాజాగా ఆ బిల్లులు విషయమై ప్రభుత్వం శుభవార్త వినిపించింది. త్వరలో చెల్లించనున్నట్లు ప్రకటించింది.

పెండింగ్‌ బిల్లుల చెల్లింపులపై తెలంగాణ సర్కార్‌ దృష్టి సారించింది. గతంలో హామీ ఇచ్చిన మేరకు జూలైలో ఈ బిల్లుల కోసం రూ.720 కోట్లు చెల్లించినట్లు ఆర్థికశాఖ నివేదించింది. ఈ మేరకు ప్రభుత్వానికి ఆర్థిక శాఖ నివేదిక పంపించింది. ఈ పద్దు కింద నెలకు రూ.700 కోట్ల చొప్పున చెల్లిస్తామని గతంలో ప్రభుత్వం హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. వాటిలో ప్రధానంగా ఉద్యోగుల వైద్య ఖర్చుల (మెడికల్‌) బిల్లులను 2025 జూన్‌ నెలాఖరు వరకు ఉన్న పెండింగ్‌ చెల్లింపులు పూర్తిచేసినట్లు ఆర్థిక శాఖ వెల్లడించింది.

ఉద్యోగ సంఘాల అసంతృప్తి
రూ.700 కోట్లు కేటాయిస్తామని చెప్పి జూన్‌లో రూ.183 కోట్లు మాత్రమే ఇచ్చిందని ఉద్యోగ సంఘాలు గుర్తుచేస్తున్నాయి. బిల్లులతోపాటు మిగతా డిమాండ్లు కూడా నెరవేర్చాలని ప్రభుత్వ ఉద్యోగ సంఘాల జేఏసీ ప్రతినిధులు కోరుతున్నారు. దేశంలోనే అత్యధికంగా ఐదు డీఏలు పెండింగ్‌లో ఉండగా.. వేతన సవరణ సంఘం, వేతనాల పెంపు తదితర వాటిని ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలని డిమాండ్‌ చేస్తున్నారు. కాగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో ఇప్పటికే ఉద్యోగ సంఘాలు పోరాటానికి సిద్ధమైన విషయం తెలిసిందే. ఇటీవల ప్రభుత్వానికి ఆల్టిమేటం జారీ చేశారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.