10 లక్షల గోవింద కోటి రాసిన వారికి శ్రీవారి వీఐపీ బ్రేక్ దర్శనం

యువతలో ఆధ్యాత్మిక చైతన్యాన్ని, సనాతన ధర్మంపై అనురక్తిని కల్పించడమే లక్ష్యంగా రామకోటి తరహాలో గోవింద కోటిని రెండేళ్ల కిందట తితిదే ప్రవేశపెట్టింది. గోవిందకోటి రాసిన యువతకు వీఐపీ దర్శనాన్ని కల్పిస్తోంది. 25 సంవత్సరాలు, లేదా అంతకంటే తక్కువ వయసున్న వారు ఇందుకు అర్హులు. 10,01,116 సార్లు రాస్తే రాసిన వారికి వీఐపీ బ్రేక్‌ దర్శనం కల్పిస్తారు. కోటిసార్లు నామాలు రాస్తే వారితోపాటు కుటుంబ సభ్యులందరూ వీఐపీ బ్రేక్‌ దర్శనం చేసుకోవచ్చు. తితిదే సమాచార కేంద్రాలు, పుస్తక విక్రయ కేంద్రాలు, ఆన్‌లైన్‌లో గోవిందకోటి నామాల పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. 200 పేజీలుండే పుస్తకంలో 39,600 నామాలు రాయొచ్చు. 10,01,116 నామాలు పూర్తి చేయడానికి దాదాపు 26 పుస్తకాలు అవసరమవుతాయి. కోటి నామాల పుస్తకాలను రాయడానికి కనీసం మూడేళ్ల సమయం పడుతుందని తితిదే అంచనా వేసింది. గోవిందకోటి నామాల పుస్తకాన్ని పూర్తిచేసి తిరుమలలోని తితిదే పేష్కార్‌ కార్యాలయంలో అందిస్తే వారికి మరుసటి రోజు వీఐపీ బ్రేక్‌ దర్శనాన్ని కల్పిస్తామని పేష్కార్‌ రామకృష్ణ తెలిపారు.


మొదటిగా కర్ణాటక విద్యార్థిని

మొదటిసారిగా ‘గోవిందకోటి’ నామాల పుస్తకాన్ని కర్ణాటకకు చెందిన కీర్తన గత ఏడాది ఏప్రిల్‌లో పూర్తి చేశారు. బెంగళూరులో ఇంటర్‌ పూర్తి చేసిన ఆమె 10,01,116 సార్లు గోవింద నామం రాసి తితిదేకు సమర్పించారు. ఆ యువతికి తితిదే వీఐపీ బ్రేక్‌ దర్శనాన్ని కల్పించింది. అనంతరం మరో ఇద్దరు గోవిందకోటి నామాలను (10,01,116) రాసి వీఐపీ బ్రేక్‌ దర్శనం పొందారని తితిదే అధికారులు తెలిపారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.