పెళ్లయిన మూడు నిమిషాలకే ఓ జంట విడాకులు తీసుకున్న వింత సంఘటన కువైట్‌లో చోటు చేసుకుంది. తన భర్త చేసిన ఓ పని నచ్చకపోవడం వల్లే.. భార్య ఈ కఠినమైన నిర్ణయం..
పెళ్లయిన మూడు నిమిషాలకే ఓ జంట విడాకులు (Couple Divorce) తీసుకున్న వింత సంఘటన కువైట్‌లో (Kuwait) చోటు చేసుకుంది. తన భర్త చేసిన ఓ పని నచ్చకపోవడం వల్లే.. భార్య ఈ కఠినమైన నిర్ణయం తీసుకుంది. ఇలాంటి భర్త తనకు వద్దని తేల్చి చెప్తూ.. అప్పటికప్పుడే విడాకులు కోరింది. ఇంతకీ.. అంతలా భర్త ఏం చేశాడనేగా మీ సందేహం? ఆమెను అవమానించడం. తనకు తెలియకుండా జరిగిన ఓ పొరపాటుకి తనని నిందించడంతో.. ఆమె కోపాద్రిక్తురాలై డివోర్స్ తీసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. కువైట్‌లో నివాసముంటున్న ఓ జంట కొంతకాలం పాటు ప్రేమాయణం కొనసాగించింది. అనంతరం తమ అభిరుచులు, అభిప్రాయాలు కలవడంతో.. పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంది. అనుకున్నదే తడువుగా.. వాళ్లిద్దరు కోర్టులో వివాహం చేసుకున్నారు. ఇక కొత్త జీవితం ప్రారంభిద్దామని అనుకుంటున్న తరుణంలో.. ఎవ్వరూ ఊహించని ఓ పరిణామం చోటు చేసుకుంది. పెళ్లయ్యాక ఆ జంట కోర్టు నుంచి బయటకు వస్తున్న క్రమంలో.. నవ వధువు కాలుకి ఏదో తట్టింది. దాంతో ఆమె కాలుజారి కిందపడింది. అప్పుడు భర్త ఆమెకు సహాయం అందించాల్సిందిపోయి.. ‘స్టుపిడ్’ అంటూ తిట్టాడు. ఆ మాట విన్న తర్వాత ఆమె కోపం నషాళానికెక్కి.. తమ పెళ్లి రద్దు చేయాలని జడ్జిని కోరింది.
అసలేమైందని జడ్జి ఆ ఇద్దరిని అడిగి తెలుసుకున్నారు. ఇద్దరి మధ్య ఏర్పడ్డ ఆ సమస్యని పరిష్కరించాలని జడ్జి ప్రయత్నించారు కానీ.. భార్య మాత్రం వెనక్కు తగ్గలేదు. స్టుపిడ్ అనే మాట తనని తీవ్రంగా బాధపెట్టడంతో.. విడాకులు కావాల్సిందేనని తెగేసి చెప్పింది. దీంతో.. మరో దారి లేక జడ్జి వారి వివాహాన్ని రద్దు చేశారు. పెళ్లి చేసుకున్న మూడు నిమిషాలకే విడాకులు తీసుకోవడంతో.. చరిత్రలో వీరిది ‘షార్టెస్ట్ మ్యారేజ్’గా నిలిచిపోయింది. గతంలో 2004లో ఓ జంట పెళ్లైన 90 నిమిషాలకే విడాకులు తీసుకొని ‘అతిచిన్న వివాహం’ రికార్డుని నెలకొల్పగా.. కువైట్ జంట ఆ రికార్డుని బద్దలు కొట్టింది. కాగా.. ఈ ఘటన 2019లో చోటు చేసుకోగా, ఇప్పుడు మళ్లీ ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.