ఓ కాలేజీలో టీచర్లు, విద్యార్థులు దుమ్ముదుమ్ముగా కొట్టుకున్నారు. పరీక్షలు జరుగుతున్న క్రమంలో జరిగిన ఓ చిన్న పొరబాటు పెద్ద గొడవకు దాడి తీసింది. దీంతో విద్యార్ధులు, టీచర్లు తలపడి చితకబాదుకున్నారు. ఈ దాడిలో కొందరు విద్యార్థులతోపాటు ఒక స్టూడెంట్ తల్లి కూడా తీవ్రంగా గాయపడింది. ఈ షాకింగ్ ఘటన బీహార్ రాష్ట్రంలోని బెగుసరాయ్‌లోని ఒక కళాశాలలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..
బీహార్‌లోని బెగుసరాయ్‌లో ఉన్న ఎంఆర్‌జేడీ కాలేజీలో జరుగుతున్న పరీక్షలకు విద్యార్థులు హాజరయ్యారు. అయితే బీఏ పార్ట్ 2 పరీక్షకు సోదరుడి బదులు అతని సోదరి పరీక్ష రాసింది. పరీక్ష అనంతరం టీచర్ వద్దకు వెళ్లి సంతకం చేయాలని అడిగింది. ఈ విషయమై వారిద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో ఆగ్రహించిన ఆ టీచర్ తోబుట్టువులను కొట్టడం ప్రారంభించాడు. తమ పిల్లలపై దాడి జరగడం చూసిన అక్కడే ఉన్న తల్లిదండ్రులు.. జోక్యం చేసుకున్నారు. దీంతో టీచర్ వారిని కూడా కొట్టాడు. విద్యార్ధి తల్లి తల గ్రిల్‌కి తగిలి గాయమైంది.
విద్యార్ధి కుటుంబంపై దాడి చేయడంతో ఆగ్రహించిన MRJD కాలేజీ విద్యార్థులు.. ఉపాధ్యాయులు, ప్రిన్సిపాల్‌పై దాడిచేశారు. ఈ క్రమంలో టీచర్లు, విద్యార్థులు కొట్టుకున్నారు. ఘర్షణలో అభిషేక్ కుమార్, జనక్ నందనీ కుమారి, నిధి భారతి అనే విద్యార్ధులు గాయపడ్డారు. అభిషేక్ తల్లి లక్ష్మీదేవి, సోదరుడు కరణ్ కుమార్ తీవ్రంగా గాయపడటంతో వారిని హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. మరోవైపు ఈ సంఘటనపై రగిలిపోయిన విద్యార్థులు ఆగ్రహంతో కాలేజీ వద్ద బైఠాయించి ప్రిన్సిపాల్, టీచర్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు కాలేజీ వద్దకు చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. అలాగే సదర్ ఎస్‌హెచ్‌ఓ సుబోధ్‌కుమార్ హాస్పిటల్‌కు వెళ్లి బాధిత విద్యార్థుల స్టేట్‌మెంట్లను రికార్డ్ చేసి, ఎఫ్‌ఐఆర్ దాఖలు చేశారు. ఇక MRJD కాలేజీ టీచర్లు, విద్యార్థుల మధ్య జరుగుతున్న ఘర్షణకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.