Vishwak Sen చిత్రానికి అరుదైన గౌరవం

విశ్వక్‌ సేన్‌ (Vishwak sen) హీరోగా రూపొందిన చిత్రం ‘గామి’ (Gaami). ఈ చిత్రంతో విద్యాధర్‌ కాగిత దర్శకుడిగా పరిచయమయ్యారు.


చాందినీ చౌదరి కథానాయిక. గతేడాది విడుదలైన ఈ చిత్రం తాజాగా అరుదైన గౌరవాన్ని సొంతం చేసుకుంది. ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ రోటర్‌డామ్‌ 2025కు ఇది అధికారికంగా ఎంపికైంది. ఫిబ్రవరి 9వ తేదీ వరకూ జరగనున్న ఈ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో ఈ చిత్రాన్ని ప్రదర్శించనున్నారు. దీనిపై చిత్ర బృందం ఆనందం వ్యక్తంచేసింది.

ఎపిక్‌ అడ్వెంచర్‌ థ్రిల్లర్‌గా ‘గామి’ రూపొందింది. విశ్వక్‌సేన్‌ అఘోరా పాత్రలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. శంకర్‌ (విశ్వక్‌ సేన్‌) ఓ అఘోరా. తనెవరు.. గతమేంటి.. అనే విషయాలేం గుర్తుండవు. పైగా మనిషి స్పర్శను తట్టుకోలేని ఓ అరుదైన వ్యాధితో బాధ పడుతుంటాడు. దీంతో తోటి అఘోరాలంతా అతడిని శాపగ్రస్థుడుగా భావించి ఆశ్రమం నుంచి వెలివేస్తారు. ఈక్రమంలో తనని తాను తెలుసుకునేందుకు అన్వేషణ మొదలుపెడతాడు శంకర్‌. తన సమస్యకు పరిష్కారం హిమాలయాల్లోని ద్రోణగిరి పర్వతశ్రేణుల్లో 36 ఏళ్లకు ఒకసారి వికసించే మాలిపత్రాల్లో ఉందని ఓ స్వామీజీ ద్వారా తెలుసుకుంటాడు. అక్కడికి చేరుకోవాలంటే.. ఎన్నో ప్రమాదాలను దాటుకొని వెళ్లాలి. వాటన్నింటినీ లెక్క చేయకుండా డాక్టర్‌ జాహ్నవి (చాందిని చౌదరి)తో కలిసి అక్కడికి బయలుదేరుతాడు. ఆ తర్వాత ఏమైంది? మాలిపత్రాలు సాధించే క్రమంలో అతడికి ఎదురైన సవాళ్లేంటి? దేవదాసి దుర్గ (అభినయ) కూతురు ఉమ (హారిక) జ్ఞాపకాలు.. అతడిని ఎందుకు వెంటాడుతుంటాయి? వాళ్లతో శంకర్‌కు ఉన్న సంబంధం ఏంటి? అనే ఆసక్తికర విశేషాలతో ‘గామి’ని చిత్రీకరించారు. వేసవి కానుకగా మార్చి 8న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద మంచి విజయాన్ని అందుకుంది.