పెనుసవాల్‌గా ‘విటమిన్‌ డి’ లోపం

రాజధాని దిల్లీ సహా దేశంలోని మెట్రో నగరాల్లో ‘విటమిన్‌-డి’ లోపం నిశ్శబ్ద మహమ్మారిగా మారుతోంది.. ప్రజారోగ్యానికి పెనుసవాల్‌గా తయారవుతోంది. ఈ మేరకు ‘విటమిన్‌ డి లోపం.. దాని ప్రభావం’ తదితర అంశాలపై ‘ఇండియన్‌ కౌన్సిల్‌ ఫర్‌ రీసెర్చ్‌ ఆన్‌ ఇంటర్నేషనల్‌ ఎకనామిక్‌ రిలేషన్స్‌(ఐసీఆర్‌ఐఈఆర్‌-ఇక్రియెర్‌)’.. ‘అన్విక ఫౌండేషన్‌’ నిర్వహించిన సంయుక్త అధ్యయనం వెల్లడించింది. ప్రధానంగా దిల్లీ కేంద్రంగా నిర్వహించిన ఈ అధ్యయన నివేదికను ఇటీవలే కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖకు అందజేశారు. దేశవ్యాప్తంగా ప్రతి ఐదుగురిలో ఒకరు ఈ లోపంతో బాధపడుతున్నారని ‘ఇక్రియెర్‌-అన్వికా 2025’ రిపోర్టు చెబుతోంది. మెట్రో నగరాల్లో మొత్తంగా 71 శాతం మందిలో ఈ లోపం ఉన్నట్లు తెలిపింది. అధిక జనసాంద్రత, కాలుష్యం ఉన్న దిల్లీ తరహా నగరాల్లో ఈ సమస్య మరింత తీవ్రంగా మారిందని నివేదిక స్పష్టం చేసింది. మెట్రో నగరాల్లో 94 శాతం మంది నవజాత శిశువుల్లో ఈ లోపం ఉన్నట్లుగా గుర్తించింది. ఈ మహానగరాల్లో వృద్ధులు, గర్భిణులు, యువత 90 శాతానికిపైగానే విటమిన్‌ డి లేమితో బాధపడుతున్నట్లు తేల్చింది. ఈ లోపం బాల్యంలోనే ఎముకలు వంగిపోయేలా చేసి చిన్నారుల జీవితాలకు శాపంగా మారుతోందని పేర్కొంది. భారత్‌లో చేపట్టాల్సిన తక్షణ కార్యాచరణను ఈ అధ్యయన నివేదిక వెల్లడించింది.


ఉచిత ఆరోగ్యాన్ని వదులుకుంటున్నాం..

పొద్దున్నే సూర్యుడు ఉదయించే సమయానికి ఎండపొడ మీద పడేట్లు పనులు చేసుకుంటే.. పైసా ఖర్చు లేకుండా ‘విటమిన్‌ డి’ పొందొచ్చు. తేలికపాటి దుస్తులు వేసుకొని 40-45 నిమిషాలు వాకింగ్‌ చేసినా.. యోగాసనాలు వేసినా.. సూర్యకిరణాలు మన ఒంటిని స్పృశిస్తాయి. కానీ, ఆధునిక జీవనశైలిలో.. చుట్టూ బహుళ అంతస్తుల మధ్యలో.. పొద్దున్నే సూర్యుడిని చూడడం ఎక్కువ మందికి అలవాటు తప్పింది. ఒకవేళ వాకింగ్, యోగాసనాలు చేస్తున్నా.. శరీరాన్ని పూర్తిగా కప్పి ఉంచే దళసరి దుస్తులు వేసుకోవడం పరిపాటిగా మారింది. ఫలితంగా సూర్యకిరణాలు మన ఒంటిని తాకే అవకాశమే ఉండడం లేదు. కనీసం 40-45 నిమిషాలు మన శరీరానికి ఎండ తాకితే గానీ.. ‘విటమిన్‌ డి’ మనకు లభించదని నిపుణులు చెబుతున్నారు. దిల్లీ, కోల్‌కతా, ముంబయి, బెంగళూరు, హైదరాబాద్, చెన్నై తదితర మెట్రో నగరాల్లో ఉరుకులు పరుగుల జీవితాలు అతి సాధారణమయ్యాయి. ఉద్యోగ, చదువు ఒత్తిళ్ల వల్ల ఆట స్థలాలు, బహిరంగ ప్రదేశాల్లో గడిపే సమయం తగ్గింది. వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ సంస్కృతి, పాఠశాలల్లో ఆట స్థలాల కొరత, అపార్ట్‌మెంట్‌ జీవనం వల్ల సూర్యరశ్మి సోకే సమయం తగ్గిపోతోంది. దీంతో పాటు అధిక జనసాంద్రత, వాతావరణ మార్పులు, కాలుష్యం, ఆహార పరిమితులు కూడా ‘విటమిన్‌ డి’ని తగినంతగా దక్కకుండా చేస్తున్నాయి.

దీని వల్ల అనర్థాలు

ఈ లోపం రాన్రానూ ప్రజారోగ్యానికి పెనుముప్పుగా పరిణమిస్తోందని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ తెలిపింది. ఈ లోపం వల్ల..

  • చిన్నారుల్లో రికెట్స్‌(ఎముకలు వంగిపోవడం), ఛాతీలో గుంటలాగా మారడం, కళ్లు సొట్టబడడం
  • పెద్దల్లో ఆస్టియోమలేసియా(ఎముకల్లో సూక్ష్మమైన పగుళ్లు రావడం)
  • ఆస్టియోపొరోసిస్‌(ఎముకలు పెలుసుబారడం)
  • శారీరక బలహీనత, ఎముకల నొప్పులు
  • గర్భస్థ శిశువుల ఎముకల ఎదుగుదలలో లోపాలు వంటివి తలెత్తే ప్రమాదం ఉంది.
  • మన దేశంలో ఎండలు కొంచెం ఎక్కువగా ఉంటాయి కాబట్టి.. శరీరమంతా దుస్తులను కప్పిఉంచుతాం. విటమిన్‌ డి అనేది ఆహార పదార్థాల్లో తక్కువగా ఉంటుంది. అందుకే సహజసిద్ధంగా సూర్యరశ్మి ద్వారా మన శరీరంలో తయారవడం తేలికైన పని. ఆధునిక జీవనశైలిలో భాగంగా మనపై సూర్యకిరణాలు ఎక్కువగా పడడం లేదు. బయటకు వెళ్లినా.. ముఖానికి, చేతులకు సన్‌స్క్రీన్‌ లోషన్స్‌ రాసుకుంటున్నారు. శరీరాన్ని దాదాపుగా కప్పి ఉంచేలా దుస్తులు ధరిస్తున్నారు. పిల్లలకు కూడా పాఠశాలల్లో ఆటలు లేవు. జీవనశైలిలో మార్పులు అవసరం. సూర్యుడు ఉదయించే వేళ సుమారు 40 నిమిషాలు కిరణాలు పడేలా పనులు చేయడం, వ్యాయామం, యోగా వంటివి చేయాలి. ఇతర దేశాల్లోనూ ఈ సమస్య ఉంది.. అయితే అక్కడ ఆహారంలో ‘విటమిన్‌ డి’ని అదనంగా కలుపుతున్నారు. మన దగ్గర కూడా ఈ విధానాన్ని తీసుకురావాలి. కేంద్ర ప్రభుత్వం ‘ఎనీమియా ముక్త్‌ భారత్‌’ పథకం కింద ‘ఐరన్‌ అండ్‌ ఫోలిక్‌ యాసిడ్‌ సప్లిమెంట్స్‌’ను ఆహారంలో కలిపి పంపిణీ చేస్తోంది. ఇదే తరహాలో ‘విటమిన్‌ డి’ ఫోర్టిఫైడ్‌ సప్లిమెంట్‌ ఆహారాన్ని కూడా అందించాలి. ప్రచార సాధనాల ద్వారా ప్రజల్లో దీని ప్రాధాన్యంపై అవగాహన కల్పించాలి. చిన్నతనం నుంచే పాఠశాలలు, కళాశాలల్లో రక్తపరీక్షలు నిర్వహించి.. ‘విటమిన్‌ డి’ లోపాన్ని గుర్తించి, తక్షణమే దిద్దుబాటు చర్యలు చేపట్టాలి. బస్తీ, పల్లె దవాఖానాలు, పీహెచ్‌సీల్లోనూ పరీక్షలు నిర్వహించాలి. పోషకాహార పథకాలతో అనుసంధానం చేస్తే పిల్లలు, గర్భిణులు, వృద్ధులకు దీర్ఘకాల ప్రయోజనం ఉంటుంది. విటమిన్‌ డి లోపాన్ని గుర్తిస్తే.. వైద్యుడి సలహా మేరకు మాత్రలు, ఇంజెక్షన్లు తీసుకోవాలి. కానీ, సొంతంగా వాటిని తీసుకోవద్దు.
👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.