Vote From Home: ఇకపై ఇంటి నుంచే ఓటేయొచ్చు.. దానికి ఎవరు అర్హులో ? ఎలా అప్లై చేసుకోవాలో తెలుసా?

www.mannamweb.com


Vote From Home: కరోనా మహమ్మారి వచ్చిన తరువాత వర్క్ ఫ్రం హోం అంటే చాలా మందికి తెలిసింది. కానీ ఓట్ ఫ్రమ్ వర్క్ అనే ఒక పద్దతి ఉందని ఎంత మందికి తెలుసు. అదేనండి ఇంటి నుంచే ఓటు వేసే విధానం అమల్లోకి వచ్చిందని ఇప్పటికీ చాలా మందికి తెలియదు. ప్రపంచంలోని అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్ లో లోక్ సభ ఎన్నికలు జరుగబోతున్నాయి. అయితే కేంద్ర ఎన్నికల సంఘం కొంత కాలం కిందట తీసుకొచ్చిన కీలక సంస్కరణల్లో ఒకటి.. ఇంటి నుంచి ఓటు వేసే విధానం..ఈ పద్దతిపై ఇంకా చాలా మందికి అవగాహన లేదు. అసలు ఇంటి నుంచి ఓటు ఎలా వేయొచ్చు. దానికి అర్హులు ఎవరు. ? ఇంటి నుంచి ఓటు వేయాలంటే ఏం చేయాలి ? ఎవరిని సంప్రదించాలి ? ఉండాల్సిన పత్రాలు ఏంటి వంటివి ఈ స్టోరీలో తెలుసుకుందాం.

Vote From Home: లోక్ సభ ఎన్నికల కోసం గత నెలలో కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. మొత్తంగా ఏడు దశల్లో ఎన్నికలకు నిర్వహిస్తామని తెలిసింది. లోక్ సభ ఎన్నికలతో పాటు పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు కూడా చేపడుతామని స్పష్టం చేసింది. అయితే పోలింగ్ బూత్ వద్దకు వచ్చి ఓటు వేయలేని పరిస్థితిలో ఉన్న వికలాంగులు, వృద్ధులకు ఇంటి నుంచే ఓటు వేసే సౌకర్యాన్ని ఈ ఎన్నికల్లో పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకొచ్చింది. 85 ఏళ్లు పైబడిన వృద్ధులు, 40 శాతం అంగవైకల్యం ఉన్నవారు దీనికి అర్హులు.

వీరు ఇంటి నుంచే ఓటు వేసే పద్దతిని వినియోగించుకోవచ్చు. దేశవ్యాప్తంగా 81 లక్షల కంటే ఎక్కువ మంది వృద్ధులు, 90 లక్షల కంటే ఎక్కువ మంది దివ్యాంగులు ఈ ఓటర్లు తమ పేర్లు నమోదు చేసుకున్నారు. ఇంటి నుంచే ఓటు వేసినప్పటికీ.. ఆ ఓటు ఎవరికి పడిందనేది ఓటరుకు తప్ప బూత్ లో వేసినట్టుగానే పూర్తి గోప్యంగా ఉంటుంది. పోలింగ్ సిబ్బంది, భద్రతా సిబ్బంది సమక్షంలో అత్యంత స్వేచ్ఛగా ఈ ఓటు హక్కును వినియోగించుకోవచ్చు.

ఈ ఓట్ ఫ్రమ్ హోం విధానం పొందటం కూడా చాలా సులవైనదే. ఎన్నికలో నోటిఫికేషన్ విడుదలైన 5 రోజుల లోపు అర్హులైన వికలాంగులు, వృద్దులు ఫారం 12డీని పూర్తి చేయాలి. దానిని సహాయకుల ద్వారా రిటర్నింగ్ ఆఫీసర్ కు అందించాలి. దివ్యాంగులు అయితే తమ వైకల్యాన్ని ధృవీకరించే, ప్రభుత్వం అందించిన పత్రాన్ని దానికి జత చేయాల్సి ఉంటుంది. తరువాత ఎన్నికల అధికారులు ఆ ఫారంలను పరిశీలిస్తారు. అర్హులెవరనేది తేలుస్తారు.

అనంతరం ప్రత్యేక పోలింగ్ సిబ్బంది అర్హులైన ఓటర్ల ఇంటికి వస్తారు. ఆ ఓటరకు సురక్షితమైన, సౌకర్యవంతమైన, స్వేచ్చాయుత పద్దతిలో ఓటు హక్కును వినియోగించునే అవకాశాన్ని కల్పిస్తారు. ఏ సమయానికి ఇంటికి వస్తారనే విషయాన్ని సిబ్బంది ముందుగానే ఓటర్లకు తెలియజేస్తారు. ఎస్ఎంఎస్ ద్వారా, లేదా బీఎల్ వో ద్వారా ఈ సమాచారాన్ని ఓటరుకు అందిస్తారు. ఈ సదుపాయం వల్ల వికలాంగులు, వృద్ధులు వ్యయ ప్రయాసలకు ఓర్చి పోలింగ్ కేంద్రానికి రావాల్సిన ఇబ్బంది ఉండదు. ప్రజా ప్రతినిధులను ఎన్నుకోవడంలో వారి నిర్ణయం కూడా పరిగణలోకి వస్తుంది.