Walking : తిన్న తర్వాత నడుస్తున్నారా? అయితే కచ్చితంగా తెలుసుకోవాల్సిందే.

Walking : తిన్నామా, పడుకున్నామా, తెల్లారిందా ఇదే కొందరి లైఫ్. అయితే తిన్న తర్వాత పడుకోకుండా కాస్తైనా నడిచే అలవాటు ఉందా? లేదంటే వెంటనే చేసుకోండి. దీని వల్ల మీ జీర్ణక్రియ మెరుగుపడుతుంది. అంతేకాదు మెరుగైన ఆరోగ్యం కోసం ప్రతిసారి భోజనం తర్వాత కొద్దిసేపు నడవాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయాల్సిందే. తిన్న తర్వాత, కాస్త నడవడం వల్ల అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను ఉన్నాయి. ఇంతకీ తిన్న తర్వాత ఎందుకు నడవాలి? అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.


తిన్న తర్వాత కాసేపు అలా నడవడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. కడుపు కండరాలు, ప్రేగులు ప్రేరేపించబడతాయి. అంటే జీర్ణక్రియకు నడక సాయపడుతుంది. ఆహారం వేగంగా కదలడానికి వీలు కలుగుతుంది. ఇది గుండెల్లో మంట, మలబద్ధకం, ఉబ్బరం, ఆమ్లత్వం, కడుపు నొప్పి వంటి సమస్యలను నివారిస్తుంది.

మీకు మధుమేహం ఉందా. అయితే మీకు నడక మరింత ఎక్కువ అవసరం అని తెలుసుకోండి. భోజనం తర్వాత వ్యాయామం చేయడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంచుతుంది నడక. అంతేకాదు..రోజంతా రక్తంలో చక్కెర స్థాయిలను మెరుగుపరుస్తుంది మీ చిన్న పాటి వ్యాయామం.

కేలరీలను బర్న్ చేయడంలో సహాయం చేస్తుంది నడక. తొందరగా బరువు కూడా తగ్గవచ్చు. నడవడం వల్ల మానసిక ఆరోగ్యం కూడా బాగుంటుంది. అలాగే, గుండె ఆరోగ్యాన్ని సైతం మెరుగుపరుస్తుంది. శక్తి స్థాయిలను మరింత మెరుగుపరుస్తుంది. మీ కండరాలు, ఎముకలను బలోపేతం చేయడం వంటి ఎన్నో ప్రయోజనాలను చేకూరుస్తుంది. అంతేకాదు ఇలా నడవడం వల్ల రక్తపోటును నియంత్రిస్తుంది నడక అని కొన్ని అధ్యయనాలు తెలుపుతున్నాయి. మీరు హైపర్‌టెన్సివ్‌గా ఉంటే.. తిన్న తర్వాత క్రమం కచ్చితంగా నడవండి.

నడక వల్ల శరీరం రిలీఫ్ అవడమే కాదు నిద్రలేమి సమస్యను నియంత్రిస్తుంది. తినడం తర్వాత జీర్ణ రుగ్మతలను తొలగించి.. మంచి నిద్రను ప్రోత్సహించడంలో సహాయం చేస్తుంది. అయితే భోజనం, నడక మధ్య 10 నుంచి 15 నిమిషాల గ్యాప్ ఉండాలి అంటున్నారు నిపుణులు. అలాగే, ఏదైనా అసౌకర్యంగా అనిపిస్తే నడక వేగాన్ని కాస్తంతా తగ్గించండి. మరో ముఖ్యమైన విషయం ఉదయం వాక్ కూడా చాలా మంచిది అని గుర్తు పెట్టుకోండి.