ఈ రోజుల్లో ప్రతి ఒక్క ఇంట్లో వాషింగ్ మెషిన్ ను వాడుతున్నారు. కానీ వీటిని సరైన పద్దతిలో వాడాలి. లేదంటే దుస్తులు పాడవుతాయి. అలాగే వాషింగ్ మెషిన్ కూడా తొందరగా పాడవుతుంది.
ఒకప్పుడు అయితే ఎన్ని దుస్తులున్నా చేతులతోనే ఉతికేసేవారు. కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరూ బిజీ అయిపోయారు. అలాగే చేతులతో దుస్తులను ఉతికేసేంత ఓపిక కూడా జనాలకు తగ్గిపోయింది. అందుకే ప్రతి ఒక్క ఇంట్లో వాషింగ్ మెషిన్లను వాడుతున్నారు. దీనిలో దుస్తులను సులువుగా ఉతకొచ్చు. ఎన్ని డ్రెస్ లు ఉన్నా చకాచకా మెషిన్ వాష్ చేసేస్తుంది. దీనిలో వాష్ చేసిన బట్టలు తొందరగా ఆరిపోతాయి కూడా.
మార్కెట్లో రెండు రకాల వాషింగ్ మెషిన్ లు ఉన్నాయి. ఒకటి సెమీ ఆటోమేటిక్, రెండు ఫుల్లీ ఆటోమేటిక్. కానీ ఈ రెండింటిలో ఏ దాన్ని ఉపయోగించినా మీరు వీటిని సక్రమంగా ఉపయోగించకపోతే మాత్రం ఇవి దుస్తులకున్న మురికి సరిగ్గా పోదు. అలాగే వాషింగ్ మెషిన్ కు సంబంధించి సమస్యలు కూడా వస్తాయి. అందుకే వాషింగ్ మెషిన్ లో ఎలాంటి సమస్య లేకుండా బట్టలను ఎలా ఉతకాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
బట్టలు ఉతికేటప్పుడు ఈ తప్పులు చేయొద్దు
చాలా మంది వాషింగ్ మెషిన్ లో బట్టలను వాష్ చేసేటప్పుడు కొన్ని తప్పులు చేస్తుంటారు. కానీ దీనివల్ల మురికి బట్టలు మరింత మురికిగా మారతాయి. అలాగే వైట్ డ్రెస్సులపై మరకలు ఏర్పడతాయి. అందుకే రంగు రంగుల డ్రెస్సులను, వైట్ డ్రెస్సులను సపరేట్ గా వాష్ చేయాలి. ఇలా చేయడం వల్ల బట్టల రంగు పాడవదు. అలాగే దుస్తులు కూడా చెక్కుచెదరకుండా ఉంటాయి.
ఎక్కువ డిటర్జెంట్ ఉపయోగించొద్దు
చాలా మంది దుస్తులకున్న మురికి పోవాలని డిటర్జెంట్ ను ఎక్కువగా వాడుతుంటారు. ఎంత ఎక్కువ డిటర్జెంట్ వేస్తే దుస్తులు అంత తెల్లగా మెరుస్తాయని అనుకుంటారు. కానీ డిటర్జెంట్ ను ఎక్కువగా అస్సలు వాడకూడదు. ఎందుకంటే ఇది డ్రెస్ క్లాత్ ను దెబ్బతీస్తుంది. అలాగే రంగు మసకబారేలా చేస్తుంది. అందుకే ఎప్పుడైనా సరే డిటర్జెంట్ ను మోతాదులోనే వాడండి.
అలాంటి వాటిని వాషింగ్ మెషిన్ లో వేయకూడదు
మీరు గమనిస్తారో లేదో కానీ.. మనం కొనే ప్రతి డ్రెస్ పై అది వాషింగ్ మెషిన్ లో వేసేదా? లేదా? అని రాసి ఉంటుంది. వీటిని చదివితే మీకు ఏ దుస్తులు వేయాలో? ఏవి వేయకూడదో అర్థమవుతుంది. వాషింగ్ మెషీన్ లో ఉతకకూడని దుస్తులు కూడా ఉంటాయి. ఇలాంటి వాటిని చేతితోనే ఉతకాలి. వాషింగ్ మెషిన్ లో వేస్తే క్లాత్ పాడవుతుంది.
కొత్త బట్టల్లో జాగ్రత్తగా
కొత్త డ్రెస్సులు అంటే ఒకటి రెండు సార్లు ఉపయోగించిన దుస్తులను కూడా వాషింగ్ మెషిన్ లో ఉతుకుతుంటారు. కొత్త డ్రెస్ రంగుపోయే ప్రమాదం ఉంది. అందుకే కొత్త డ్రెస్ లను పాత డ్రెస్సులతో పాటుగా వాషింగ్ మెషిన్ లో వేయకూడదు. లేదంటే దీని రంగు ఇతర దుస్తులకు కూడా అంటుకుంటుంది. అలాగే వీటిని ముందు నీళ్లతో వాష్ చేయాలి.