మాది చిన్న దేశమే.. బెదిరించడం తగదు: మాల్దీవుల అధ్యక్షుడు ముయిజ్జు

We are a small country.. It is not appropriate to threaten: President of Maldives Muijju
బీజింగ్‌/ మాలె: ”భౌగోళికంగా మాది చిన్న దేశమే కావచ్చు. అంతమాత్రాన మమ్మల్ని బెదిరించడం మాత్రం తగదు. దానికి ఎవరికీ లైసెన్సు ఇవ్వలేదు” అని మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్‌ ముయిజ్జు పేర్కొన్నారు.


చైనాలో అయిదు రోజుల పర్యటనను ముగించుకుని శనివారం ఆయన స్వదేశానికి చేరుకున్నారు. భారత ప్రధాని నరేంద్రమోదీపై మాల్దీవుల మంత్రుల వ్యాఖ్యలతో దౌత్య వివాదాలు నెలకొన్న నేపథ్యంలో ముయిజ్జు విలేకరులతో మాట్లాడారు. నేరుగా ఏ దేశం పేరూ ప్రస్తావించకుండానే కొన్ని వ్యాఖ్యలు చేశారు. ‘..ఈ మహా సముద్రంలో మావి చిన్న ద్వీపాలే.

కానీ మాకు సముద్రంలో 9 లక్షల చదరపు కి.మీ. ప్రత్యేక ఆర్థిక మండలి (ఈఈజడ్‌) ఉంది. ఇంతపెద్ద వాటా ఉన్న దేశాల్లో మాది ఒకటి. ఈ మహా సముద్రం ఏ ఒక్క దేశానికో చెందదు.

ఇది దీనిచుట్టూ ఉన్న దేశాలన్నింటిది. మేం ఎవరి పెరడులోనో లేం. ఓ స్వతంత్ర, సార్వభౌమ దేశం మాది’ అని చెప్పారు. మరోవైపు మాల్దీవుల అంతర్గత వ్యవహారాల్లో ఏ దేశం జోక్యం చేసుకున్నా గట్టిగా వ్యతిరేకిస్తామని చైనా ప్రకటించింది.