కొందరు పై చదువుల కోసం విదేశాలకు వెళ్తుంటారు, మరికొందరు జాబ్ ద్వారా అక్కడ సెటిల్ అయ్యేందుకు వెళ్తుంటారు. ఇలా కొన్ని కారణాల వల్ల ఇండియా నుండి ఇతర దేశాలకు వెళ్లే వాళ్ళు ప్రతి ఏడాది చాలా మంది ఉన్నారు. కానీ దీనికి సంబందించి సంపనులు లేదా అత్యంత ధనవంతులు మాటలు ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. ఏంటంటే భారతదేశంలో రూ. 25 కోట్ల కంటే ఎక్కువ ఆస్తులు ఉన్న వారిని మనం అత్యంత ధనవంతులు లేదా సంపన్నులు, కోటీశ్వరులు అని పిలుస్తాము. అయితే ఈ విషయంలో అత్యంత సంపద ఉన్న ప్రతి ఐదుగురు కోరీశ్వరుల్లో ఒకరు ఇండియా విడిచి వెళ్లాలనుకుంటున్నట్లు చెప్పారు.
ఇటీవల, కోటక్ మహీంద్రా బ్యాంక్ ప్రైవేట్ బ్యాంకింగ్ విభాగం తరపున భారతదేశంలోని అత్యంత సంపన్న వ్యక్తులపై ఒక సర్వే నిర్వహించింది. దేశంలోని 12 నగరాల్లో నివసిస్తున్న 150 మంది అధిక నికర విలువ ఉన్న వ్యక్తులపై కోటక్ మహీంద్రా బ్యాంక్ ప్రైవేట్ బ్యాంకింగ్ విభాగం ఈ అధ్యయనాన్ని నిర్వహించింది. ఈ అధ్యయనం 2024-25 మొదటి రెండు త్రైమాసికాలలో చేయగా, ఈ అధ్యయనంలో రూ. 25 కోట్ల కంటే ఎక్కువ ఆస్తులు ఉన్న వారిని వివిధ ప్రశ్నలు అడిగి, ఇంటర్వ్యూ చేశారు.
వీరిలో ప్రతి ఐదుగురిలో ఒకరు భారతదేశం విడిచి వెళ్లాలనుకుంటున్నట్లు చెప్పారు. ఈ నిర్ణయానికి గల కారణాలలో విదేశాలలో లభించే పన్ను రాయితీలు, పిల్లల భవిష్యత్తు అలాగే పర్యావరణ కాలుష్యం టాప్’లో ఉన్నాయి. 25 కోట్ల కంటే ఎక్కువ విలువైన ఆస్తులు ఉన్న వ్యక్తులు తమ పెట్టుబడి మార్గాలను చురుగ్గా పెంచుకుంటు, మార్చుకుంటున్నారని కూడా నివేదికలో పేర్కొంది. దీని ప్రకారం, వీళ్ళు దేశీయంగానే కాకుండా విదేశాలలో కూడా పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా విదేశాలలో స్టాక్ మార్కెట్లు, రియల్ ఎస్టేట్ రంగాలలో పెట్టుబడులు పెట్టడంపై దృష్టి పెడుతున్నారు. ఈ విషయంలో ఈ అధ్యయనంలో పాల్గొన్న ప్రతి ముగ్గురిలో ఒకరు విదేశాల్లోని ఆస్తుల్లో పెట్టుబడి పెట్టారని వెల్లడైంది.
కరోనావైరస్ మహమ్మారి తర్వాతే చాలా మంది సంపన్నులు వారి పెట్టుబడులను పెంచుకోవడం వైపుతో మనస్తత్వాన్ని కూడా మార్చుకున్నారు. ఈ కారణంగా వీరు విదేశీ రియల్ ఎస్టేట్, ఈక్విటీ మార్కెట్లను పరిశీలిస్తున్నారని కూడా పేర్కొంది. అధిక నికర విలువ ఉన్న వ్యక్తుల ఖర్చు అలవాట్లను చూస్తే, వీరు ఎక్కువగా తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఎక్కువ ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తుంది. అంతేకాదు మరోపక్క వారు తమ పిల్లల చదువు కోసం ఎక్కువ ఖర్చు చేస్తున్నారు. ఇంకా, చాలా మంది వాళ్ళ పిల్లలు విదేశాలలో చదువుకోవడానికి లేదా జాబ్ చేయడానికి, విదేశాలలో రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడి పెడతామని సమాధానం ఇచ్చారు. విదేశాల్లో స్థిరపడాలనుకునే చాలా మంది భారతీయులకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఒక ఇష్టమైన గమ్యస్థానంగా ఉంది. అక్కడ ఆదాయపు పన్ను లేదని, జీవన నాణ్యత మెరుగ్గా ఉందని ఉదాహరణగా చెబుతున్నారు.