ఆంధ్రప్రదేశ్‌లో అంగన్‌వాడీ కార్యకర్తలకు రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్ వేణుగోపాల్‌రెడ్డి శుభవార్త చెప్పారు. నెల రోజుల్లో 5జీ నెట్‌వర్క్‌తో కొత్త మొబైల్స్ ఇస్తామని తెలిపారు.ఇండక్షన్ స్టవ్ వాడటానికి ప్రతీ నెలా రూ.500 విద్యుత్ ఛార్జీలు ప్రభుత్వమే చెల్లిస్తుందని చెప్పారు.
సామాజిక భద్రత పింఛన్ల పంపిణీకి అంగన్‌వాడీలను వాడకూడదని కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చారు. గుంటూరులోని మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యాలయంలో డైరెక్టర్ వేణుగోపాల్‌రెడ్డి సీఐటీయూ, ఏఐటీయూసీ, ఐఎఫ్‌టీయూ అనుబంధ అంగన్‌వాడీ సంఘాల ప్రతినిధులతో మాట్లాడారు. ప్రభుత్వం ఇప్పటికే గ్రాట్యుటీ అమలుతో పాటుగా రాష్ట్రవ్యా్ప్తంగా మినీ అంగన్వాడీలను మెయిన్ అంగన్వాడీలుగా మారుస్తూ ఉత్తర్వులు జారీ చేసిన విషయాన్ని గుర్తు చేశారు. మరికొన్ని సాంకేతిక సమస్యలు, ఇతర సమస్యలు పరిష్కరిస్తామన్నారు.
ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అంగన్‌వాడీల సమస్య పరిష్కారంపై పలు సానుకూల నిర్ణయాలు తీసుకుందన్నారు రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్ వేణుగోపాల్‌రెడ్డి. అంతేకాదు అంగన్‌వాడీలలో సంక్షేమ పథకాలను అర్హులైన వారందరికీ అందిస్తామని హామీ ఇచ్చారు. అంగన్‌వాడీలకు కొన్ని జిల్లాల్లో (కృష్ణా, అనంతపురం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలు) బీఎల్వో విధుల నుంచి మినహాయింపు ఇస్తామన్నారు. పోషణ ట్రాకర్‌లో నమోదు చేసిన వివరాలను సంజీవని యాప్‌లో మళ్లీ నమోదు చేయాల్సిన అవసరం లేదని తెలిపారు. దీనివల్ల అంగన్‌వాడీ కార్యకర్తలకు పని భారం తగ్గుతుంది అంటున్నారు.
వేతనాలు వెంటనే పెంచాలని కోరామన్నారు అంగన్‌వాడీల సంఘాల ప్రతినిధులు. జీతాలు పెంచకపోతే లేకపోతే ఆందోళన చేస్తామని హెచ్చరించారు. పోషణ ట్రాకర్ యాప్‌లో నమోదు చేయని వాటిని మాత్రమే బాల సంజీవని యాప్‌లో నమోదు చేయాలని డైరెక్టర్ చెప్పారని తెలిపారు. గ్రాట్యుటీ అమలు చేయడానికి లేబర్ డిపార్ట్‌మెంట్ సలహా తీసుకుని గైడ్‌లైన్స్ తయారు చేస్తున్నారని చెప్పారన్నారు. అర్హత విషయంలో 1810 మంది మినీ వర్కర్లకు మినహాయింపు ఇవ్వాలని కోరినట్లు తెలిపారు. వేసవి సెలవులు నెల రోజుల పాటు ఇవ్వడానికి అధికారులు అంగీకరించారని చెప్పారు. జూన్ 2025 వరకు అన్ని రకాల బిల్లులకు బడ్జెట్ కేటాయించినట్లు అధికారులు తెలిపారని ప్రతినిధులు పేర్కొన్నారు.
ఐదేళ్ల క్రితం ప్రభుత్వం ఇచ్చిన మొబైల్స్‌ను అంగన్‌వాడీ కార్యకర్తలు వెనక్కి ఇచ్చేశారు. సిమ్‌లతో సహా వాటిని తిరిగి ఇచ్చేశారు. పాత ఫోన్లు ఇప్పుడు పనికి రావని వారు అంటున్నారు. 2GB ర్యామ్, 4G నెట్‌వర్క్‌తో ఉన్న ఫోన్లు ఇప్పుడున్న టెక్నాలజీకి సరిపోవడం లేదు. యాప్‌ల వల్ల పని ఒత్తిడి ఎక్కువైందని వారు చెబుతున్నారు. ప్రభుత్వం ఐదేళ్ల క్రితం అంగన్‌వాడీ కార్యకర్తలకు మొబైల్స్ ఇచ్చింది. అప్పటి టెక్నాలజీతో ఆ ఫోన్లు వచ్చాయి. ఇప్పుడు వాటితో పని చేయడం కష్టంగా ఉందని కార్యకర్తలు అంటున్నారు. ఈ ఫోన్లతో ఎలా పని చేయగలరో ఆలోచించడం లేదన్నారు. వెంటనే 5G నెట్‌వర్క్‌తో కొత్త ట్యాబ్‌లను, మొబైల్స్‌ను ఇవ్వాలని కోరుతున్నారు. ఈ మేరకు ప్రభుత్వం కొత్త మొబైల్స్ ఇష్తామని ప్రకటించింది.
































