WhatsApp Sensational Comments: వాట్సాప్ సంచలన కామెంట్స్ చేసింది. ఎండ్ టూ ఎండ్ ఎన్‌క్రిప్షన్‌ను రద్దు చేయాలనుకుంటే భారత్ నుంచి నిరభ్యంతరంగా వెళ్లిపోతామని వాట్సాప్ ఢిల్లీ హైకోర్టుకు స్పష్టం చేసింది. వినియోగదారుని గోప్యత దృశ్యా తాము ఎన్‌క్రిప్షన్‌ను విచ్ఛిన్నం చేయమని ఒకవేళ అలాంటి పరిస్థితి ఏర్పడితే వాట్సాప్‌ను భారతదేశంలో నిలిపివేస్తామని మెటా కంపెనీ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఎండ్ టూ ఎండ్ ఎన్‌క్రిప్షన్ ద్వారా మెసేజ్ కంటెంట్‌ను పంపినవారు, గ్రహీత మాత్రమే చదవగలరని.. దానిని విచ్ఛిన్నం చేస్తే వినియోగదారుని గోప్యతకు భంగం కలిగించినట్లేనని పేర్కొన్నారు.
వాట్సాప్, ఫేస్‌బుక్‌ల మాతృ సంస్థ మెటా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (మధ్యవర్తి మార్గదర్శకాలు, డిజిటల్ మీడియా ఎథిక్స్ కోడ్) రూల్స్ 2021ని సవాలు చేస్తున్నాయి. ఈ రూల్స్ ప్రకారం కంపెనీలు చాట్‌లను ట్రేస్ చేయడం, మెసేజ్ మూలాలను గుర్తించడం అవసరం.
వాట్సాప్‌ను ప్రజలు ఉపయోగిస్తున్నారు. వాట్సాప్ అందించే గోప్యతా లక్షణాల కారణంగా, భారతదేశంలో 400 మిలియన్లకు పైగా వినియోగదారులు వాట్సాప్‌ను వాడుతున్నారని న్యాయవాది తెలిపారు. కంటెంట్ ఎన్‌క్రిప్షన్‌తో పాటు వినియోగదారుల గోప్యతను దెబ్బతీసే ఏవైనా నియమాలు భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, 19, 21 కింద ఇచ్చిన ప్రాథమిక హక్కులను ఉల్లంఘిస్తాయని వాట్సాప్ వాదించింది.
కంపెనీ తరపు న్యాయవాది, “ఇలాంటి నిబంధన ప్రపంచంలో మరెక్కడా లేదు. బ్రెజిల్‌లో కూడా కాదు. దీని కోసం పెద్ద ఛైన్ సిస్టం డెవలప్ చెయ్యాలి. ఏ సందేశాలను డీక్రిప్ట్ చేయమని అడగుతారో మాకు తెలియదు. దీని అర్థం మిలియన్ల సందేశాలు కొన్ని సంవత్సరాల పాటు నిల్వ చేయాలి.” అని తెలిపారు.