Dola Sree Bala Veeranjaneya Swamy: రాష్ట్రంలో అప్పులపై త్వరలో శ్వేత పత్రం విడుదల చేస్తాం

Dola Sree Bala Veeranjaneya Swamy: రాష్ట్రంలో అప్పులపై త్వరలో శ్వేత పత్రం విడుదల చేస్తాం


ప్రజలు రాక్షస పాలన నుంచి రాష్ట్రానికి విముక్తి ప్రసాదించారని మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి అన్నారు. పరిపాలన దక్షుడు చంద్రబాబు క్యాబినెట్ లో మంత్రి పదవి దక్కటం అదృష్టమన్నారు.బాద్యతలు తీసుకున్న వెంటనే సీఎం హామీల అమలు మొదలు పెట్టారన్నారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ.. మాది విడతల వారీ ప్రభుత్వం కాదు.. చేతల ప్రభుత్వమన్నారు. ఐదు రోజుల్లో రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపులోకి తెచ్చామని తెలిపారు. తమ ముందు అనేక సవాళ్లు ఉన్నాయని..రాష్ట్రంలో అప్పులపై త్వరలో శ్వేత పత్రం విడుదల చేస్తామన్నారు. త్వరలో అసెంబ్లీలో పలు కీలక బిల్లులు ప్రవేశ పెట్టబోతున్నామని స్పష్టం చేశారు.

ఏపీ నిర్లక్ష్యానికి గురైన సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేస్తామని మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి హామీ ఇచ్చారు. జిల్లాలో మైనింగ్ కు మంచి రోజులు వచ్చాయన్నారు. ఎస్సీ కాలనీల్లో మూతబడిన పాఠశాలలు తెరిపిస్తామన్నారు. తమకు సచివాలయాలు, వాలంటీర్ల శాఖ ప్రకటించిన సమయం నుంచి నా మెయిల్లు, వాట్సాప్ లు నిండిపోయాయని తెలిపారు. బలవంతంగా మాతో రాజీనామాలు చేయించారని వాలంటీర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారన్నారు. ప్రస్తుతం ఉన్న వాలంటీర్లను కొనసాగిస్తామని హామీ ఇచ్చారు. పెరిగిన పెన్షన్లను ఒకటవ తేదీ నుంచి పంపిణీ చేస్తామని భరోసా ఇచ్చారు.

కాగా.. ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ నేతృత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటైంది. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నారా చంద్రబాబు నాయుడు.. తన టీమ్‌ను సైతం సిద్ధం చేసుకున్నారు. మంత్రులకు సైతం శాఖలు కేటాయించారు. అయితే మంత్రివర్గ ఏర్పాటు, శాఖల కేటాయింపులో.. వాలంటీర్లకు టీడీపీ ప్రభుత్వం శుభవార్త అందించింది. 24 మందికి శాఖలను కేటాయించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. సచివాలయం, గ్రామ వాలంటీర్ శాఖను ఏర్పాటు చేసి మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామికి అప్పగించారు.