Wedding Anniversary: వినూత్న రీతిలో వివాహ వార్షికోత్సవం జరుపుకున్న ఓ జంట.. కారణమేంటంటే..!

www.mannamweb.com


ఎవరైనా వివాహ వార్షికోత్సవాన్ని అందంగా ఇంట్లో సెలబ్రేట్ చేసుకుంటారు. అందరి సమక్షంలో వేడుకను జరుపుకుంటారు. కానీ ఈ జంట వినూత్న రీతిలో వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకుంది
ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రా నగరంలోని నాగ్లా కాలీ ప్రాంతంలో రోడ్డుపై మురికి కాలువ, చెత్తాచెదారం మధ్య ఓ జంట వధూవరుల వేషధారణలో తమ 17వ వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకుంది. అపరిశుభ్రత, చెత్త కుప్పల వైపు జిల్లా యంత్రాంగం దృష్టిని ఆకర్షించేందుకు దంపతులు ఇలా చేశామని తెలిపారు. దంపతులు ఒకరికొకరు పూలమాలలు వేసుకున్నట్లు కనిపిస్తుండగా, కొంతమంది తమ చేతుల్లో ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేస్తున్నారు. ప్లకార్డులపై ‘రోడ్లు, డ్రైన్లు సక్రమంగా నిర్మించకుంటే ఓటు వేయరు’ అని రాశారు.
15 ఏళ్లుగా ఈ సమస్య కొనసాగుతోందని వారు చెబుతున్నారు. గత ఎనిమిది నెలలుగా రోడ్డు మురికి కాలువగా, అధ్వానంగా తయారైందని అంటున్నారు. దీంతో ఆ ప్రాంత ప్రజలు బయటకు వెళ్లడం కష్టంగా మారింది. దాదాపు 30కి పైగా కాలనీల ప్రజలు ఈ రహదారి గుండా వెళుతుంటారు. అపరిశుభ్రత కారణంగా స్థానిక ప్రజలు ప్రస్తుతం రెండు కిలోమీటర్ల మేర వేరే దారిలో రావాల్సి వస్తోందని అంటున్నారు. ఆ ప్రాంతంలోని కాలనీల్లో ‘అభివృద్ధి లేదు, ఓటు లేదు’ అనే పోస్టర్లు కూడా అతికించినా ఫలితం లేకుండా పోయిందని వారు వాపోతున్నారు.
ఈ సమస్యలపై ప్రజాప్రతినిధులకు స్థానికులు ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అందువల్ల.. భగవాన్ శర్మ తన భార్య ఉమా శర్మతో కలిసి ఈ నిరసనను నిర్వహించాలని నిర్ణయించుకున్నారు. ఈ సందర్భంగా.. భగవాన్ శర్మ మాట్లాడుతూ గత 15 ఏళ్లుగా నిరంతరం కృషి చేస్తున్నామని తెలిపారు. ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులందరి వద్దకు వెళ్లాం. ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో ఈ విధంగా నిరసనకు దిగాల్సి వచ్చింది. ఈ అంశాన్ని పెద్ద ఎత్తున హైలైట్ చేసేందుకే నిరసన తెలియజేస్తున్నట్లు ఉమా శర్మ తెలిపారు.