శరీర బరువు నియంత్రణలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నవారికి ఊరటనిచ్చేలా యూకే ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. బరువు తగ్గించడంలో ఉపయుక్తంగా పనిచేస్తుందని పరిగణించబడుతున్న ‘మౌంజారో’ (Tirzepatide) ఇంజెక్షన్‌ను ఇకపై సాధారణ వైద్యులు (జీపీలు) కూడా సిఫార్సు చేయడానికి అవకాశం కల్పించింది.
ఇప్పటి వరకు ఇది ప్రత్యేకమైన బరువు తగ్గే సెంటర్ల ద్వారా మాత్రమే అందుబాటులో ఉండగా, ఇప్పుడు తీవ్రమైన ఊబకాయం, ఇతర సంబంధిత ఆరోగ్య సమస్యలున్న వారికి కూడా ఈ ఔషధాన్ని సులభంగా అందజేయవచ్చు.
ఈ ఔషధాన్ని అమెరికాకు చెందిన ఎలి లిల్లీ సంస్థ అభివృద్ధి చేసింది. ప్రారంభంలో ఇది టైప్ 2 మధుమేహం చికిత్స కోసం రూపొందించబడింది. మౌంజారో పనిచేసే విధానం శరీరంలో ఆహారం జీర్ణమయ్యే ప్రక్రియను మందగించడంతో పాటు, గ్లూకోజ్ స్థాయులను తగ్గించడంలో సహాయపడుతుంది. ఇందులోని టిర్జెపటైడ్ అనే యాక్టివ్ పదార్థం ఆకలిని నియంత్రించే హార్మోన్‌లను ఉత్తేజింపజేస్తుంది. తద్వారా భోజన పరిమితి లోపలే ఉండే అవకాశం పెరుగుతుంది.
బ్రిటన్‌లో నేషనల్ హెల్త్ సర్వీస్ (NHS) పర్యవేక్షణలో ఈ ఇంజెక్షన్‌ను ఇవ్వనున్నారు. వచ్చే మూడేళ్లలో దాదాపు 2.2 లక్షల మందికి మౌంజారో అందజేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
అయితే.. దీనికి కొన్ని దుష్ప్రభావాలూ ఉండే అవకాశం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. వీటిలో వికారం, వాంతులు, విరేచనాలు మొదలైనవి ఉన్నాయి. అందువల్ల ఈ మందును కేవలం వైద్యుల పర్యవేక్షణలో మాత్రమే వాడాలని హెచ్చరికలు జారీ అయ్యాయి. అంతేకాక.. దీన్ని తక్షణం బరువు తగ్గే సౌందర్య చికిత్సగా పరిగణించరాదని స్పష్టం చేశారు. మందు వాడే మహిళలు గర్భనిరోధక పద్ధతులు తప్పనిసరిగా పాటించాలన్న సూచన కూడా ఉంది.
ఇదిలావుండగా, మౌంజారోకు భారత్‌లో కూడా మంచి స్పందన లభిస్తోంది. మార్చిలో మార్కెట్లోకి వచ్చిన ఈ ఔషధం మే నాటికి 81,500 యూనిట్లకు పైగా విక్రయమై, దాదాపు రూ.24 కోట్ల ఆదాయం రాబట్టింది. ఏప్రిల్-మే మధ్య దాని విక్రయాలు 60% పెరిగాయని కంపెనీ వెల్లడించింది. డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచే పనిలో ఉన్నామని ఎలి లిల్లీ తెలిపింది. భారత్ లో ఒక మౌంజారో ఇంజెక్షన్ ధర రూ.3500 నుంచి రూ.4375 వరకూ ఉంది.
































