టాలీవుడ్‌ నవంబర్‌ రివ్యూ.. మెప్పించింది ఆ మూడు చిత్రాలేనా?

టాలీవుడ్‌లో ఓ సెంటిమెంట్‌ ఉంది. నవంబర్‌ నెలలో రిలీజ్‌ అయ్యే సినిమాలు పెద్దగా ఆడవని నమ్ముతారు. అందుకే ఈ నెలలో పెద్ద చిత్రాలేవి విడుదల కావు. గతేడాది అయితే అన్ని చిన్న చిత్రాలతో నవంబర్‌ నెల గడిచిపోయింది.


కానీ ఈ ఏడాది మాత్రం ఒకటి రెండు బడా చిత్రాలు కూడా బాక్సాఫీస్‌ వద్ద అదృష్టాన్ని పరీక్షించుకున్నాయి. దాంతో పాటు స్టార్‌ హీరోల హిట్‌ చిత్రాలు కూడా రీరిలీజ్‌ అయ్యాయి. మరి వాటిలో ఏవి హిట్‌ అయ్యాయి? ఏవి అపజయాన్ని మూటగట్టుకున్నాయి? ఓ లుక్కేద్దాం.

సెంటిమెంట్‌ ప్రకారమే.. ఈ ఏడాది నవంబర్‌ కూడా భారీ ఫ్లాప్‌తో ప్రారంభం అయింది. మంచి అంచనాలతో నవంబర్‌ 1న విడుదలైన రవితేజ ‘మాస్‌ జాతర’ బాక్సాఫీస్‌ వద్ద దారుణంగా బోల్తా పడింది. సినిమా రిలీజ్‌ అయిన తొలి రోజే సినిమాకు నెగెటివ్‌ టాక్‌ వచ్చింది. దీంతో ప్రేక్షకులు థియేటర్స్‌ వైపు కన్నెత్తి చూడలేదు.

ఇక ఆ తర్వాతి వారం ది గర్ల్‌ఫ్రెండ్‌, జటాధర, ది గ్రేట్‌ ప్రీవెడ్డింగ్‌ షో చిత్రంలో పాటు మరో ఐదారు చిన్న సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. వాటిల్లో ది గర్ల్‌ఫ్రెండ్‌ చిత్రానికి హిట్‌ టాక్‌ వచ్చింది. విమర్శకుల ప్రశంసలతో పాటు కలెక్షన్స్‌ కూడా భారీగానే రాబట్టింది. ఇక జటాధర మాత్రం అట్టర్‌ ఫ్లాప్‌ అయింది. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన చిన్న చిత్రం ‘ది గ్రేట్‌ ప్రీవెడ్డింగ్‌ షో’ మాత్రం ఊహించని విజయాన్ని అందుకుంది. మిగిలిన చిత్రాలన్ని ఒక్కరోజుతోనే థియేటర్స్‌ నుంచి బయటకు వచ్చేశాయి.

ఇక రెండోవారం(నవంబర్‌ 14) కాంత, జిగ్రీస్‌, సంతాన ప్రాప్తిరస్తు, గతవైభవంతో పాటు మరో నాలుగైదు సినిమాలొచ్చాయి. వాటిల్లో ఏ ఒక్క సినిమా కూడా సూపర్‌ హిట్‌ టాక్‌ని సంపాదించుకోలేకపోయింది. భారీ అంచనాల మధ్య వచ్చన కాంత.. తొలి రోజు మిక్స్‌డ్‌ టాక్‌ సంపాదించుకుంది. అయితే రెండో రోజు నుంచి మెల్లిగా పికప్‌ అవుతుందని ఆశించినా.. ప్రేక్షకులు మాత్రం ఈ ప్రయోగాత్మక చిత్రాన్ని తిరస్కరించారు. మిగిలినవన్నీ అపజయాన్ని మూటగట్టుకున్నాయి. అయితే ఇదే వారం రీరిలీజ్‌ అయిన శివ మాత్రం మంచి కలెక్షన్స్‌ని రాబట్టుకుంది.

ఇక నవంబర్‌ 21న అల్లరి నరేశ్‌ ’12 ఏ రైల్వేకాలనీ’, ప్రియదర్శి ‘ప్రేమంటే’, ‘రాజు వెడ్స్‌ రాంబాయి’, పాంచ్‌ మినార్‌తో పాటు మొత్తం 21 సినిమాలు రిలీజ్‌ అయ్యాయి. వాటిల్లో ఏ ఒక్కటి కూడా బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ కాలేదు. ఉన్నంతలో రాజు వెడ్స్‌ రాంబాయి మంచి విజయం సాధించింది. అల్లరి నరేశ్‌ 12 ఏ రైల్వేకాలనీ చిత్రం అయితే ఫస్ట్‌ షోకే నెగెటివ్‌ టాక్‌ని మూటగట్టుకొని..కనీస ఓపెనింగ్స్‌ రాబట్టుకోలేకపోయింది. ఇక మెగాస్టార్‌ చిరంజీవి ‘కొదమసింహం’తో పాటు కార్తి ‘ఆవారా’ చిత్రం కూడా ఈ వారంలోనే రీరిలీజ్‌ అయింది. ఈ రెండింటిని కూడా ప్రేక్షకులు పెద్దగా పట్టించుకోలేదు.

ఇక నవంబర్‌ చివరివారంలో రామ్‌ ‘ఆంధ్ర కింగ్‌ తాలుకా’తో, కీర్తి సురేశ్‌ ‘రివాల్వర్‌ రీటా’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఆంధ్రకింగ్‌ తాలుకా చిత్రానికి మిక్స్‌డ్‌ టాక్‌ వచ్చినా.. భారీ ఓపెనింగ్స్‌ అయితే రాబట్టుకోలేకపోయింది. రెండో రోజు నుంచి పుంజుకుంటుందని ఆశించినా.. అదీ జరగలేదు. రివాల్వర్‌ రీటా డిజాస్టర్‌ టాక్‌ని మూటగట్టుకుంది. మొత్తంగా నవంబర్‌ నెలలో 35పైగా చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వస్తే..వాటిలో ‘ది గర్ల్‌ఫ్రెండ్‌’, ‘ది గ్రేట్‌ ఫ్రీవెడ్డింగ్‌ షో’, ‘రాజు వెడ్స్‌ రాంబాయి’ మాత్రమే కాస్త అలరించాయి. రీరిలీజ్‌లలో శివ చిత్రం మంచి కలెక్షన్స్‌ని రాబట్టుకుంది. మిగిలిన చిత్రాలేవి ఆకట్టుకోలేకపోయాయి. డిసెంబర్‌లో అయిన టాలీవుడ్‌కి బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ దక్కుతుందో చూడాలి.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.