టీ, కాఫీ చాలా మంది ఎంతో ఇష్టంగా తాగుతుంటారు. అయితే, కొందరు ఒత్తిడి నుంచి ఉపశమనం, వర్క్ సమయంలో నిద్ర రాకుండా ఉండడానికి టీ తాగుతుండటం గమనిస్తూనే ఉన్నాం.
మరికొందరైతే అలవాటుగా రోజుకు మూడు లేదా నాలుగు సార్లు అయినా టీ తాగుతారు. ఇక, ఉదయం లేవగానే ఓ కప్పు టీ లేదా కాఫీ తాగనిదే రోజు మొదలు కాదు. అయితే టీ లేదా కాఫీ తాగడం వల్ల కొంత లాభాలు ఉన్నప్పటికీ వాటిని రోజుకు ఎన్ని సార్లు తీసుకుంటున్నాం, ఏ సమయంలో తీసుకుంటున్నామనే దానిపై కూడా ప్రభావం ఉంటుంది.
కొందరు భోజనానికి ముందు టీ, కాఫీలు తాగితే మరికొంతమంది మాత్రం తిన్న తర్వాతే తాగుతుంటారు. ఇలాంటి ఘటనలు మన చుట్టూ ఉన్న వారిలో కూడా గమనిస్తూనే ఉంటాం. కానీ, ఈ రెండు అలవాట్లు ఆరోగ్యానికి అస్సలు మంచివి కావని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. తినడానికి ముందు లేదా ఆ తర్వాత వెంటనే టీ తాగితే ఎలాంటి అనారోగ్య సమస్యలు వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం.
ఏ సమయంలో తీసుకుంటున్నారు..?
నిద్రలేచిన వెంటనే ఖాళీ కడుపుతో లేదా ఉదయాన్నే మొదటి ఆహార పదార్థంగా టీ, కాఫీలు తీసుకోకూడదని నిపుణులు సూచిస్తున్నారు. భోజన సమయంలో లేదా భోజనం చేసిన వెంటనే టీ, కాఫీలకు దూరంగా ఉండాలంటున్నారు. లేదంటే వాటిలోని ఆసిడిక్ లక్షణాలు జీర్ణక్రియకు ఆటంకం కలిగిస్తాయని చెబుతున్నారు. సాయంత్రం 4 గంటల తర్వాత వీటికి దూరంగా ఉంటే.. మంచి నిద్రపడుతుందని కాలేయ శుద్ధి, జీర్ణక్రియ మెరుగవుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
రోజుకు ఎన్ని కప్పుల టీ తాగుతున్నారు?
రోజుకు 6-7 కప్పుల టీ లేదా కాఫీ తాగే అలవాటు ఉన్నట్లయితే అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇలాంటి వారిలో కడుపు ఉబ్బరం, గ్యాస్ ట్రబుల్, నిద్ర సమస్యలు, తిన్న ఆహారం జీర్ణం కాకపోవడం లాంటి సమస్యలు తలెత్తుతాయి. అలాగే, టీ లేదా కాఫీ రోజుకు 3 కప్పులు లేదా అంతకంటే ఎక్కువ తాగే వ్యక్తులతో పోలిస్తే.. రోజుకు 1 కప్పు కంటే తక్కువ తాగేవారికి హార్ట్ స్రోక్ వచ్చే ప్రమాదం 21 శాతం తక్కువగా ఉందని పలు అధ్యయనాలు చెబుతున్నాయి.
































