సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్ల పరిస్థితేంటి? కలవరపెడుతున్న గూగుల్‌ సీఈవో ప్రకటన

www.mannamweb.com


గూగుల్‌ సీఈవో సుందర్ పిచాయ్ చేసిన ప్రకటన సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లను కలవరపెడుతోంది. కంపెనీ ఇటీవలి మూడో త్రైమాసిక 2024 అర్నింగ్‌ కాల్ సందర్భంగా ఆయన గూగుల్‌ కొత్త కోడ్‌లో 25 శాతం ఇప్పుడు కృత్రిమ మేధస్సు (AI) ద్వారానే రూపొందిస్తున్నట్లు వెల్లడించారు.

దీని వల్ల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు, కోడర్‌లు కలవరపడాల్సిన పనేంటి అంటే ఇది కోడింగ్ ల్యాండ్‌స్కేప్‌లో ప్రాథమిక మార్పును సూచిస్తోంది. ఇక్కడ పనిభారాన్ని ఏఐ ఎక్కువగా పంచుకుంటోంది. దీనివల్ల కోడర్‌లు పూర్తి తమ ఉద్యోగాలను కోల్పోతారని చెప్పడం లేదు. కానీ ఇంజనీర్‌లు ఉన్నత-స్థాయి సమస్య-పరిష్కారం, ఆవిష్కరణలపై మరింత దృష్టి పెట్టాల్సిన ఆవశ్యకతను ఏఐ గుర్తు చేస్తోంది.

నైపుణ్యాలు పెంచుకోవాల్సిందే..
ఆటోమేషన్ సామర్థ్యం పెరుగుతున్నకొద్దీ ఎంట్రీ-లెవల్, రొటీన్ కోడింగ్ ఉద్యోగాల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతోంది. ఏఐ వినియోగం పెరుగుతున్న క్రమంలో పోటీని తట్టుకుని నిలబడాలంటే ఇంజనీర్‌లు తమ నైపుణ్యాలను పెంపొందించుకోవాల్సిన అనివార్యత ఏర్పడుతోంది. అన్నింటికంటే ముఖ్యంగా ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ వినియోగానికి గూగుల్‌ ఎంత ప్రాధాన్యత ఇస్తోందనే దానికి ఇది ఉదాహరణగా నిలుస్తోంది.

“గూగుల్‌ కొత్త కోడ్‌లలో నాలుగింట ఒక వంతు కంటే ఎక్కువ ఏఐ ద్వారా రూపొందింది” అని గూగుల్‌ సీఈఓ సుందర్ పిచాయ్ అర్నింగ్‌ కాల్‌పై బ్లాగ్ పోస్ట్‌లో రాశారు. కోడింగ్ ప్రక్రియలను వేగవంతం చేయడానికి ఏఐని వినియోగిండం ద్వారా ఆవిష్కరణ అభివృద్ధిలో సమయం ఆదా చేయడంలో ఇంజినీర్లకు తోడ్పాటు అందించడం కంపెనీ లక్ష్యమని సుందర్‌ పిచాయ్ చెప్పారు.