రూపాయి విలువ పడిపోవడం అంటే ఏమిటి? దీని వల్ల లాభ నష్టాలు ఇవే..

www.mannamweb.com


చరిత్రను తిరగేస్తే.. పోరాటాలన్నీ.. డబ్బు కోసమో, పదవి కోసమో, మగువ కోసమో.. జరిగిన దృష్టాంతాలు కన్పిస్తాయి. కాసేపు పదవి, మగువలను పక్కన పెట్టేద్దాం.

డబ్బు విషయానికొస్తే.. ఇది ప్రపంచాన్ని శాసిస్తోందన్నది అక్షర సత్యం. ఒక్కో దేశానికి ఒక్కో కరెన్సీ ప్రాతినిధ్యం వహిస్తూ ఉంటుంది.

మన దేశానికి రూపాయి.. అమెరికాకు డాలర్, రష్యాకు రూబుల్, బ్రిటన్‌కు పౌండ్, జపాన్‌కు యెన్.. ఇలా యూరో, ఫ్రాంక్, దీనార్, దిర్హామ్ వంటివి ఆయా దేశాలకు ప్రధాన కరెన్సీ లుగా ఉన్నాయి. వివిధ దేశాల కరెన్సీలతో పోల్చి చూసినప్పుడు ఒక్కో దేశపు కరెన్సీకి ఒక్కో వాల్యూ ఉంటుంది.

సాధారణంగా ప్రపంచ మార్కెట్లకు పెద్దన్న అమెరికాయే కాబట్టి డాలర్‌తో పోల్చి ఆయా దేశాల కరెన్సీ ల విలువను నిర్ధారిస్తూ ఉంటారు. నాలుగు ప్రధాన ప్రపంచ కరెన్సీలతో పోల్చి చూసినప్పుడు మన రూపాయి విలువ ఇలా ఉంది (సుమారుగా).

1 అమెరికా డాలర్ = రూ. 85
1 బ్రిటన్ పౌండ్ = రూ. 109
1 జపాన్ యెన్ = రూ. 0.54
1 యూరో = రూ. 88

సాధారణంగా మనం వినే ఒకే ఒక్క మాట… రూపాయి విలువ పడిపోతోంది అని. అసలీ రూపాయి విలువ పడిపోవడం ఏమిటి..? దానివల్ల ఏం జరుగుతుందో తెలుసుకుందాం.

ఆయా కరెన్సీలకు ప్రపంచవ్యాప్తంగా ఉండే డిమాండ్ ను బట్టి దాని వాల్యూ నిర్ధారితమవుతుంది. ఏడాది క్రితం ఒక డాలర్ విలువ 80 రూపాయలు ఉండేది. మరిప్పుడో 85 రూపాయలు అయ్యింది. అంటే డాలర్ విలువ 5 రూపాయలు పెరిగింది. మన కరెన్సీ విలువ 5 రూపాయలు పడిపోయింది. దీని వల్ల అమెరికాతో జరిపే లావాదేవీలు మరో 5 రూపాయలు భారం అవుతాయి అన్న మాట.

ఉదా: ఏడాది క్రితం మీ అబ్బాయినో, అమ్మాయినో చదువు కోసం అమెరికా పంపించారు. కట్టాల్సిన ఫీజు 1200 డాలర్లు. అంటే అప్పటి మారకపు రేటు (ఒక డాలర్ = 80 రూపాయలు) ప్రకారం… మీరు చెల్లించాల్సింది రూ. 96000. ఇప్పుడు కూడా కట్టాల్సిన ఫీజు 1200 డాలర్లే. కానీ ఇప్పుడు డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ మరో 5 రూపాయలు పడిపోయి 85కు వచ్చేసింది. దీనివల్ల రూ.85 చొప్పున మీరు 1200 డాలర్లు చెల్లించాల్సి వచ్చినప్పుడు మీపై పడే అదనపు భారం మరో రూ.6000 అన్న మాట.

1200X80 = 96000
1200X85 = 102000
102000 – 96000 = 6000
ఇప్పుడు అర్ధమయ్యిందా విలువ పడిపోతే ఏం జరుగుతుందో..

ఏమవుతుందంటే..
➤మన దేశం చేసుకునే దిగుమతుల్లో 87 శాతం ముడి చమురు దిగుమతులే. ఇవి భారంగా మారిపోతాయి. 2023 – 24 ఆర్ధిక సంవత్సరంలో మన దేశం చమురు దిగుమతులపై 134 బిలియన్ డాలర్లు వెచ్చించింది. అంటే దాదాపు రూ. 11 లక్షల కోట్లు.

➤పెరిగే దిగుమతుల బిల్లు ద్రవ్యోల్బణాన్ని పెంచుతుంది. ద్రవ్యోల్బణం పెరగడమంటే నిత్యావసరాల ధరలు చుక్కలు చూడటమే. దీంతో సామాన్యుడి జీవితం మరింత కష్టప్రాయంగా మారిపోతుంది. ద్రవ్యోల్బణం పెరిగి, విదేశీ పెట్టుబడులు మందగించడం వల్ల ఆర్ధిక పురోగతి కుంటుపడుతుంది.

➤డాలర్లలో అప్పులు తెచ్చుకునే భారత కంపెనీలు ఎక్కువ మొత్తాల్లో చెల్లించాల్సి వస్తుంది. ఆ భారాన్ని తమ ఉత్పత్తుల ధరలు పెంచడం ద్వారా వినియోగదారులపై వేస్తాయి. ఇక్కడ నలిగిపోయేది కూడా సగటు వ్యక్తే.

➤ఆటోమొబైల్ కంపెనీలపై రూపాయి క్షీణత ప్రభావం ఎక్కువగానే ఉంటుంది. ఎందుకంటే అవి ఎక్కువగా తమకు అవసరమైన ముడి సరుకు కోసం దిగుమతులపైనే ఆధారపడతాయి. భారాన్ని తట్టుకోవడానికి అవి తమ తుది ఉత్పత్తుల ధరలను పెంచాల్సి వస్తుంది. దీనివల్ల వాటి మార్జిన్లు తగ్గిపోతాయి.

నష్టాలేనా.. ప్రయోజనాలేవీ లేవా..? అంటే ఎందుకు లేవు.. ఉన్నాయి.

➜ముఖ్యంగా సాఫ్ట్‌వేర్‌ కంపెనీలు ఎక్కువ లబ్ది పొందుతాయి. అవి తమ సర్వీసులను ఎగుమతి చేస్తాయి కాబట్టి.
➜అలాగే ఫార్మా, టెక్స్టైల్ కంపెనీలు కూడా..
➜అధిక శాతం భారత ఔషధ కంపెనీలు తమ మందులను అమెరికా, ఐరోపా మార్కెట్లకు ఎగుమతి చేస్తూ ఉంటాయి. కాబట్టి వీటికి ఎక్కువ ఆదాయం సమకూరుతుంది.
➜చైనాతో పోలిస్తే భారత్ నుంచి జౌళి ఎగుమతులు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. వీళ్లకూ మంచి ప్రయోజనమే దక్కుతుంది.
➜రూపాయి క్షీణత వల్ల రెమిటెన్సెస్ (అంటే విదేశాల్లో నివసిస్తున్నా భారతీయులు స్వదేశంలోని తమ వారికి పంపే సొమ్ములు) విషయంలో మాత్రం సానుకూల ప్రభావమే ఉంటుంది. అంటే.. అమెరికాలోని ఒక భారతీయుడు భారత్లోని తమ కుటుంబీకులకు 100 డాలర్లు పంపాడనుకుందాం. కిందటేడాది రూ. 8,000 వచ్చి ఉండేవి. ఇప్పుడు రూపాయి 85కి పడిపోవడం వల్ల రూ. 8,500 వస్తాయన్న మాట. అంటే రూ.500 ఎక్కువ వస్తాయి. ఇది ఆర్ధిక వ్యవస్థకు మేలు చేసే అంశం.

విదేశీ మదుపర్ల మాటేమిటి?
విదేశీ మదుపరులకు డాలర్ తో పోలిస్తే ఎక్కువ రూపాయలు వస్తాయి కాబట్టి వాళ్ళు కుప్పలుతెప్పలుగా మన మార్కెట్లో నిధులు కుమ్మరిస్తారు. స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెరిగి షేర్ల ధరలు అమాంతం పైకెగుస్తాయి. ఇది చూడటానికి బాగానే ఉంటుంది. వాళ్లకు కోపమొచ్చిందో (మన మార్కెట్‌తో పోలిస్తే వేరే చోట మరింత రాబడి వచ్చే అవకాశం ఉండటం) మన పని అయిపోయినట్లే. దానికి ప్రత్యక్ష ఉదాహరణే… గత అక్టోబర్, నవంబర్ నెలలు.

ఇలా చేస్తే.. స్టాక్ మార్కెట్లో మీరే ‘రాజా ది గ్రేట్’

అమాంతం వారి పెట్టుబడులు ఉపసంహరించుకోవడం మొదలెడతారు. భారతదేశంలో వాళ్లకున్న ఆస్తులు అమ్ముకోవడం మొదలెడతారు. తద్వారా మన రూపాయల్ని డాలర్లుగా మార్చుకుంటారు. ఫలితంగా డాలర్ విలువ పెరిగి రూపాయి విలువ పడిపోతుంది. గత రెండు నెలల్లో స్టాక్ మార్కెట్లో జరిగింది ఇదే. విదేశీ సంస్థాగత మదుపర్లు గత అక్టోబర్ నెలలో రూ.1.14 లక్షల కోట్లు వెనక్కి తీసుకోగా, నవంబర్ నెలలో రూ. 47,000 కోట్లు పట్టుకెళ్ళిపోయారు. దీంతో స్టాక్ మార్కెట్లు కుదేలయిపోయాయి. దీని ప్రభావం ఆర్ధిక వ్య్వవస్థ పైనా ప్రతికూలత చూపింది.

– బెహరా శ్రీనివాసరావు,ఆర్ధిక విశ్లేషకులు