ఏపీలో టూరిజంపరంగా అనేక ప్రాజెక్టులు రెడీ అవుతున్నాయి. ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ వరకూ పర్యాటక రంగం లో ఏపీని అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం గట్టిగానే కష్టపడుతోంది.
చాలా ప్రాజెక్టుల్ని పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడల్ లో రెడీ చేస్తున్నారు. అలాంటి వాటిలో విశాఖపట్నంలో రెడీ అయిన స్కై వాక్ గ్లాస్ బ్రిడ్జ్ ఫై ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. నిర్మాణం పూర్తి చేసుకున్న ఈ గ్లాస్ బ్రిడ్జి అతి త్వరలో ప్రారంభానికి రెడీ అయింది.
ఎంట్రీ టికెట్ రూ.250?
కైలాసగిరిలో ఎంతో ప్రతిష్టాత్మకంగా రెడీ అయిన స్కైవాక్ బ్రిడ్జిపై ఎంట్రీ టికెట్ ఒక్కరికీ 250 రూపాయలని సంబధిత వర్గాల సమాచారం. ఇదే కనుక నిజమైతే టూరిస్టులకి కాస్త ఇబ్బంది అనే చెప్పాలి. 100 లేదా 125 రూపాయలు ఉంటుందని భావించిన టికెట్ రేట్ మరీ 250 రూపాయలు ఉండొచ్చు అనే సమాచారం టూరిస్టుల సంఖ్య పడే అవకాశం ఉందని ఈ వార్త తెలిసిన వాళ్ళు అంటున్నారు.
సౌత్ ఇండియాలో అతిపెద్ద గ్లాస్ బ్రిడ్జ్ కావడంతో ప్రస్తుతం అందరూ ఎప్పుడెప్పుడు ఓపెన్ అవుతుందా అంటూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నా 250 టికెట్ రేట్ లాంగ్ రన్ లో వర్క్ ఔట్ అవుతుందా అనే చర్చ మొదలైంది. ఇటీవలే బీచ్ రోడ్ లో కొత్తగా ప్రారంభించిన డబల్ డెక్కర్ బస్సుల్లో మొదట టికెట్ రేట్ 500/-అనుకున్నా ప్రభుత్వం 250/-కి దాన్ని తగ్గించింది. మరి ఈ స్కైవాక్ గ్లాస్ బ్రిడ్జి ఎంట్రీ టికెట్ కూడా అలానే తగ్గిస్తారా లేక వేరే కాంబోతో కలిపి ఖరారు చేస్తారా అనేది చూడాలి.
వైజాగ్ టూరిజానికి అదనపు ఎట్రాక్షన్ – గ్లాస్ బ్రిడ్జ్
కైలాసగిరిలో మొత్తం భారతదేశంలోనే అతి పొడవైన 50 మీటర్ల కాంటిలీవర్ గ్లాస్ స్కైవాక్ బ్రిడ్జ్ ఓపెనింగ్ కోసం రెడీ అయిపోయింది. 7 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్‌లో భాగంగా, 150 మీటర్ల పొడవైన రెండు జిప్-లైన్‌లు, స్కై-సైక్లింగ్ ట్రాక్‌లు కూడా ఉన్నాయి.ఇవి అడ్వెంచర్ ప్రియులకు అదనపు ఆకర్షణలుగా నిలుస్తాయి. ఈ బ్రిడ్జ్ ఒకేసారి 40 మందిని సునాయసంగా మోసేయగలదు.
ఈ బ్రిడ్జ్ ఫై నడవడం సురక్షితమైన, ఉత్తేజకరమైన అనుభవాన్ని ఇస్తుందని దీన్ని నిర్మిస్తున్న వారు చెప్తున్నారు.న నవంబర్ 18, 2024 నుంచి ప్రారంభమైన గ్లాస్ బ్రిడ్జ్ నిర్మాణం పూర్తయి ప్రారంభోత్సవానికి రెడీగా ఉంది. ఇది విశాఖపట్నం మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ (VMRDA) RJ అడ్వెంచర్స్‌తో కలిసి పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్యంలో (PPP) అభివృద్ధి చేస్తున్నారు ఈ బ్రిడ్జ్. ప్రస్తుతం కేరళలోని వాగమన్ గ్లాస్ బ్రిడ్జ్ (40 మీటర్లు) రికార్డును వైజాగ్ స్కై వాక్ బ్రిడ్జ్ అధిగమించనున్నట్టు ఇక్కడి అధికారులు చెబుతున్నారు.































