ఎంత ప్రయత్నించినా ఉదయాన్నే నిద్ర లేవలేకపోతున్నారా? సైన్స్ ఏం చెప్పిందంటే..

చాలా మందికి ఉదయాన్నే నిద్ర లేవడం దాదాపు అసాధ్యంగా అనిపిస్తుంటుంది. ఇందుకు కొన్ని స్వయంకృత అపరాధాలు ఉన్నప్పటికీ మరికొన్ని ప్రకృతి సహజమైన కారణాలూ ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు (Sleep Cycle).


వైద్యులు చెప్పేదాని ప్రకారం, మనం ఎప్పుడు నిద్రపోవాలి? ఎప్పుడు నిద్ర లేవాలి? అనే అంశాలను శరీరంలోని జీవగడియారం నియంత్రిస్తుంది. మెదడులోని హైపోథలామస్ భాగంలోగల సుప్రాకయాస్మాటిక్ న్యూక్లియస్‌లో(నాడీ కణాల సముదాయం) జీవగడియారానికి సంబంధించిన నియంత్రణా వ్యవస్థ ఉంటుంది. వాతావరణంలో వెలుతురు, శరీరంలోని ఉష్ణోగ్రత, హార్మోన్‌ల స్థాయిల ఆధారంగా నిద్ర వచ్చేది ఎప్పుడో, ఎంత సేపు మేల్కొని ఉండాలో నిర్ణయం అవుతుంది (Why Is It So Hard to Wake Up Early).

చాలా మంది టీనేజర్‌లు, యువతలో ఈ జీవగడియారంలో సహజసిద్ధమైన మార్పు జరుగుతుంది. అంటే.. రాత్రి ఆలస్యంగా నిద్రపట్టేలా మార్పు జరుగుతుందని వైద్యులు చెబుతున్నారు. దీనికి తోడు అడినోసిన్ అనే కెమికల్ కూడా నిద్రను నియంత్రిస్తుంది.

సాధారణంగా రోజంతా మెదడులో పేరుకునే అడినోసిన్ రాత్రి అయ్యే సరికి శరీరం నిద్రలోకి జారుకునేలా మెదడుకు సంకేతాలిస్తుంది. ఉదయాని కల్లా ఇదీ మెదడులోంచి తొలగిపోవడంతో నిద్ర వదలుతుంది.

ఇక జీవగడియారం కారణంగా రాత్రి ఆలస్యంగా నిద్రపోయే సరికి మరుసటి రోజు ఉదయం మేల్కోవడం సహజంగానే ఆలస్యం అవుతుంది. దీనికి తోడు మెదడులోని అడినోసిన్ కూడా పూర్తిగా తొలగకపోవడంతో తెల్లవారుజామున నిద్ర మత్తు అంత ఈజీగా వదలదు. ఇది చాలదన్నట్టు రాత్రి వేళ పొద్దుపోయే వరకూ సెల్‌ఫోన్‌లు, లాప్‌టాప్‌లు చూస్తే వాటిల్లోని కృత్రిమ కాంతి వల్ల మెలటోనిన్ మరింత తగ్గి నిద్ర మరింత ఆలస్యం అవుతుంది. పర్యవసానంగా మరుసటి రోజు మరింత ఆలస్యంగా నిద్ర లేవాల్సి వస్తుందని నిపుణులు చెబుతున్నారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.