ఏపీలో అధికారం దక్కేదెవరికి. ప్రస్తుత ఎన్నికల సమయంలో ఇదే అంశం బిగ్ డిబేట్ గా మారుతోంది. హోరా హోరీగా సాగుతున్న ఎన్నికల సమరంలో గెలుపు పైన ప్రధాన పార్టీలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి.
పలు సర్వే సంస్థలు ఇప్పటికే తమ అంచనాలను వెల్లడించాయి. కొన్ని జాతీయ మీడియా ఛానల్స్ ఏపీలో ఎన్డీఏ కూమటి మెజార్టీ ఎంపీ స్థానాలు గెలుస్తుందని అంచనా వేస్తున్నాయి. కానీ, అసెంబ్లీ ఎన్నికల్లో అధిక సర్వే నివేదికలు వైసీపీకి అనుకూలంగా వస్తున్నాయి.
హోరా హోరీ పోరు
ఏపీలో ఈ సారి గెలుపు అన్ని ప్రధాన పార్టీలకు ప్రతిష్ఠాత్మకంగా మారాయి. అధికారం నిలబెట్టకోవాలని జగన్ పట్టుదలగా ఉన్నారు. ఎలాగైనా అధికారం దక్కించుకొనే లక్ష్యంతో బీజేపీ, జనసేనతో చంద్రబాబు జత కట్టారు. ప్రచారం కొనసాగిస్తున్నారు. ఈ సమయంలో పలు సర్వే సంస్థలు ఏపీలో వైసీపీకి అధికారం ఖాయమని నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఇందులో పేరున్న సంస్థలతో పాటుగా కొత్త సర్వే సంస్థలు తమ అంచనాలను వెల్లడిస్తున్నాయి. కొన్ని జాతీయ మీడియా సంస్థలు ఎంపీ ఎన్నికల పైన సర్వేలు చేస్తున్నాయి. అందులో భాగంగా ఎక్స్ న్యూస్, ఇండియా టూడే వంటి సంస్థలు ఏపీలో ఎన్డీఏ కూటమి
మెజార్టీ సీట్లు సాధిస్తాయని అంచనాగా వెల్లడించాయి.
సర్వే అంచనాలు
ఇక, ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల పైన మాత్రం మెజార్టీ సంస్థలు వైసీపీకి అనుకూలంగా అంచనాలు వెల్లడించాయి. జీన్యూస్-మాట్రిజ్ గ్రూప్ 133 అసెంబ్లీ సీట్లు వైఎస్సార్‌సీపీకి వస్తాయని పేర్కొంది.
భారత్ పొలిటికల్ సర్వే కూడా 150-156 సీట్లతో శాసనసభ ఎన్నికలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయపతాక ఎగురవేస్తుందని తేల్చింది. డెక్కన్ 24/7 సంస్థ అంచనా ప్రకారం 135-140 సీట్లు వైఎస్సార్‌సీపీకి వస్తాయి.న్యూస్ ఎరినా ఇండియా 127 సీట్లు వైఎస్సార్‌సీపీకి వస్తాయని చెబితే,చాణక్య సంస్థ వైఎస్సార్‌సీపీకి 102-107 సీట్లు కనిష్టంగా వస్తాయని పేర్కొంది. జన్ మత్ పోల్స్ అనే సంస్థ 120-123 సీట్లు వస్తాయని అంచనా వేసింది. ఆత్మ సాక్షి సంస్థ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి 97-118 సీట్లు రావచ్చని ప్రకటించింది. నాగన్న సర్వే ప్రకారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి కనీసం 103 వరకు రావచ్చని, ఆ పైన మరో ఇరవైఐదు సీట్లకు అవకాశం ఉందని తెలిపింది.
ఎవరి ధీమా వారిదే
అయితే, అసెంబ్లీ ఎన్నికల్లో సర్వే ఫలితాలు వైసీపీకి అనుకూలంగా వస్తున్నా టీడీపీ నేతలు మౌనంగా ఉంటున్నారు. సర్వేలు ఎలా ఉన్నా విజయం తమదేనని టీడీపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. తమకు వస్తున్న సర్వే ఫలితాలతో వైసీపీలో మరింత జోష్ పెరుగుతోంది. టీడీపీకి అనుకూలంగా నివేదికలు రాకపోవటం పైనా అంతర్గతంగా చర్చ సాగుతోంది. టీడీపీకి అనుకూలంగా పని చేస్తున్న రాజకీయ వ్యూహకర్తలు ప్రస్తుతం పూర్తిగా ప్రచారం పైనే ఫోకస్ చేసారు. అటు జగన్..చంద్రబాబు ఇద్దరూ గెలుపు పైన ధీమాగా ఉన్నారు. దీంతో..సర్వల అంచనాలు…పబ్లిక్ మూడ్ ఇప్పుడు ప్రధాన పార్టీల అధినేతలకు కొత్త టెన్షన్ కు కారణమవుతోంది.