చక్కని సాఫ్ట్‌వేర్ జాబ్.. భారీగా జీతం.. వారానికి ఐదు రోజుల పని, రెండు రోజులు రిలాక్స్.. ఇలాంటి సౌకర్యాలు ఉన్నవారు ఎవరైనా ఉద్యోగం వదిలేస్తారా.. అది కూడా రైతుల కోసం.. కానీ ఆ యువకుడు ఇవేవీ వద్దనుకున్నాడు, రైతులకు సాయం చేయడమే ముఖ్యమనుకున్నాడు.. అందుకే ఇప్పుడు ముఖ్యమంత్రి దృష్టిలో పడ్డాడు. బొర్రా శ్రీనివాస్ రావు.. బీహెచ్‌ఈఎల్‌లో లక్షణమైన ఉద్యోగం, భారీగా జీతం, స్థిరమైన కెరీర్.. కానీ ఇవేవీ అతనికి నచ్చలేదు. రైతులకు ఉపయోగపడాలనే తపనతో, మెకానికల్ ఇంజనీరింగ్ ఉద్యోగాన్ని వదిలేసి అన్నదాతల కోసం కదిలాడు. విశాఖపట్నం సమీపంలో మన్యం గ్రెయిన్స్ పేరుతో ఓ పరిశ్రమ ఏర్పాటు చేశాడు. గిరిజన రైతుల నుంచి నేరుగా ధాన్యాన్ని సేకరించడం, ప్రాసెసింగ్ చేసి అమ్మడం మొదలెట్టాడు. ఈ ప్లాంట్ ద్వారా ప్రస్తుతం తొమ్మిది రకాల తృణధాన్యాలను మార్కెట్ చేస్తున్నారు. మన్యం గ్రెయిన్స్ ప్రయత్నాల కారణంగా ఇక్కడి రైతుల ఆదాయం 30 శాతం వరకూ పెరిగింది, అలాగే గిరిజన రైతులను దళారీ మోసాల నుంచి తప్పించింది.
ఇంజనీరింగ్ డిగ్రీ పూర్తి చేసిన తర్వాత, బీహెచ్‌ఈఎల్‌లో ఉద్యోగంలో చేరానంటున్న శ్రీనివాస్.. ఆ జాబ్ తనకు ఒత్తిడితో కూడుకున్నదిగా అనిపించిందని చెప్తున్నారు. దీంతో స్నేహితుల సలహా మేరకు భువనేశ్వర్‌లోని జేవియర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్‌లో చేరానని.. అక్కడ వ్యవసాయ సంక్షోభం, రైతు ఆత్మహత్యల సమస్యపై వచ్చిన కథనాలను చూసి చలించిపోయానన్నారు. దీంతో రైతులకు ఉపయోగపడే పని చేయాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్‌లోని గిరిజన ప్రాంతాలలో తృణధాన్యాలను ఎక్కువగా సాగుచేస్తుంటారని.. వారికి ఉపయోగపడాలనే ఉద్దేశంతో అనకాపల్లిలో మన్యం గ్రెయిన్స్ ఏర్పాటు చేసినట్లు చెప్తున్నారు.
రైతు ఉత్పత్తి సంఘాలతో సమన్వయం చేసుకుంటూ, సరసమైన ధరలు, శిక్షణ, నమ్మకమైన మార్కెట్‌ను అందించడం ద్వారా, మన్యం గిరిజన రైతుల ఆదాయాన్ని 20 నుంచి 30 శాతం పెంచినట్లు చెప్తున్నారు. 2023-24లో తమ అమ్మకాల ఆదాయం కోటి దాటిందని శ్రీనివాస్ తెలిపారు. మరోవైపు బొర్రా శ్రీనివాస్ రావు గురించి తెలుసుకున్న ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. అతణ్ని అభినందించారు. అధిక జీతం వచ్చే ఉద్యోగాన్ని వదిలి సొంతంగా వ్యాపారాన్ని ప్రారంభించారని, తృణధాన్యాల సాగును ప్రోత్సహిస్తూ, ఇప్పటివరకు 400 నుంచి 500 మంది రైతులకు సాధికారత కల్పించారని చంద్రబాబు కొనియాడారు. రైతుల ఆదాయాన్ని 20 నుంచి 30 శాతం పెంచిన శ్రీనివాస్.. యువతకు నిజమైన స్ఫూర్తి అంటూ ప్రశంసించారు. త్వరలోనే అతన్ని కలవాలని కోరుకుంటున్నట్లు చంద్రబాబు ట్వీట్ చేశారు.