చోరీ చేయడానికి వచ్చిన దొంగను పట్టుకున్న స్థానికులు ఠాణాలో అప్పగిస్తే, పోలీసుల కళ్లుగప్పి పరారైన ఘటన మధురానగర్ ఠాణా పరిధిలో ఆలస్యంగా వెలుగు చూసింది.
చోరీ చేయడానికి వచ్చిన దొంగను పట్టుకున్న స్థానికులు ఠాణాలో అప్పగిస్తే, పోలీసుల కళ్లుగప్పి పరారైన ఘటన మధురానగర్ ఠాణా పరిధిలో ఆలస్యంగా వెలుగు చూసింది. యూసుఫ్‌గూడ చెక్‌పోస్ట్ సమీపంలోని యాదగిరినగర్‌లో తరచూ ఇళ్లలోకి వస్తున్న దొంగ స్టీల్ నల్లాలు దొంగిలిస్తున్నాడు. ఈ దృశ్యాలు సీసీ ఫుటేజీలో నిక్షిప్తం కావడంతో బస్తీవాసులు తమ వాట్సాప్ గ్రూప్‌లో నిందితుడి వీడియో, ఫొటోలు పోస్టు చేశారు. బుధవారం ఉదయం బస్తీలో నల్లాలను చోరీ చేసేందుకు సదరు వ్యక్తి రావడంతో అప్రమత్తంగా ఉన్న స్థానికులు అతడిని పట్టుకున్నారు. అతడి వద్ద ఎలాంటి గుర్తింపు కార్డులు, ఫోన్ లేదు. మత్తులో ఉన్నట్లు గుర్తించి మధురానగర్ పోలీసులకు అప్పగించారు. ఠాణాలో సిబ్బంది తీరిక లేకుండా ఉండటాన్ని గమనించిన దొంగ పోలీసుల కళ్లుగప్పి ఠాణా నుంచి పరారయ్యాడు. కాసేపటికి నిందితుడు పరారైనట్లు గుర్తించిన పోలీసులు ఎంత వెతికినా ప్రయోజనం లేకపోవడంతో మరో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.