సిమ్‌ ఉన్న ఫోన్లోనే వాట్సాప్‌ లాగిన్‌

 వాట్సాప్‌, టెలిగ్రామ్‌ తదితర మెసేజింగ్‌ యాప్‌లను స్కామ్‌స్టర్లు దుర్వినియోగం చేయకుండా అరికట్టేందుకు టెలికం శాఖ కొత్త ఆదేశాలను జారీ చేసింది. అందులో ప్రధానమైనది… సిమ్‌ బైండింగ్‌ నిబంధన. ఈ ఫోన్లో సిమ్‌ ఆ ఫోన్లో వాట్సాప్‌ ఉంచుకుంటానంటే కుదరదు.


ఏ ఫోన్లో అయితే సిమ్‌ ఉంటుందో అదే ఫోన్లో మాత్రమే సంబంధిత నంబర్‌ వాట్సాప్‌ లేదా టెలిగ్రామ్‌ పని చేస్తుంది. సిమ్‌ తీసేస్తే వెంటనే మెసేసింగ్‌ యాప్‌లు కూడా పని చేయడం మానేస్తాయి. కొంతమంది డెస్క్‌టాప్‌లో, లాప్‌ట్యాప్‌లో క్యూఆర్‌ కోడ్‌ను స్కాన్‌ చేయడం ద్వారా వెబ్‌ బ్రౌజర్‌లో వాట్సా్‌పను ఓపెన్‌ చేసి, అలాగే మరచిపోతుంటారు. ఆ డెస్క్‌టాప్‌ తెరిచిన వాళ్లందరికీ అందులో సమాచారం తెలిసిపోతుంటుంది.

ఈ పరిస్థితిని నివారించేందుకు టెలికం శాఖ కొత్త నిబంధనను తీసుకొచ్చింది. అలా తెరిచి వదిలేసిన వాట్సాప్‌ ఆరు గంటల్లో దానంతట అదే లాగౌట్‌ అయ్యేలా చూడాలని ఆదేశించింది. వాట్సాప్‌, టెలిగ్రామ్‌, సిగ్నల్‌, స్నాప్‌చాట్‌, షేర్‌చాట్‌, జియోచాట్‌, ఆరాట్టి, జోష్‌ తదితర మెసేజింగ్‌ యాప్‌లకు ఈ నిబంధనలు వర్తిస్తాయి. విదేశాల నుంచి భారతీయులకు ఫోన్ల ద్వారా కాల్‌ చేసి ఆర్థిక మోసాలకు పాల్పడుతున్న వారు ఎక్కువగా వాట్సాప్‌, టెలిగారమ్‌ లాంటి మెసేజింగ్‌ యాప్‌లు వాడుతున్నారు.

మొదట భారతీయులైన భాగస్వాముల ద్వారా ఇండియా సిమ్‌లు సంపాదిస్తున్నారు. వాటిని భారతదేశంలోనే యాక్టివేట్‌ చేస్తున్నారు. తాముండే దేశాల్లో మరో ఫోన్‌లో అదే నంబర్‌తో వాట్సాప్‌ను యాక్టివేట్‌ చేస్తున్నారు. అందుకు అవసరమైన ఓటీపీని భారతదేశంలోనే ఉండే భాగస్వామి ఫోన్‌ ద్వారా ఇస్తారు.

వాట్సాప్‌ సిద్ధం కాగానే ఇండియాలో ఫోన్‌ స్విచాఫ్‌ చేస్తారు. వాట్సాప్‌తో అమాయకులైన భారతీయులకు కాల్స్‌ చేస్తూ ఆర్థిక నేరాలకు పాల్పడుతుంటారు. తాజా నిబంఽధనలతో దేశం బయట కోట్ల సంఖ్యలో భారతీయ నంబర్లతో ఉన్న వాట్సాప్‌లు మూగబోతాయి. ఇప్పటికే బ్యాంకుల యాప్‌లు, యూపీఐ పేమెంట్‌ యాప్‌లు ఈ రూల్‌ను పాటిస్తున్నాయి.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.