ఏపీలో ఈ నెల 15వ తేదీ నుంచి ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ఓ కీలక కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతోంది. మెటాతో కుదుర్చుకున్న ఒప్పందం మేరకు రాష్ట్రంలో ప్రభుత్వ సేవల్ని వాట్సాప్ ద్వారా వినియోగించుకునేలా ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ప్రచార కార్యక్రమం ప్రారంభించబోతోంది. ప్రస్తుతం 250 సేవలు వాట్సాప్ ద్వారా అందుబాటులోకి తెచ్చిన ప్రభుత్వం.. త్వరలో వీటిని వెయ్యికి విస్తరించబోతోంది.
ప్రత్యేక వాట్సాప్ నంబర్ ఏపీ ప్రభుత్వం మన మిత్రపేరుతో తీసుకొచ్చిన వాట్సాప్ గవరెన్స్ నంబరు 9552300009 రాష్ట్రంలోని పౌరులందరూ తమ మొబైల్ ఫోన్లలో మనమిత్ర పేరుతో తప్పనిసరిగా సేవ్ చేసుకోవాలని ప్రజలకు విజప్తి చేస్తోంది. ప్రజలు తమ పనుల కోసం, తమకు కావాల్సిన ధ్రువీకరణ పత్రాల కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా వాట్సాప్ లోనే అన్ని సేవలు అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తోంది.
క్షణాల్లో సేవలు ఇందులో భాగంగా కేవలం ఉన్న చోటునుంచే సెల్ ఫోన్ లో మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా క్షణాల్లో ప్రభుత్వం నుంచి తమకు కావాల్సిన సేవలు పొందే సదుపాయాన్ని ప్రభుత్వం పౌరులకు కల్పిస్తోంది. సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆశయాలకనుగుణంగా ఐటీ,ఆర్టీజీ శాఖ మంత్రి నారా లోకేష్ ఆలోచనల నుంచి వాట్సాప్ గవర్నెన్స్ అనే వినూత్న సౌలభ్యాన్ని ప్రభుత్వం ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చింది. మన మిత్ర పేరుతో మెటా వారి సహకారంతో తీసుకొచ్చిన ఈ వాట్సాప్ గవర్నెన్స్ ఇప్పటికే ప్రజామన్ననలు చూరగొంటోంది.
ఇంటింటికీ మనమిత్ర డ్రైవ్ దీన్ని ప్రజలకు మరింత చేరువగా తీసుకెళ్లే దిశగా ప్రభుత్వం విస్తృత కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా ఈ నెల 15వ తేదీ నుంచి ఇంటింటికీ మన మిత్ర పేరిట స్పెషల్ డ్రైవ్ నిర్వహించబోతోంది. ఈ కార్యక్రమంలో భాగంగా అన్ని జిల్లాల్లోని సచివాలయ సిబ్బంది తమ సచివాలయ పరిధిలోని ప్రతి ఇంటికీ వెళ్లీ ఆ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరి మొబైల్ ఫోనులో మనమిత్ర పేరిట వాట్సాప్ గవర్నెన్స్ నంబరు 9552300009 సేవ్ చేయిస్తారు. అలాగే ఈ వాట్సాప్ గవర్నెన్స్ ను ఎలా ఉపయోగించాలి, దాని ద్వారా ప్రభుత్వ సేవలు ఎలా పొందాలి అనే దానిపైన ఆ కుటుంబంలో ఉన్నవారందరికీ అవగాహన కల్పిస్తారు.
కరపత్రాలు, వీడియో సందేశాలతో ఇంటింటికీ మన మిత్ర కార్యక్రమంలో భాగంగా ప్రజలకు వాట్సాప్ గవర్నెన్స్ పైన పూర్తి అవగాహన కల్పించేలా ఐటీ, ఆర్టీజీ శాఖలు కరపత్రం, ప్రత్యేక వీడియో సందేశాలను సిద్ధం చేశాయి. వీటిని క్షేత్రస్థాయిలో సచివాలయ సిబ్బంది ప్రతి ఇంటికీ తీసుకెళ్లి ఆ కుటుంబ సభ్యులకు ఆ కరపత్రాలు పంచడమే కాకుండా, ఆ వీడియో సందేశాన్ని కూడా వారి వాట్సాప్ లకు షేర్ చేయడం, గ్రామంలోని వివిధ సోషల్ మీడియా ప్లాట్‌ఫాంల్లో షేర్ చేయడం లాంటివి చేసి ప్రజలకు అవగాహన కల్పిస్తారు. ఈ కార్యక్రమాన్ని ఆయా జిల్లాల్లో కలెక్టర్లు పర్యవేక్షిస్తారు. 250కి పైగా సేవలు ప్రస్తుతం వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ప్రభుత్వం 250 రకాల సేవలను అందిస్తోంది. జూన్ 12వ తేదీకల్లా 500లకుపైగా సేవలు కల్పించాలనే లక్ష్యంతో పనిచేస్తోంది.
తరువాత దశల్లో మొత్తం 1000కి పైగా సేవలు ప్రజలకు వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా అందించాలన్నదే ప్రభుత్వ అంతిమ లక్ష్యం. ప్రజలెవ్వరూ కూడా ప్రభుత్వం నుంచి పొందవలచిన సేవల కోసం ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లకుండా జనన, మరణ ధృవీకరణ పత్రాల మొదలు, ప్రభుత్వం జారీ చేసే అన్ని రకాల ధృవీకరణ పత్రాలను తమ వాట్సాప్ ద్వారా ఇట్టే డౌన్‌లోడు చేసుకునే సదుపాయం కల్పిస్తోంది.
బిల్లుల చెల్లింపులకూ తమ ఆధార్ అనుసంధాన మొబైల్ నంబరు సాయంతో ఈ సేవలు క్షణాల్లో పొందవచ్చు. ఈ దిశగా ప్రభుత్వం లోని అన్ని శాఖలను ప్రభుత్వ యంత్రాగాన్ని సమాయాత్తం చేస్తున్నారు. కేవలం ఇవే కాకుండా బస్ టికెట్లు రిజర్వు చేసుకోవడం, విద్యుత్తు బిల్లులు, ఆస్తి పన్ను, నీటి పన్ను లాంటి చెల్లింపులు కూడా సులభంగా వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా చేసే సదుపాయం ఇందులో కల్పించారు. తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవారి ఆలయ సేవలతో పాటు రాష్ట్రంలోని ప్రధాన ఆలయాల సేవలన్నీ కూడా ఇందులో పొందే సుదపాయం కల్పించారు. వ్యక్తిగత డేటా భద్రమే మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ ప్రజలకు ప్రభుత్వం కల్పిస్తున్న ఒక మంచి సదుపాయం. దీన్ని సక్రమంగా ఉపయోగించుకుంటూ ప్రజలెవ్వరూ కూడా తమ పనుల కోసం ప్రభుత్వ కార్యాలయాలు, అధికారుల చుట్టూ తిరగాల్సిన పని ఉండదని సర్కార్ చెబుతంది. ప్రజలంతా తమ సెల్ ఫోన్లలో మనమిత్ర వాట్సాప్ నంబరు 9552300009 ను తప్పనిసరిగా సేవ్ చేసుకోవాలని కోరుతోంది. ప్రజల వ్యక్తి గత డేటా భద్రతకు ఎలాంటి ఢోకా ఉండదని చెబుతోంది. పౌరుల డేటాను వాట్సాప్‌తో కానీ మరే ఇతర సంస్థలతో కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ పంచుకోరు. వాట్సాప్ ద్వారా డౌన్లోడు చేసుకునే డిజిటిల్ సర్టిఫికెట్లకు చట్టబద్ధత కూడా ఉందని తెలిపింది. వాట్సాప్ సేవల వాడకం ఇలా… • సేవ్ – ముందుగా మీ మొబైల్ ఫోనులో 9552300009 మన మిత్ర పేరిట సేవ్ చేసుకోండి • “హాయ్” – ఆ నంబరుకు “హాయ్” అని సందేశం పంపండి • మీకు కావలసిన సేవను ఎంపిక చేసుకోండి • వెంటనే మీకు వాట్సాప్ లో ఏఐ ఆధారిత చాట్ బాట్ లో లభ్యమయ్యే అన్ని ప్రభుత్వ సేవల జాబితా కనిపిస్తుంది. • అందులో మీరు ఒక సేవను ఎంపిక చేసుకోండి లేదా వాయిస్ కమాండ్స్ ను కూడా ఉపయోగించుకోవచ్చు. (ఉదాహరణకు “ఎలక్ట్రిసిటీ బిల్ పేమెంట్”) • కావాల్సిన వివరాలు పొందుపరచండి • మీరు కోరుకున్న సేవకు సంబంధించి చాట్ బాట్ మరికొన్ని అదనపు వివరాలను అడగొచ్చు. ఉదాహరణకు మీ ఆధార్ నంబరు, మీ మొబైల్ నంబరు, లేదా సర్వీసు రిక్వెస్టు ఐడీ లాంటివి. • ఈ వివరాలను మీరు టెక్ట్స్ రూపంలో కానీ లేదా వాయిస్ రూపంలోనైనా ఇవ్వండి • సర్వీస్ కన్ఫర్మేషన్ పొందండి • మీరిచ్చిన వివరాలను ఒకసారి తనిఖీ చేసిన తర్వాత, అందులో సిస్టమ్ మీకు రియల్-టైమ్ అప్డేట్స్ లేదా ఒక కన్ఫర్మేషన్ సందేశాన్ని పంపుతుంది • మీరు జరిపిన లావాదేవీలకు సంబంధించి డిజిటల్ కాపీ లేదా రశీదును డౌన్లోడు చేసుకోండి • వాట్సాప్ గవర్నెన్స్ లోని చాట్ బాట్ మీకు ఈ-ధ్రువీకరణ పత్రాలు, రశీదులు, లేదా అక్నాలెడ్జిమెంట్లను రూపొందించి అందజేస్తుంది.