కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఇప్పటికే వేల మంది కొత్త కార్డుల కోసం అప్లై చేసుకున్నారు. ఇంకా కార్డులో పేర్ల తొలగింపు, జత చేయడం వంటి సేవలు కూడా లభిస్తున్నాయి.
కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న వారికి కీలక అలర్ట్. రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు పెద్దఎత్తున వస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కొత్త రేషన్ కార్డుల కోసం అప్లికేషన్స్ తీసుకుంటోంది. ఇప్పటికే ఉన్న కార్డుల్లో మార్పులు, సవరణలు చేయించుకోవచ్చు. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా అవకాశం కల్పించింది. దీంతో వేలాది మంది ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకుంటూ దరఖాస్తులు సమర్పిస్తున్నారు.
ప్రస్తుతం ప్రభుత్వం రేషన్ కార్డుల విషయంలో ఏడు రకాల సేవలను అందుబాటులోకి తీసుకువచ్చింది. వీటిలో కొత్త కార్డుల జారీ, కుటుంబ సభ్యుల జోడింపు/ తొలగింపు, చిరునామా మార్పు, కుటుంబ మృతుల తొలగింపు, కార్డు రద్దు వంటి సేవలు ఉన్నాయి. అందువల్ల ప్రజలు వారికి నచ్చిన సర్వీసులను పొందొచ్చు.
సచివాలయాల్లో దరఖాస్తులు స్వీకరించిన తరువాత, సంబంధిత వీఆర్వోలు దరఖాస్తుదారుల సమాచారాన్ని ఈ-కేవైసీ ద్వారా ధృవీకరిస్తున్నారు. అర్హతలు ఉన్నవారిని గుర్తించి వారి వివరాలను తహసీల్దార్ లాగిన్‌కు అప్‌లోడ్ చేస్తున్నారు. తహసీల్దార్ దరఖాస్తులను పరిశీలించి, అర్హులుగా తేలితే డిజిటల్ సంతకంతో వెంటనే కార్డు మంజూరును ఆమోదిస్తున్నారు. .
ముఖ్య సూచన: ఈ అవకాశాన్ని ఎవరూ కోల్పోకండి. ఇప్పటికైనా మీరు రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేయకపోతే, మీకు అర్హత ఉంటే వెంటనే దగ్గరలోని సచివాలయాన్ని సంప్రదించి దరఖాస్తు చేసుకోండి. తద్వారా ప్రభుత్వ పథకాలు, రేషన్ సదుపాయాలు పొందే అవకాశం మీకు లభిస్తుంది.
శుక్రవారం నాటికి ఒక్క విశాఖపట్నం జిల్లాలోనే 522 గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో మొత్తం 42,418 దరఖాస్తులు అందగా, వాటిలో 24,582 దరఖాస్తులను అధికారులు పరిష్కరించారు. మిగతావి అనర్హులుగా గుర్తించి తిరస్కరించారు. దరఖాస్తులపై వీఆర్వోలు , తహసీల్దార్లు ఒక నిర్దిష్ట ప్రక్రియ ద్వారా పరిశీలన చేసి, అర్హులకు తక్షణమే కార్డులు మంజూరు చేస్తున్నారు.
దరఖాస్తుల స్వీకరణకు ఇప్పటివరకు ప్రభుత్వం ఎలాంటి తుది గడువును నిర్దేశించకపోవడంతో, ప్రజలు ఇంకా పెద్ద సంఖ్యలో సచివాలయాల్లో అర్జీలు అందజేస్తున్నారు. ఈ నేపథ్యంలో గ్రామ, వార్డు సచివాలయాల వద్ద రోజువారీగా దరఖాస్తుల ప్రవాహం కొనసాగుతోంది. పౌర సరఫరాల శాఖ అధికారులు ఈ విషయాన్ని స్పష్టం చేశారు. అందువల్ల మీరు ఇంకా రేషన్ కార్డు సేవలు పొందాలని భావిస్తే.. త్వరపడండి.
ఈసారి మంజూరు చేయబోయే కొత్త రేషన్ కార్డులు స్మార్ట్‌కార్డు రూపంలో ఉండబోతుండటంతో, ప్రజల్లో వాటిపై విపరీతమైన ఆసక్తి నెలకొంది. ఆధునిక సాంకేతికతతో కూడిన ఈ స్మార్ట్ కార్డులు పలు ప్రయోజనాలను అందించనున్నాయి. అందువల్ల ఇప్పటికే కార్డు ఉన్నవారు కూడా వివరాల సవరణ కోసం, కొత్త సభ్యుల జోడింపునకు లేదా ఇతర సేవల కోసం దరఖాస్తు చేస్తున్నారు.
అధికారుల విఙ్ఞప్తి: ప్రజలందరూ తమ అవసరాలకు అనుగుణంగా సచివాలయాల్లో సంప్రదించి, అవసరమైన రేషన్ సేవలకు సంబంధించి అర్హత ఉంటే తప్పక దరఖాస్తు చేయాలని అధికారులు సూచిస్తున్నారు. ఏదైనా సవరణ, అప్డేట్ చేయించుకునే అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరుతున్నారు. ఈ సేవల ద్వారా పేద ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడమే లక్ష్యంగా ప్రభుత్వం వ్యవస్థను పటిష్టంగా అమలు చేస్తోంది.
జిల్లా పౌర సరఫరాల శాఖాధికారి కె. మూర్తి వివరిస్తూ.. కొత్త రేషన్ కార్డుల ప్రక్రియపై ముఖ్యమైన విషయాలను పంచుకున్నారు. ఆయన మాట్లాడుతూ, “రేషన్ కార్డు కోసం అర్హులైన ప్రతి ఒక్కరూ తమ గ్రామ, వార్డు సచివాలయాల్లో స్వయంగా దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చిన ఏడు రకాల సేవలు ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా నిలుస్తున్నాయి,” అన్నారు.
ఇప్పటివరకు జిల్లా వ్యాప్తంగా 42,418 దరఖాస్తులు అందినట్టు తెలిపారు. అందులో పరిశీలన అనంతరం 17,836 దరఖాస్తులను అనర్హులుగా గుర్తించి తిరస్కరించాం అని చెప్పారు. మిగిలిన దరఖాస్తులను అధికారుల బృందం వరుసగా పరిశీలిస్తూ ఉంది.
“దరఖాస్తులకు ఎలాంటి చివరి గడువు లేదని ప్రజలు గమనించాలి. ఎవరికైనా అవసరమైన మార్పులు, సవరణలు ఉంటే లేదా కొత్త రేషన్ కార్డు కావాలంటే ఎప్పుడైనా సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవచ్చు. వచ్చే ప్రతీ దరఖాస్తును పూర్తిగా పరిశీలించి నిర్ణయం తీసుకుంటాం” అని వివరించారు. “అర్హులైన ప్రతి కుటుంబానికి తగిన ఆధారాలతో కార్డులు మంజూరు చేసి, త్వరలోనే స్మార్ట్‌కార్డులను అందిస్తాం” అని హామీ ఇచ్చారు.































