మారుతున్న భూమి వేగం, రోజుకు 24 గంటలు ఉండవా

భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుంటుంది. తన చుట్టూ తాను తిరిగేందుకు పట్టే సమయం 24 గంటలు. అదే రోజుకు పరిమాణంగా ఉంది.


కానీ భవిష్యత్తులో ఇది మారనుంది. అదే జరిగితే పెను మార్పులు సంభవించనున్నాయి. కాలచక్రమే మారిపోనుంది.

భూమి, భూ భ్రమణం, పరిభ్రమణంపై శాస్త్రవేత్తల హెచ్చరికలు ఆందోళన కల్గిస్తున్నాయి. రానున్న కాలంలో రోజుకు ఉండే 24 గంటల సమయం తగ్గిపోనుంది. భూమి భ్రమణ వేగం పెరగడంతో రోజు వ్యవధి 24 గంటల నుంచి తగ్గిపోనుందని తెలుస్తోంది. రానున్న రోజుల్లో భూమి మరింత వేగంగా తిరగనుందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. దాంతో పగటి సమయం తగ్గనుంది. ఇటీవల జూలై 9వ తేదీన కూడా భూమి వేగంగా తిరిగినట్టు శాస్త్రవేత్తలు నిర్ధారించారు. తిరిగి జూలై 22, ఆగస్టు 5 తేదీల్లో చంద్రుని స్థానం భూమి భ్రమణ వేగాన్ని ప్రభావితం చేయనుంది. రోజుకు ఉండే సమయం 24 గంటల కంటే తక్కువే ఉంటుందంటున్నారు. ప్రస్తుతానికి ఇది చాలా తక్కువే. కానీ భవిష్యత్తులో మారవచ్చు. ప్రస్తుతం 1.3 మిల్లీ సెకన్ల నుంచి 1.51 మిల్లీ సెకన్లు తగ్గింది.

భూమిపై ఒక పూర్తి రోజు అంటే 24 గంటలు అంటే 86,400 సెకన్లు. భూ భ్రమణం అనేది ఎప్పుడూ స్థిరంగా ఉండదు. చంద్రుడు, సూర్యుని గురుత్వాకర్షణ శక్తి, మేగ్నటిక్ పవర్, సహజ, మానవ కార్యకలాపాల కారణంగా భూమి ద్రవ్యరాశిలో వచ్చే మార్పులను బట్టి మారుతుంటుంది. గతంలో భూ భ్రమణ వేగం క్రమంగా తగ్గినట్టు తెలుస్తోంది. దాదాపు 100-200 కోట్ల ఏళ్ల క్రితం రోజుకు 19 గంటలు మాత్రమే ఉండేది. చంద్రుడు భూమికి అతి సమీపంలో ఉండటం వల్ల గురుత్వాకర్షణ శక్తి ఎక్కువగా ఉండేది.

అయితే ఆ తరువాత పరిణామ క్రమంలో చంద్రుడు దూరం జరిగే కొద్దీ రోజు వ్యవధి పెరిగింది. అంతెందుకు కేవలం 50 ఏళ్లలోనే భూమి వేగం పెరిగినట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. 1970 దశకం కంటే 2020లో భూమి వేగంగా తిరుగుతున్నట్టుగా నమోదైంది. ఇటీవల అంటే గత ఏడాది 2024 జూలై 5వ తేదీన చాలా చిన్నరోజు నమోదైంది. ఆ రోజు సాధారణం కంటే 1.66 మిల్లీసెకన్లు తక్కువ ఉంది.

భూ భ్రమణ వేగాన్ని ప్రభావితం చేసే అంశాలు చాలా ఉంటాయి. మంచు కరగడం, భూగర్భ జలాలు కదలడం వంటివి కూడా కారణమౌతుంటాయి. భూకంపాలు, కాలానుగుణంగా వచ్చే మార్పులు కూడా భ్రమణ వేగాన్ని మారుస్తుంటాయి. అందుకే రానున్న రోజుల్లో భూమి మరింత వేగంగా పరిభ్రమిస్తూ రోజు వ్యవధిని తగ్గించనుంది. ఇది కాలగతిని మార్చనుంది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.