Income Tax: మారిన నిబంధనలు.. పాత, కొత్త పన్ను విధానాలలో ఏది మంచిది? నిపుణులు ఓటు దేనికంటే..
దేశమంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన కేంద్ర బడ్జెట్ ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ జూలై 23న పార్లమెంటులో ప్రవేశపెట్టారు. దేశ ప్రగతికి అనుగుణంగా వివిధ రంగాలకు కేటాయింపులు జరిపారు. వివిధ వర్గాలకు రాయితీలు అందించారు. దానిలో భాగంగా పన్ను చెల్లింపు దారులకు కూాడా కొన్ని ప్రయోజనాలు కల్పించారు.
కొత్త పన్ను విధానంలో మార్పులు..
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పాత పన్ను విధానంలో ఎలాంటి మార్పులు చేయలేదు. కానీ కొత్త పన్ను విధానంలో మినహాయింపు పరిమితిని పెంచారు. దీనివల్ల ఈ విధానంలో పన్ను చెల్లించేవారికి మునుపటి కంటే మరింత ప్రయోజనం కలుగుతుంది. అయితే తమకు వచ్చే ఆదాయానికి అనుగుణంగా చెల్లింపుదారులు నిర్ణయం తీసుకోవాలి.
చెల్లింపుదారులదే నిర్ణయం..
పాత, కొత్త విధానాలలో ఏ పద్దతి ద్వారా ఆదాయపు పన్ను చెల్లించాలనే విషయంపై పన్ను చెల్లింపుదారులు నిర్ణయం తీసుకోవాలి. ఏ విధానంలో చెల్లిస్తే ప్రయోజనాలు కలుగుతాయో అధ్యయనం చేయాలి. మీకు వస్తున్న ఆదాయానికి అనుగుణంగా ప్రణాళిక రూపొందించాలి. కేంద్ర బడ్జెట్ లో చేసిన మార్పులను అనుసరించి పాత, కొత్త విధానాలలో దేనిని ఎంచుకోవాలో తెలుసుకుందాం.
ఆదాయం తక్కువగా ఉంటే..
మీరు సంపాదిస్తున్న ఆదాయం తక్కువగా ఉంటే మీకు కొత్త పన్ను విధానం వల్ల ప్రయోజనం కలుగుతుంది. కొత్త పన్ను విధానంలో స్టాండర్డ్ డిడక్షన్ రూ.50 వేల నుంచి రూ.75 వేలకు పెరిగింది. మీరు గృహ రుణ వడ్డీపై రూ. 2 లక్షల వరకు తగ్గింపును క్లెయిమ్ చేయకుంటే లేదా ఇంటి అద్దె భత్యం (హెచ్‌ఆర్‌ఏ)కు అర్హత పొందకపోతే కొత్త సరళీకృత పన్ను వ్యవస్థకు మారడం బాగుంటుంది.
కొత్త విధానంలో పన్ను లెక్కింపు..
కొత్త పన్ను విధానంలో లెక్కింపు ఇలా ఉంటుంది. 3 లక్షల రూపాయల వరకు ఎలాంటి పన్ను కట్టనక్కర్లేదు. 3 నుంచి 7 లక్షల వరకూ 5 శాతం, 7 నుంచి 10 లక్షల వరకూ పది శాతం, 10 నుంచి 12 లక్షల వరకూ 15 శాాతం, 12 నుంచి 15 లక్షల వరకూ 20 శాతం, 15 లక్షలకు పైబడి 30 శాతం విధిస్తారు.
ఆదాయం ఎక్కువైతే..
ఆదాయం ఎక్కువగా వచ్చే వారికి పాత పన్ను విధానం ప్రయోజనకరంగా ఉంటుందని పన్ను నిపుణులు సూచిస్తున్నారు. ఉదాహరణకు రూ. 3,93,750 కంటే ఎక్కువ తగ్గింపులను క్లెయిమ్ చేసే రూ. 11 లక్షల ఆదాయం కలిగిన జీతం పొందిన ఉద్యోగికి పాత పన్ను విధానంలో మరింత ఆదా చేసే అవకాశం కలుగుతుంది. పాత పన్ను విధానం ఆరోగ్య బీమా ప్రీమియాలు, పిల్లల స్కూల్ ఫీజులు, సెక్షన్ 80 సీ కింద పెట్టుబడులు, గృహ రుణ వడ్డీ, ఇంటి అద్దెపై పన్ను మినహాయింపులను క్లెయిమ్ చేసుకోవచ్చు. వీటికి ఆదాయపు పన్ను చట్టం ప్రకారం అనుమతి లభిస్తుంది. కాబట్టి మీ ఆదాయం ఎక్కువగా ఉంటే పాత పన్ను విధానాన్ని ఎంపిక చేసుకోవాలి.
ఏది ప్రయోజనం..
పాత, కొత్త పన్ను విధానాలు రెండూ మంచివి. తమకు వచ్చే ఆదాయానికి అనుగుణంగా వీటిని పన్ను చెల్లింపుదారులు ఎంచుకోవాలి. ముఖ్యంగా పన్ను మినహాయింపులే వీటి మధ్య వ్యత్సాసాన్ని కలిగిస్తాయి. పాత పన్ను విధానంలో వివిధ రకాల మినహాయింపులు లభిస్తాయి. వాటిని పన్ను చెల్లింపుదారులు క్లెయిమ్ చేసుకోవచ్చు. కొత్త పన్ను విధానంలో అలాంటి మినహాయింపులు ఉండవు. పన్ను చెల్లింపుదారులకు రూ.75 వేల డిడిక్షన్ తో పాటు ఎన్ పీఎస్, ఆరోగ్య బీమా ప్రీమియాలకు మాత్రమే మినహాయింపు ఉంటుంది.