ఒక మేక. రెండు కరెంటు పోల్స్ మధ్య వేలాడే వైర్లపైకి ఎక్కి.. దానిపై ఉన్న మేతను తాపీగా మేస్తున్నది. దీనికి సంబంధించిన ఒక వీడియో.. ఇప్పుడు నెట్టింట హల్‌చల్ చేస్తున్నది.
సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్న ఆ వీడియోను చూసినవారు.. మేక అంత పైకి.. అందులోనూ వైర్లపైకి ఎలా ఎక్కింది? వైర్లపై ఎలా నిలబడగలిగింది? అంటూ ‘హా’శ్చర్యపోతున్నారు! ఆ తెల్ల మేక వైర్‌పై నాలుగు కాళ్లు నిలిపి.. తాపీగా ఆ తీగ మీద వేలాడుతున్న ఆకులను తాపీగా తింటూ ఉంటుంది. ఆ దృశ్యాన్ని జూమ్ చేసి మరీ చూపారు. ఎలాంటి భయం లేకుండా, బ్యాలెన్స్ మెయింటెన్ చేసుకుంటున్న మేక సాహసాన్ని చూసి కొందరు విస్తుపోయారు.
వీడియో ప్రారంభంలో కరెంటు స్తంభాలు, కరెంటు తీగలను చూడొచ్చు.. జూమ్ చేసేసరికి.. సుమారు ఆరు మీటర్ల ఎత్తులోని ఆ తీగలపై ఒక తెల్లని మేక నిలబడి ఆకులు తింటూ కనిపిస్తుంది. దీనిని ఎక్కడ చిత్రీకరించిదీ తెలియలేదు. సాధారణంగా మేత కోసం మేకలు గుట్టలు, కొండలు సైతం ఎక్కేస్తూ ఉంటాయి. అయితే.. కరెంటు తీగలపైకి ఎక్కినట్టు కనిపించడం సహజంగానే చూపరులను ఆకర్షించింది. కానీ.. చివరకు అదొక కృత్రిమ మేధతో సృష్టించిన వీడియో అని తెలుసుకుని తెగ నవ్వేసుకుంటున్నారు. మేకల వంటివి తీగలపై ఎక్కడం అనేది అద్భుతమే. కానీ.. అంత అద్భుతం జరుగుతున్నా.. కింద వచ్చీపోయే ప్రజలు.. ఏమీ జరుగనట్టు ఉన్నారంటేనే అది కల్పితమని అర్థమయిపోతున్నది. తీగలపై ఉన్న ఆకులను మేక టచ్ చేయడం కూడా కనిపించలేదు. వాస్తవానికి తీగలపై పడిన ఆకులను వీడియో తీస్తే.. దానిని ఉపయోగించుకుని ఒక ఔత్సాహికుడు దానికి మేకను జోడించాడన్నమాట. కొందరు నెటిజన్లు ఆ ట్రిక్‌ను కనిపెట్టేసి.. ఇది ఏఐ వీడియో అని తేల్చేశారు.