AP Election results: కౌంటింగ్‌రోజు మధ్యాహ్నం 2గంటలకే అధికారం ఎవరిదో డిసైడ్.. లెక్క ఇదే!!

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలు ఆంధ్రప్రదేశ్ లో మాత్రమే కాదు దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరికి ఉత్కంఠను రేకెత్తిస్తున్నాయి. ఏపీ ఎన్నికల ఫలితాలలో ఎవరు విజయం సాధిస్తారు? కౌంటింగ్ రోజు ఏం జరగబోతుంది? అధికారం కూటమిదా, లేకా వైసీపీదా అన్నది అందరిలోనూ ఆసక్తిగా మారింది.


జూన్ 4వ తేదీన కౌంటింగ్ ఏర్పాట్లపై ముఖేష్ కుమార్ మీనా
అయితే జూన్ 4న ఏపీ కౌంటింగ్ కు ఏర్పాట్లు అన్ని పూర్తి చేసినట్టుగా పేర్కొన్న ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా నాల్గవ తేదీ రాత్రి 8 గంటల నుండి 9 గంటల మధ్య అన్ని నియోజకవర్గాలు తుది ఫలితాలను ప్రకటిస్తామని పేర్కొన్నారు. జూన్ 4వ తేదీన జరిగే కౌంటింగ్ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడానికి కావలసిన అన్ని ఏర్పాట్లను పూర్తి చేసినట్టు ఆయన పేర్కొన్నారు.
ఈసీకి నియోజకవర్గాల వారీగా లెక్కింపు ఏర్పాట్ల వివరణ
ఢిల్లీ నిర్వచన సదన్ నుండి వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడిన సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ నితీష్ వ్యాస్ కు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా ఎన్నికల కౌంటింగ్ ఏర్పాట్లను గురించి తెలిపారు. ఏపీ ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా రాష్ట్రంలో ఓట్ల లెక్కింపుకు సంబంధించి నియోజకవర్గాల వారీగా చేస్తున్న ఏర్పాట్లను వివరించారు.

175 వర్గాలలో ఎన్ని రౌండ్ల లెక్కింపు అంటే
ఓట్ల లెక్కింపుకు పటిష్టమైన ఏర్పాట్లు చేస్తున్నామని, ఫలితాలు వెంటవెంటనే ఇచ్చేలాగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. రాష్ట్రంలోని మొత్తం 175 శాసనసభ నియోజకవర్గాలలో 111 నియోజకవర్గాలలో 20 రౌండ్ల లోపు, 61 నియోజకవర్గాల్లో 21 నుండి 24 రౌండ్ల లోపు ఫలితాలు వెలువడనున్నాయని తెలిపారు. ఒక మూడు నియోజకవర్గాలలో మాత్రం 25 రౌండ్లకు పైబడి ఓట్ల లెక్కింపు కార్యక్రమం ఉంటుందని తెలిపారు.

2 గంటలలోపే అధికారం ఎవరిదో డిసైడ్
మెజారిటీ ఫలితాలు మధ్యాహ్నం రెండు గంటల్లోపే వస్తాయని, 111 నియోజకవర్గాలలో మధ్యాహ్న రెండు గంటల లోపు, మిగతా 61 నియోజకవర్గాలలో సాయంత్రం నాలుగు గంటల లోపు, మిగిలిన మూడు నియోజకవర్గాలలో సాయంత్రం 6 గంటలకు ఓట్ల లెక్కింపు పూర్తి అవుతుందని ఆయన పేర్కొన్నారు. ఇక పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు కోసం టేబుల్ లను పెంచి సకాలంలో బ్యాలెట్ లెక్కింపును కూడా పూర్తి చేస్తామని ముఖేష్ కుమార్ మీనా వెల్లడించారు.

మొత్తం లెక్కింపు రాత్రికి పూర్తి
మొత్తంగా రాత్రి 8 గంటల నుండి 9 గంటల లోపే అన్ని నియోజకవర్గాల తుది ఫలితాలు ప్రకటించే విధంగా చర్యలు తీసుకుంటున్నామని ఆయన తెలిపారు. రాష్ట్ర ప్రధాని ఎన్నికల అధికారి చెప్పిన దాన్ని బట్టి ఏపీలో అధికారం ఎవరిది అనేది మధ్యాహ్నం రెండు గంటల వరకే తేలనుంది. అయితే పూర్తి ఫలితాలు వెల్లడి కావడానికి రాత్రి అయ్యే అవకాశం ఉంది.