ఏపీలో ఎన్నికల ఫలితం పైన ఎగ్జిట్ పోల్స్ ఉత్కంఠ పెంచుతున్నాయి. పలు సంస్థలు ఏపీలో అధికారం పైన భిన్న అంచనాలు వెల్లడించాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తి ఉన్న నియోకవర్గాల్లో విజయవాడ లోక్ సభ స్థానం తొలి వరుసలో ఉంది.
అక్కడ కేశినేని బ్రదర్స్ రెండు పార్టీల నుంచి పోటీ చేస్తున్నాయి. మోరా హోరీగా సాగిన ఎన్నికల సమరంలో గెలుపు ఎవరికి దక్కుతుందనే దాని పైన ఎగ్జిట్ పోల్స్ ఆసక్తి కర విశ్లేషణ చేసాయి. బ్రదర్స్ లో గెలిచేదెవరో అంచనాకు వచ్చాయి.
ఆసక్తి కర రాజకీయం
విజయవాడలో ఎన్నికల రాజకీయం ఆసక్తి కరంగా సాగింది. సిట్టింగ్ ఎంపీ కేశినేని నాని టీడీపీ వీడి వైసీపీలో చేరారు. ఆయన వైసీపీ నుంచి విజయవాడ ఎంపీగా బరిలో నిలిచారు. దీంతో, ఆయన సోదరుడు కేశినేని చిన్నికి టీడీపీ సీటు ఖరారు చేసింది. నాని అప్పటికే రెండు సార్లు ఎంపీగా గెలుపొందారు. నియోజకవర్గంలో ఉన్న పరిచయాలు, వైసీపీ సంక్షేమ ఓట్ బ్యాంక్, సామాజిక సమీకరణాలు నానికి కలిసి వస్తాయనే లెక్కలు వేసారు. అదే విధంగా విజయవాడ నగరంలో నాని హయాంలో చేసిన పనులు తిరిగి గెలుపుకు దోహదం చేస్తాయని భావించారు.
కేశినేని బ్రదర్స్ ఫైట్
ఇటు..కేశినేని చిన్నికి సీటు ఖాయమైన సమయం నుంచి వ్యూహాత్మకంగా వ్యవహరించారు. జనసేన, బీజేపీకి పార్లమెంట్ పరిధిలో ఉన్న ఓట్ బ్యాంక్ పూర్తిగా తనకు మద్దతు ఇచ్చేలా అడుగులు వేసారు. ఆ రెండు పార్టీల నేతలతో సమన్వయంతో పని చేసారు. టీడీపీ అధినాయకత్వం చిన్నికి అండగా నిలవటంతో క్షేత్ర స్థాయిలో పార్టీ నేతలు సైతం పూర్తిగా సహకరించారు. ఎన్నికల్లో కీలకమైన సమన్వయం ఎక్కడా దెబ్బ తినకుండా జాగ్రత్తగా అందరితో కలిసి పని చేసారు. పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీ ఎమ్మెల్యే అభ్యర్దులతో కలిసి ఎలక్షనీరింగ్ పక్కాగా అమలు చేసారు.
గెలుపు దక్కేదెవరికి
పోలింగ్ సరళి గమనించిన తరువాత కేశినేని బ్రదర్స్ లో గెలుపు ఎవరికి దక్కుతుందనే ఉత్కంఠ మరింత పెరిగింది. రెండు వైపులా క్షేత్ర స్థాయిలో పోలింగ్ సరళి గురించి సమాచారం సేకరించి ఎవరికి వారు తమకు అనుకూలంగా లెక్కలు వేసుకున్నారు. గెలుపు ఖాయమంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ సమయంలో వెల్లడైన ఎగ్జిట్ పోల్స్ విజయవాడ ఫలితం పైన ఆసక్తికర విశ్లేషణ చేసాయి. జగన్ సంక్షేమం, సామాజిక సమీకరణాలు పని చేసాయని పేర్కొన్నారు. అదే సమయంలో జగన్ వ్యతిరేకత అర్బన్ ప్రాంతంలో స్పష్టంగా కనిపించిందని..మూడు పార్టీల పొత్తు విజయవాడ పార్లమెంట్ పరిధిలో టీడీపీకి కలిసి వచ్చిందని విశ్లేషించారు. ఫలితంగా విజయవాడ పార్లమెంట్ పరిధిలో టీడీపీకి గెలుపు అవకాశాలు ఉన్నాయని అంచనా వేసారు.