Passport colours – పాస్‌పోర్టులు ఆ రంగుల్లోనే ఎందుకు? నాలుగు వర్ణాల్లోనే ప్రపంచ దేశాల పాస్‌పోర్టులు

పాస్‌పోర్టులు ఆ రంగుల్లోనే ఎందుకు?
నాలుగు వర్ణాల్లోనే ప్రపంచ దేశాల పాస్‌పోర్టులు


వివిధ దేశాలకు చెందిన పాస్‌పోర్టులను ఎప్పుడైనా గమనించారా? అవి కేవలం నాలుగు రంగుల్లోనే ఉంటాయి. పాస్‌పోర్టు ఫలానా రంగుతోనే ఉండాలని ప్రపంచంలో ఎక్కడా చట్టాలు గానీ, మార్గదర్శకాలు కానీ లేవు. అయినా కేవలం ఎరుపు, నీలం, నలుపు, ఆకుపచ్చ రంగుల్లోనే కనిపిస్తుంటాయి. ఏ దేశానికి చెందిన పాస్‌పోర్టును పరిశీలించినా ఈ నాలుగు రంగుల్లో ఏదో ఒకటి అయి ఉంటుంది. అయితే, దీనికి గల కారణాలను ఓ అంతర్జాతీయ వార్తా సంస్థ వెల్లడించింది.
ముదురు వర్ణంతో నలుపు, ఎరుపు, నీలం, ఆకుపచ్చ రంగుల్లోనే పాస్‌పోర్టులు తయారు చేయడం వల్ల అవి అధికారికంగా కనిపిస్తాయి (అఫీషియల్‌ లుక్‌). తర్వాతి ప్రాధాన్యం చాలా అరుదుగా నియాన్‌ పింక్‌ రంగుకు ఇస్తారు. అంతేకాక దేశాల సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా ఆయా దేశాలు ఈ నాలుగు రంగుల్లోనే ఏదో ఒకదాన్ని ఎంచుకుంటాయి. మతపరంగా ఇస్లాంను ఆకుపచ్చ రంగు ప్రతిబింబిస్తుంది కాబట్టి సంబంధిత దేశాల పాస్‌పోర్టులు ఎక్కువగా ఈ రంగులో ఉంటాయి. ఎరుపు రంగుతో ఎక్కువగా ఐరోపా దేశాల పాస్‌పోర్టులు కనిపిస్తాయి. నీలం రంగుతో భారత పాస్‌పోర్టులు ఉంటాయి.
అంతేకాక, పాస్‌పోర్టు తయారీలో కొన్ని అంతర్జాతీయ నిబంధనలు ఉన్నాయి. వీటిని అన్ని దేశాలు కచ్చితంగా పాటించాల్సిందే. పాస్‌పోర్టు తయారు చేసే పేజీలు వంగే గుణం కలిగి ఉండాలి. ఇదే సమయంలో అవి మడత పడకుండా, రసాయనాలకు దెబ్బతినకుండా ఉండాలి. ఉష్ణోగ్రత, తేమ, కాంతి తగిలినా పాడవకుండా తట్టుకోగలగాలి. అందులో వాడే అక్షరాల పరిమాణం, రకం (ఫాంట్‌ టైప్‌) అంతర్జాతీయ పౌర విమానయాన సంస్థ (ఐసీఏఓ) ప్రమాణాలకు లోబడి ఉండాలి. అయితే, పాస్‌పోర్టు రంగు విషయంలో మాత్రం నిబంధనలేవీ లేవని ఐసీఏఓ చీఫ్‌ అంటోనీ ఫిలిబిన్‌ ధ్రువీకరించారు.