బాలకృష్ణ (Balakrishna) హోస్ట్‌గా వ్యవహరిస్తున్న టాక్ షో ‘అన్‌స్టాపబుల్’ (Unstoppable). ఆ షో 4వ సీజన్ తాజా ఎపిసోడ్‌లో హీరో వెంకటేశ్ (Venkatesh), ఆయన అన్నయ్య, నిర్మాత సురేశ్ బాబు అతిథులుగా హాజరయ్యారు. ఆ ఎపిసోడ్ ఓటీటీ ‘ఆహా’ (Aha)లో స్ట్రీమింగ్ అవుతోంది. అందంగా ఉండి కూడా హీరో కాకుండా నిర్మాత ఎందుకయ్యావ్? అని బాలకృష్ణ అడగ్గా సురేశ్ బాబు (Suresh Babu) గత జ్ఞాపకాలు గుర్తుచేసుకున్నారు.
‘‘అసలు నాకు ఇండస్ట్రీలోకి రావాలనే ఆసక్తే లేదు. సినిమాలొద్దురా.. ఇక్కడ కష్టం.. బాగా చదువుకోండి అని చిన్నప్పుడు నాన్న చెప్పేవారు. పెద్దయ్యాక.. చెన్నైలో ఉండే సమయంలో నన్ను చూసిన దర్శకులు హీరోగా అవకాశాల గురించి చెబితే వద్దు అనేవాడిని. నాన్న.. సురేశ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌కు సంబంధించిన SP లోగోలో Sపై వెంకటేశ్‌ను నిలబెట్టారు. స్టార్ అవుతాడని. Pపై నన్ను నిలబెట్టారు. అది ప్రొడ్యూసర్ అని’’ సురేశ్‌బాబు చెప్పారు. తన సోదరుడు కమల్ హాసన్‌లా ఉంటాడని అప్పట్లో చాలామంది తనకు చెప్పారని వెంకటేశ్ అన్నారు. నా సోదరుడు అందగాడు అని ఫీలయ్యేవాడిని.
వెంకటేశ్‌లో నచ్చని అంశం గురించి చెప్పమని అడగ్గా సురేశ్‌బాబు స్పందించారు. ఎవరు తప్పు చేసినా పట్టించుకోడని, లైట్ తీసుకుంటాడని తెలిపారు. కుటుంబ బాధ్యతల గురించి మాట్లాడుతూ.. ‘‘మా నాన్నమ్మ, వాళ్ల సోదరుడికి ఏమైనా సమస్యలు వస్తే ముందు నాతో చెప్పేవారు. ‘మీ నాన్నను ఇది అడుగు. అది అడుగు’ అని అనేవారు. అలా నేను 9వ తరగతి చదివే సమయం నుంచే అది అలవాటుగా మారింది. ఎక్కడైనా సమస్య ఉంటే నా వంతు పరిష్కారం చూపేందుకు అక్కడే బీజం పడింది’’ అని పేర్కొన్నారు.
‘‘వెంకటేశ్‌తో సినిమా చేసేందుకు ఎవరైనా కథ తీసుకొస్తే నేను ముందు నిర్మాతగానే వింటా. ప్రొడ్యూసర్స్‌కు డబ్బులు వస్తాయా, లేదా? అనేది చూస్తా. ఒకవేళ నాకు స్టోరీ నచ్చకపోతే నిర్మొహమాటంగా చెప్పేస్తా. ‘చంటి’, ‘సుందరకాండ’ చిత్రాలు తనకు సెట్ కావని మేం అనుకున్నాం. వెంకటేశ్ కెరీర్‌లో మైలురాయిగా నిలిచే సినిమాలన్నీ తను ఎంపిక చేసుకున్నవే’’ అని సురేశ్ బాబు తెలిపారు.
‘‘నాన్న ఆఖరి రోజుల్లో కూడా సినిమా స్క్రిప్టులు చదువుతూ ఉండేవారు. ఓ రోజు నన్ను పిలిచి ‘ఈ చిత్రం మనం చేస్తే బాగుంటుంది’ అని చెప్పారు. నాకు ఇంకో బిగ్ హిట్ ఇవ్వాలని కోరుకున్నారు. మేం కలిసి తెరపై కనిపించలేకపోయాం. ఏదో ఒక మూవీ చేసి ఉంటే బాగుండేది ఇప్పటికీ ఫీలవుతుంటా’’ అని వెంకటేశ్ ఎమోషనల్ అయ్యారు. ‘‘ఎంత మంచి పని చేసినా ఎంపీగా ఓడిపోయినందుకు నాన్న చాలా బాధపడ్డారు’’ అని సురేశ్ బాబు అన్నారు.