ప్రతి రోజు లేదా వారానికి ఒక్కసారైనా గుడికి వెళ్ళడం దాదాపుగా అందరికీ అలవాటు ఉంటుంది. మరి దేవాలయంలో తీర్థం, శఠగోపం, కానుక/దక్షిణ చూస్తూనే ఉంటాం. అయితే.. తీర్థం గురించి ఎంతో కొంత తెలుసు. దానిలో కలిపే ఔషధులు, తులసీ తదితరాలతో ఆరోగ్యం, మనస్సు, వాక్కు శుచి అవుతుంది. అయితే వెండి లేదా రాగి లేదా ఇత్తడి శఠగోపం ప్రతీ భక్తుడి తలపై పెడుతారు. దీనివల్ల ఉపయోగం ఏమిటి ? దీని వెనుక ఉన్న రహస్యం ఏమిటో తెలుసుకుందాం.
శఠగోపం గుడిలోని దేవుడు లేదా దేవత విగ్రహానికి ప్రతీక పేర్కొంటారు పండితులు. గుడికి వెళ్లిన ప్రతి భక్తునికి ఆలయంలో ఉండే దేవతా విగ్రహాలను తాకే వీలుండదు. అందుకే ఆలయ పూజారి భక్తులకు తీర్థప్రసాదాలిచ్చిన తర్వాత శఠారిని తీసుకొచ్చి భక్తుల తలపై పెట్టి ఆశీర్వచనం ఇస్తాడు.
ఆలయ పూజారి శఠారిని తీసుకు వచ్చి భక్తుల తలపై పెట్టడం వలన వారిలో ఉండే చెడు ఆలోచనలు, ద్రోహబుద్ధులు నశిస్తుందని చెబుతారు. అంతే కాదు శఠగోపం అత్యంత గోప్యమైనది కనుక అది పెట్టే పూజారికి కూడా విన్పించనంతగా కోరకను తలుచుకోవాలంటారు పండితులు. శఠగోపాన్ని కొన్ని ప్రాంతాల వారు శఠగోపం, శడగోప్యం అని అంటారు. శఠగోపం అంటే త్యంత గోప్యమైనది అని అర్థం. భక్తులు దేవాలయంలో దర్శనం అయ్యాక ప్రదక్షిణలు చేసి, తీర్థం, శఠగోపనం తీసుకుంటారు.
శఠగోపం విశేషాలు:
శఠగోపాన్ని పంచలోహాలైన వెండి, రాగి, కంచు మొదలైన వాటితో తయారు చేస్తారు. శఠగోపం వలయాకారంలో ఉంటుంది. వాటిపై భగవంతుని పాదాల గుర్తులు ఉంటాయి. శఠగోపం తలపై పెట్టినప్పుడు పాదాలు మన తలను తాకుతాయి. అలాకాక నేరుగా పాదాలనే తలపై ఉంచితే అవి మొత్తం తలని తాకడానికి అనుకూలంగా ఉండదు కాబట్టి శఠగోపాన్ని వలయాకారంలో తయారుచేసి పైన పాదుకలు ఉంచుతారు. అంటే మనము కోరికలను శఠగోపం పెట్టినప్పుడు తలుచుకుంటే భగవంతుడి పాదాల వద్ద చెప్పుకున్నట్లే.శఠత్వం అంటే మూర్ఖత్వం అని, గోపం అంటే దాచిపెట్టడం అని కూడా ఉంది.
భగవంతుడు మనిషిలో గోప్యంగా ఉన్న మూర్ఖత్వాన్ని, అహంకారాన్ని తొలగించి జ్ఞానిగా చేస్తాడనేది ఆధ్యాత్మికుల భావన. నేను, నాది అనే భ్రమను తొలగించడానికి శఠగోపం పెడతారు. శఠగోపం వలన కలిగే ఫలితం: శఠగోపం తలమీద పెట్టించుకోవడం వలన ఆధ్యాత్మికంగా మాత్రమే కాక సైన్స్ పరంగా కూడా ఎన్నో ఫలితాలు కలుగుతాయి. శఠగోప్యమును తలమీద ఉంచిన ప్పుడు శరీరంలో ఉన్న విద్యుత్, దాని సహజత్వం ప్రకారం శరీరానికి లోహం తగిలినపుడు విద్యుదావేశం జరిగి, మనలోని అధిక విద్యుత్ బైటికెళుతుంది. తద్వారా శరీరంలో ఆందోళనా, ఆవేశమూ తగ్గుతాయి. ఏది ఏమైనా మన పూర్వీకులు ఏర్పాటుచేసిన వాటిలో సైన్స్ తప్పక ఉంటుంది. అయితే అది శాస్త్రం మరింత అభివృద్ధ చెందినప్పుడు మరింత వెలుగులోకి వస్తుంది.
– శ్రీ