AP News: బీజేపీ, టీడీపీ పొత్తు ప్రకటన ఎందుకు ఆలస్యమవుతోంది? ఇంకా సీట్ల పంచాయితీ తెగలేదా?

Andhra Pradesh News: ప్రతి సీన్ కూడా క్లైమాక్స్లో ఉంటుందని అని అప్పట్లో ఓ సినిమా డైలాగ్. కానీ ఇప్పుడు ఏపీ రాజకీయానికి సరిపోతుంది. ఇంకా ముఖ్యంగా టీడీపీ, బీజేపీ పొత్తుకు అతికినట్టు ఉంటుంది.
అవును నిజమే. వీరి స్నేహంపై గంటకో బ్రేకింగ్ న్యూస్ పూటకో షాకింగ్ న్యూస్. ఇదిగో పొత్తు ఖాయమైపోయిందని ఒకసారి. లేదు లేదు. ఇంకా చర్చలు జరుగుతున్నాయి మరోసారి. అన్నీ ఓకే కానీ సీట్ల పంచాయితే తెగలేదని ఇంకొకసారి. ఇలా తెలుగు సీరియల్లా ఎపిసోడ్ ఎపిసోడ్లు సాగిపోతూనే ఉంది. ఇంతకీ ఏం జరిగింది? ఎందుకీ ఆలస్యం.?


బీజేపీ, టీడీపీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం వచ్చే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేస్తాయని వాస్తవం. ఇంకా సీట్ల పంచాయితీ విషయంలో ఎలాంటి వివాదం లేదంటున్నారు. కేవలం పొత్తును అధికారికంగా ప్రకటించడం ఒక్కటే మిగిలి ఉందని అంటున్నారు. మరి ఎందుకు ఆలస్యమైంది అంటే బీజేపీ నేతల షెడ్యూల్ కారణంగానే అంటున్నారు.
పొత్తులు సీట్ల ప్రకటన విషయంలో అమిత్షా కీలక పాత్ర పోషిస్తున్నారు. వివిధ రాష్ట్రాల నుంచి తమ పార్టీ నాయకులను పిలిపించి ఎవరితో పొత్తు ఉండాలో ఎవరికి ఎన్ని సీట్లు కేటాయించాలో బలాబలాల ఆధారంగా ఎన్ని సీట్లలో పోటీ చేయాలో నిర్ణయిస్తున్నారు. శుక్రవారం కూడా అదే జరిగింది. మహారాష్ట్ర ఒడిశా రాష్ట్ర నేతలతో సుదీర్ఘంగా మంతనాలు జరిపారు.

ముందు ఒడిశా రాష్ట్ర నేతలతో సమావేశం అయ్యారు. అక్కడ నవీన్ పట్నాయక్ను ఎన్డీఏలోకి ఆహ్వానిస్తున్నారు. అందుకే బీజేడీతో పొత్తులో భాగంగా పోటీ చేయాల్సిన సీట్లు, మిగతా సర్దుబాట్లపై వారితో చర్చించారు. అక్కడ బలాలను అంచనా వేసుకొని ఓ లిస్ట్ ప్రిపేర్ చేస్తున్నారు. ఒకట్రెండు రోజుల్లో ప్రకటించబోయే రెండో జాబితాలో ఒడిశాలో పోటీ చేసే అభ్యర్థుల పేర్లు ఉంటాయి.
ఆ తర్వాత మహారాష్ట్ర నేతలతో మాట్లాడారు. కాంగ్రెస్, ఉద్దవ్ ఠాక్రేను కాదని వచ్చిన నేతల భవిష్యత్పై ఏక్నాథ్షిండే, మహారాష్ట్ర బీజేపీ నేతలతో మంతనాలు జరిపారు. వారిని ఏక్నాథ్ షిండే శివసేన, బీజేపీ ఇతర రెబల్ అభ్యర్థులు ఎవరు ఎన్ని సీట్లలో పోటీ చేయాలి అనేతి చర్చించారు. అయితే రెండు మూడు సీట్ల వ్యవహారంలో ఇరు వర్గాలు పట్టుబట్టారు. దీంతో చర్చలు అర్థరాత్రి వరకు సాగాయి.

మహారాష్ట్ర సీట్ల వ్యవహారం త్వరగా తేల్చుకుని టీడీపీ, జనసేనతో చర్చించాల్సి ఉందని అంటున్నారు. అయితే మహారాష్ట్ర పంచాయితీ సుదీర్ఘంగా కొనసాగడంతో ఏపీ వ్యవహారం వాయిదా వేశారని సమాచారం. ఇవాళ కచ్చితంగా దీనిపై ప్రకటన ఉంటుందని అంటున్నారు.

ఏపీలో సీట్ల పంచాయితీ లేదని సమాచారం. జనసేన, బీజేపీ కలిసి 30 అసెంబ్లీ సీట్లలో పోటీ చేయబోతుందని… ఆ రెండు పార్టీలకుు 8 వరకు పార్లమెంట్ స్థానాలు ఇచ్చేందుకు టీడీపీ అంగీకరించిందని తెలుస్తోంది. ఇప్పటికే జనసేనకు ప్రకటించిన 24 స్థానాలు మినహాయిస్తే బీజేపీ 6 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయబోతోంది. పార్లమెంట్ స్థానాల విషయానికి వస్తే జనసేనకు 3 స్థానాలను టీడీపీ ఇచ్చింది. అంటే మిగిలిన ఐదు స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు నిలబడే ఛాన్స్ ఉంది.
అరకు, అనకాపల్లి, కాకినాడ, రాజమండ్రి, నరసాపురం, మచిలీపట్నం, తిరుపతి, రాజంపేట ఎంపీ స్థానాలను బీజేపీజనసేనకు కేటాయించారు. మిగిలిన చోట్ల టీడీపీ అభ్యర్థులు పోటీకి దిగుతారు.