వరలక్ష్మీ వ్రతం మహిళలు జరుపుకునే పవిత్రమైన పండుగలలో ఒకటి. ఈ రోజున స్త్రీలు శ్రేయస్సు, సంపదలను ప్రసాదించే మహాలక్ష్మీ దేవిని పూజిస్తారు.
శ్రావణ మాసంలోని ప్రతి శుక్రవారం వరలక్ష్మీ వ్రతానికి పవిత్రమైనదిగా భావించబడుతుంది. అయితే, శుక్లపక్షంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం ఈ వ్రతాన్ని ఆచరించడం సంప్రదాయంగా వస్తోంది.
ఈ పవిత్ర రోజున శ్రీ మహా విష్ణువు భార్య అయిన మహాలక్ష్మిని వరలక్ష్మీ దేవిగా భావించి, వరాలు ప్రసాదించే దేవతగా పూజిస్తారు. ఈ వ్రతం ప్రధానంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో వివాహిత మహిళలు విశేషంగా ఆచరిస్తారు. ఈ రోజు చేసే లక్ష్మీ పూజ అష్టలక్ష్మీ పూజలకు సమానమని నమ్ముతారు.
వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించి, ఉపవాసం ఉండడం వల్ల అష్టైశ్వర్యాలు అయిన సంపద, భూమి, విద్య, ప్రేమ, కీర్తి, శాంతి, సంతోషం, శక్తి లభిస్తాయని విశ్వాసం. ఈ సందర్భంలో, ఈ సంవత్సరం వరలక్ష్మీ వ్రతం ఎప్పుడు జరుపుకుంటారో తెలుసుకుందాం.
వరలక్ష్మీ వ్రతం ఆచరణ విధానం
వరలక్ష్మీ వ్రతంలో లక్ష్మీ దేవిని ఆరాధిస్తారు. పూజా విధానం ప్రకారం, మొదట విఘ్నేశ్వరుడిని పూజించి, ఆ తర్వాత:
నమస్తేస్తు మహామాయే శ్రీ పీఠే సుర పూజితే
శంఖచక్ర గదా హస్తే మహాలక్ష్మీ నమోస్తుతే
అని శ్రీ లక్ష్మీ దేవి పూజను ప్రారంభించాలి. కలశాన్ని సిద్ధం చేసి, వరలక్ష్మీ దేవిని ఆవాహన చేయాలి. షోడశోపచార పూజ, అథాంగ పూజలు నిర్వహించాలి. ఆ తర్వాత లక్ష్మీదేవి అష్టోత్తర శతనామాలను చదువుతూ పూజించి, దూపం, దీపం, నైవేద్యం, తాంబూలం సమర్పించాలి. మంగళ హారతి ఇచ్చి, తోరగ్రంథి పూజ చేసి, తోరబంధన మంత్రం చదువుతూ నవసూత్రాన్ని కుడి చేతికి కట్టుకోవాలి. నవకాయ పిండి వంటలు, పండ్లు మొదలైనవి అమ్మవారికి సమర్పించాలి. చివరగా, రవిక, పసుపు, కుంకుమ, తాంబూలంతో పాటు వాయనదాన మంత్రం చదువుతూ ముత్తైదువును మహాలక్ష్మీగా భావించి వాయనం సమర్పించాలి.
వరలక్ష్మీ వ్రతం 2025 తేదీ
హిందూ పంచాంగం ప్రకారం, శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం ఈ వ్రతాన్ని జరుపుకుంటారు. 2025 సంవత్సరంలో వరలక్ష్మీ వ్రతం ఆగస్టు 8న జరుగుతుంది.
వరలక్ష్మీ వ్రతం 2025 ముహూర్తం
సింహ లగ్న పూజ ముహూర్తం (ఉదయం): ఉదయం 06:29 – 08:46
వృశ్చిక లగ్న పూజ ముహూర్తం (మధ్యాహ్నం): మధ్యాహ్నం 01:22 – 03:41
కుంభ లగ్న పూజ ముహూర్తం (సాయంత్రం): రాత్రి 07:27 – 08:54
వృషభ లగ్న పూజ ముహూర్తం (అర్ధరాత్రి): రాత్రి 11:55 – తెల్లవారుజామున 01:50 (ఆగస్టు 9)
స్థిర లగ్న సమయంలో లక్ష్మీ దేవిని పూజించడం వల్ల దీర్ఘకాలిక శ్రేయస్సు లభిస్తుందని నమ్మకం.
తోరణం యొక్క ప్రాముఖ్యత
వరలక్ష్మీ వ్రతంలో తొమ్మిది దారపు గుండీలతో తొమ్మిది ముడులు కట్టి, మధ్యలో పంచపుష్పాలు ఉంచి, పసుపు పూసిన దారంతో తోరణాన్ని తయారు చేస్తారు. ఈ తోరణాన్ని పూజ సమయంలో అమ్మవారి ముందు ఉంచి, తోరగ్రంథి పూజ చేయాలి. పూజ అనంతరం ఈ తోరణాన్ని కుడి మణికట్టుకు రక్షణ చిహ్నంగా ధరించాలి.
గమనిక: ఈ సమాచారం మత విశ్వాసాలు, పండితుల సూచనల ఆధారంగా అందించబడింది. ఇందులో శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి.































