తెలంగాణకు 1947లో స్వాతంత్య్రం ఎందుకు రాలేదు, నిజాం రజాకార్ల ఆగడాలు ఎలా ముగిశాయి

భారతదేశానికి 1947 ఆగస్టు 15న బ్రిటిష్ పాలన ముగిసి స్వాతంత్య్రవేడుకలు జరిగాయి. కానీ, హైదరాబాద్ సంస్థానంలో మాత్రం జాతీయ జెండా ఎగురవేస్తే జైల్లో వేసే పరిస్థితి.


హైదరాబాద్ సంస్థానానికి స్వాతం త్య్రం రాకపోవడానికి కారణం ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్ట్ 1947. అందులో ఏముంది? ఎందుకు హైదరాబాద్ సంస్థానానికి ఈ పరిస్థితి వచ్చిందో ఈ కథనం ద్వారా తెలుసుకుందాం.

ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్ట్లో ఏముంది?

మన దేశానికి స్వాతంత్య్రం కోసం బ్రిటిష్ ప్రభుత్వం ఒక చట్టాన్ని రూపొందించింది. దాన్ని ఆ దేశ పార్లమెంట్ ఆమోదించింది. ఆ చట్టాన్నే ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్ట్ 1947 అని చెబుతారు. దీని ప్రకారం భారతదేశానికి స్వాతంత్య్రం సిద్ధించింది. ఈ చట్టంలోని ముఖ్యమైన అంశం బ్రిటిష్ పారమౌంటసీ (Paramountcy) రద్దు. ఈ విధానం రద్దు ద్వారా భారతదేశానికి స్వాతంత్య్రం సిద్ధించింది. అంటే బ్రిటిష్ ప్రభుత్వానికి భారతదేశంలోని దాదాపు 500 సంస్థానాలపై ఉన్న సర్వాధికారాలు ముగిసిపోయినట్లు ఈ చట్టంలో పేర్కొన్నారు. ఈ కారణంగా భారతదేశంలో బ్రిటిష్ పాలన ముగిసింది. ఈ చట్టం భారతదేశంలోని నాటి సంస్థానాల ముందు మూడు మార్గాలను ఉంచి, ఏదో ఒకటి ఎంచుకోవాలని సూచించింది.

ఈ చట్టం ద్వారా సంస్థానాలకు సూచించిన మూడు మార్గాలు:

1. స్వచ్ఛందంగా భారతదేశంలో విలీనం కావడం.

2. పాకిస్తాన్లో విలీనం కావడం.

3. స్వతంత్ర రాజ్యంగా ఉండటం.

ఇలా బ్రిటిష్ పాలకులు భారతదేశానికి స్వాతంత్య్రం ఇస్తున్నట్లు చెప్పినప్పటికీ, సంస్థానాల విషయంలో వారి భవిష్యత్తు వారిదే అన్నట్లుగా వదిలి వెళ్లారు. ఈ కారణంగా హైదరాబాద్ సంస్థానంలోని నిజాం మూడో అవకాశాన్ని ఎంచుకున్నారు. ఆ సమయంలో ఆసియాలోనే నిజాం పాలనలో ఉన్న హైదరాబాద్ సంస్థానం అతి పెద్ద సంస్థానంగా వెలుగొందింది. దీనికి తనే రాజుగా ఉండాలని నాటి నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఆలోచన. హైదరాబాద్ స్వతంత్ర దేశంగా మనుగడ సాగించే అర్హతలు ఉన్నాయని భావించారు. ఈ కారణాలతో భారతదేశంలో విలీనం కావడానికి నాటి నిజాం సమ్మతించలేదు. ఒక రకంగా బ్రిటిష్ పాలకులు చేసిన ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్ట్ 1947 ద్వారా నిజాంకు నైతికంగా మద్దతు ఇచ్చినట్లు అయింది. అయితే, వారు నిజాంకు ఈ విషయంలో ఎలాంటి సాయం అందించకపోవడం గమనార్హం.

ఆపరేషన్ పోలోతో దిగివచ్చిన నిజాం

ఏడాది పాటు నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ భారత్లో తన సంస్థానం విలీనం కావడానికి అంగీకరించలేదు. బ్రిటిష్ పాలకుల నాటి ఒప్పందాల మాదిరిగానే భారత ప్రభుత్వంతో నిజాం సంబంధాలు కలిగి ఉన్నారు. అయితే నిజాం ప్రేరేపిత ప్రైవేటు సైన్యం అయిన రజాకార్లు సైనిక శక్తిని పెంచుకోవడానికి, ఆయుధాలను సేకరించడానికి ప్రయత్నించారు. మరోవైపు ఖాసిం రజ్వీ ఆధ్వర్యంలో రజాకార్ల హింస పెరిగింది. హైదరాబాద్ సంస్థాన ప్రజల తిరుగుబాటు తోడైంది.

అప్పటికే ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ దేశంలోని సంస్థానాలన్నింటినీ భారత్లో విలీనం చేసే ప్రక్రియను ఒక్కొక్కటిగా పూర్తి చేస్తూ వచ్చారు. పరిస్థితులు విషమిస్తుండటంతో, హైదరాబాద్ సంస్థాన ప్రజల పోరు, రజాకార్ల హింస, పటేల్ వ్యూహ రచన కారణంగా నిజాం పాలనపై ఆపరేషన్ పోలో పేరుతో భారత ప్రభుత్వం సైనిక చర్యకు దిగింది. దీంతో ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్ట్ 1947 ను ఉపయోగించుకుని స్వతంత్ర రాజ్యంగా ఉందామన్న నిజాం పాలకుల కల కల్లలయ్యింది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.