వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి రాజీనామా చేశారు. అందరికీ ధ్యాంక్స్ చెప్పారు. తాను ఏ పార్టీలో ఉండనని వ్యవసాయం చేసుకుంటానన్నారు.
అంతాత ఓకే కానీ ఇంత హఠాత్తుగా ఆయన ఎందుకు రాజీనామా చేశారన్నది రాజకీయవర్గాలకు సైతం సస్పెన్స్ గా మారింది. ఎందుకు ఇంత హఠాత్తుగా నిర్ణయం తీసుకున్నారన్నది మాత్రం ట్వీట్ లో చెప్పలేదు.
కాకినాడ పోర్టు డీల్ కారణమా ?
విజయసాయిరెడ్డి ఇటీవల కాకినాడ పోర్టు కేసులో ఈడీ ఎదుట హాజరయ్యారు. ఇప్పుడు పూర్తిగా రాజీనామాలు ప్రకటించారు. కాకినాడ పోర్టు వ్యవహారంలో ఆయన పాత్ర చాలా కీలకంగా ఉందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. విజయసాయిరెడ్డికి సన్నిహితమైన ఆడిటింగ్ కంపెనీని రంగంలోకి దింపి.. వెయ్యి కోట్లు అవకతవకలకు పాల్పడినట్లుగా మొదట నివేదిక ఇప్పించారు. ఆ నివేదిక చూపించి బెదిరించి పోర్టులో వాటాలను రాయించుకున్నారు. తర్వాత నివేదిక మార్పించి తక్కువ జరిమానా వేశారు. అంటే అధికారాన్ని అడ్డం పెట్టుకుని పోర్టును లాగేసుకున్నట్లుగా స్పష్టంగా ఉందని టీడీపీ నేతలంటున్నారు. సీఐడీతో పాటు ఈడీ కూడా రంగంలోకి దిగి విచారణ జరుపుతోంది. పోర్టు రాయించుకుంది విజయసాయిరెడ్డి అల్లుడి సోదరుడు శరత్ చంద్రారెడ్డికి చెందిన కంపెనీ. ఈ కేసులు చుట్టుముడుతూండటంతో ఆయన ఆందోళన చెందారని భావిస్తున్నారు.
టీడీపీ రెడ్ బుక్లో విజయసాయిరెడ్డి పేరు
మరో వైపు తెలుగుదేశం పార్టీ సిద్దం చేసుకున్న రెడ్ బుక్ లో విజయసాయిరెడ్డి పేరు ఉంటుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ క్రమంలో ఐదేళ్ల కాలంలో విజయసాయిరెడ్డి చేసిన చాలా వ్యవహారాల తాలూకా రికార్డులను సిద్ధం చేశారని కార్యాచరణ ప్రారంభించగానే ఆయనపై కేసుల ఉచ్చు ప్రారంభమవుతుందని చెప్పుకుంటున్నారు. ఇలాంటి సమయంలో ఆయన రాజీనామా చేసి సన్యాసం ప్రకటించారు. అంతే కాదు… చంద్రబాబుతో రాజకీయంగానే విబేధించానని ఆయన చెప్పారు. పవన్ తో స్నేహం ఉందన్నారు. ఈ మాటల్ని బట్టి చూస్తే.. ఇక తన జోలికి రావొద్దని తాను అన్నీ వదిలేశానని చెప్పినట్లుగా ఉందన్న అభిప్రాయం వినిపిస్తోంది. టీడీపీ నేతల్ని వ్యక్తిగతంగా వేధించడంలో. .కోడెల ఆత్మహత్య చేసుకోవడంలో ఆయన పాత్ర ఎక్కువని టీడీపీ నేతలు అంటూంటారు.
వీటికి విజయసాయిరెడ్డి భయపడతారా ?
అయితే ఇలాంటి వాటికి ఆయన భయపడతారా అన్న చర్చ కూడా ఉంది. ఎందుకంటే ఆయన ఇప్పటికే పదహారు నెలలకుపైగా జైల్లో ఉన్నారు. కేసులకు భయపడి మొత్తం రాజకీయ సన్యాసం చేసే అవకాశం ఉండదని అంటున్నారు. కానీ ఇప్పుడు ఆయన ఒక్కరిపైనే ప్రభావం ఉండదని తన వియ్యంకుడి కుటుంబంతో పాటు మంచి ఫార్మా కంపెనీగా వృద్ధి చెందిన అరబిందోపై కూడా ప్రభావం పడుతుందన్న ఉద్దేశంతో ఆయన వెనక్కి తగ్గారని అంటున్నారు. అసలు రాజీనామాలకు కారణాలేమిటో ఆయన ప్రకటిస్తే కానీ స్పష్టత రాదు. ఒక వేళ ప్రకటించినా అసలు నిజమేంటో ఆయనకే తెలుసు.