భారతదేశంలో వాట్సాప్ నిలిచిపోనుందా? మంత్రి కీలక వ్యాఖ్యలు

www.mannamweb.com


వాట్సాప్ అనేది ఇప్పుడు చాలా మంది జీవితాల్లో ఒక భాగమైపోయింది. వ్యక్తిగత అవసరాలు, ఆఫీస్ వర్క్, బిజినెస్ వర్క్ ఇలా పలు రంగాల్లో కీలక యాప్ గా ఉంది. నిత్యం అనేక పనులు ఈ వాట్సాప్ ద్వారా అవుతున్నాయి. కీలక కమ్యూనికేషన్లు జరుగుతున్నాయి. ఆర్థిక వ్యవస్థతో ముడిపడి ఉంది. అలాంటి వాట్సాప్ తన సేవలను భారతదేశంలో నిలిపివేస్తుందన్న వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో ఐటీ మంత్రి స్పష్టతనిచ్చారు. ప్రభుత్వ ఆదేశాలను పాటించకపోతే వాట్సాప్ భారత్ ను వీడే అవకాశాలు ఉన్నాయనే సంకేతాలను ఇచ్చారు. భారతదేశంలో వాట్సాప్ తన కార్యకలాపాలను నిలిపి వేస్తుందా అని కాంగ్రెస్ సభ్యుడు వివేక్ తంఖా ప్రశ్నించగా.. దానికి సమాచార, ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ సమాధానమిచ్చారు. భారత్ లో వాట్సాప్ సేవలను నిలిపివేస్తుందన్న అంశానికి సంబంధించి దాని మాతృ సంస్థ మెటా భారత ప్రభుత్వానికి తెలియజేయలేదని ఐటీ మంత్రి అశ్విన్ వైష్ణవ్ వెల్లడించారు.

రాజ్యసభకు లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు. ఈ సమాధానంలోనే ఆయన ఈ విషయాన్ని స్పష్టం చేశారు. వినియోగదారులకు సంబంధించిన వివరాలను పంచుకోవాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన క్రమంలో వాట్సాప్ ఇండియాలో తమ కార్యకలాపాలను నిలిపివేయనుందా అనే ప్రశ్నకు అశ్విన్ వైష్ణవ్ వివరణాత్మక సమాధానమిచ్చారు. ఈ ఏడాది ప్రారంభంలో భారతదేశంలో తమ సేవలను నిలిపివేయనున్నట్లు వాట్సాప్ ఢిల్లీ హైకోర్టులో తెలియజేసింది. ప్రభుత్వం చెప్పినట్లు వినియోగదారుల వివరాలను పంచుకుంటే అది ఎన్ క్రిప్షన్ ను ఉల్లఘించినట్టు అవుతుందని.. దీని వల్ల యూజర్ల ప్రైవసీ దెబ్బ తింటుందని.. వాట్సాప్ మీద యూజర్లకు ఉన్న నమ్మకం పోతుందని వాట్సాప్ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ప్రభుత్వం పెట్టే కొత్త నియమాలు గోప్యతకు భంగం కలిగిస్తాయని వాట్సాప్, మెటా సంస్థలు ఆరోపించాయి.

అయితే ఈ ఫిబ్రవరి 2021లో ప్రవేశపెట్టిన ఈ నిబంధనలు హానికర కంటెంట్ ని ఎదుర్కోవడానికి చాలా అవసరమని భారత ప్రభుత్వం సమర్ధించింది. ఈ నిబంధనలు మధ్యవర్తిత్వ మార్గదర్శకాలు, డిజిటల్ మీడియా ఎథిక్స్ కోడ్ ని కలిగి ఉంటాయి. ఈ కారణంగా భారత ప్రభుత్వం వినియోగదారుల వివరాలను షేర్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. కానీ అది కంపెనీ పాలసీకి, యూజర్ల గోప్యతకు భంగం కలిగిస్తుందని వాట్సాప్, మెటా సంస్థలు ఆరోపిస్తూ వస్తున్నాయి. ప్రభుత్వం ఫోర్స్ చేస్తే వాట్సాప్ తమ సేవలను భారతదేశంలో నిలిపి వేసే అవకాశాలు ఉన్నాయని పలువురు అభిప్రాయపడుతున్నారు. అదే జరిగితే.. దాన్ని వినియోగించే 40 కోట్ల మందిపై ప్రభావం పడుతుందని అంటున్నారు. భారతదేశంలో చాలా మంది వ్యక్తులు వాట్సాప్ పై ఆధారపడి ఉన్నారని.. వ్యాపార సంస్థలు కమ్యూనికేషన్ కోసం వాట్సాప్ నే వినియోగిస్తున్నాయని.. ఇటువంటి సమయంలో వాట్సాప్ భారత్ ను వీడితే నష్టం జరుగుతుందని.. కమ్యూనికేషన్లకు అంతరాయం ఏర్పడుతుందని అంటున్నారు. ఆర్థిక వ్యవస్థకు హాని కలిగించవచ్చునని నిపుణులు భావిస్తున్నారు.