సింగపూర్ వెళ్తారా? అతి తక్కువ ధరలోనే ఐఆర్సీటీసీ ప్యాకేజీ

www.mannamweb.com


తక్కువ ధరలోనే విదేశాలకు వెళ్లి రావాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ కథనం మీ కోసమే. భారతీయ రైల్వే ఆధ్వర్యంలో నడిచే ఐఆర్సీటీసీ సంస్థ ప్రత్యేక విదేశీ టూర్ ప్యాకేజీని ప్రకటించింది.

అనువైన బడ్జెట్లో ఎలాంటి ఇబ్బంది లేకుండా మలేషియా- సింగపూర్ టూర్ ప్యాకేజీని తీసుకొచ్చింది. కేవలం నిర్ణీత ధరకు ప్యాకేజీ బుక్ చేసుకోవడం ద్వారా ఎంచక్కా వెళ్లి రావొచ్చు. ప్రయాణం, వసతి, ఆహారం అన్ని వారే చూసుకునే విధంగా ఈ ప్యాకేజీ ఉంటుంది. ఇది బడ్జెట్లో సింగపూర్, మలేషియాలలో సందర్శించాల్సిన ప్రధాన టూరిస్ట్ స్పాట్లను అన్నీ కవర్ చేసే విధంగా ఉంటుంది. ఈ నేపథ్యంలో ఐఆర్సీటసీ సింగపూర్-మలేషియా టూర్ ప్యాకేజీ గురించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

7 రోజుల మలేషియా ప్యాకేజీ..

ఐఆర్సీటీసీ టూర్ ప్యాకేజీ పేరు మ్యాజికల్ మలేషియా విత్ సింగపూర్ సెన్సేషన్. దీని ప్యాకేజీ కోడ్ ఎస్‌హెచ్O1. ఈ టూర్ ప్యాకేజీ 7 పగళ్లు, 6 రాత్రులు ఉంటుంది. ఇందులో మీరు కౌలాలంపూర్, సింగపూర్ సందర్శించే అవకాశం లభిస్తుంది. ఈ ప్యాకేజీ అక్టోబర్ 28న హైదరాబాద్ నుంచి ప్రారంభమవుతుంది.

టూర్ ఇలా సాగుతుంది..

డే1 (ఆదివారం-సోమవారం): అక్టోబర్ 27వ తేదీ రాత్రి 21:00 గంటలకు హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో రిపోర్ట్ చేయాలి. మరుసటి రోజు (అక్టోబర్ 28) ఉదయం 07:30 గంటలకు కౌలాలంపూర్ విమానాశ్రయానికి చేరుకుంటారు. ఎయిర్ పోర్టులో అక్కడి స్థానిక ప్రతినిధి స్వాగతం పలుకుతారు. హోటల్‌కి చెక్ ఇన్ చేస్తారు. ఫ్రెష్ అప్ అయ్యి అల్పాహారం తీసుకొన్నాక.. హోటల్‌లో విశ్రాంతి తీసుకుంటారు. తర్వాత భోజనం చేశాక.. మధ్యాహ్నం పుత్రజయ టూర్, షాపింగ్ కోసం అవకాశం ఇస్తారు. రాత్రికి ఇండియన్ రెస్టారెంట్‌లో డిన్నర్ చేస్తారు. రాత్రికి హోటల్లోనే బస.

డే2 (మంగళవారం): అక్టోబర్ 29న హోటల్‌లో ఉదయం అల్పాహారం తీసుకున్న తర్వాత బటు గుహలను సందర్శిస్తారు. తరువాత జెంటింగ్ హైలాండ్స్‌కు బయలుదేరుతారు. కౌలాలంపూర్‌కి తిరిగి వెళ్లి.. ఇండియన్ రెస్టారెంట్‌లో డిన్నర్ చేస్తారు. హోటల్లో రాత్రి బస చేస్తారు.

డే3 (బుధవారం): అక్టోబర్ 30న హోటల్‌లో ఉదయం అల్పాహారం తర్వాత నగర సందర్శన ఉంటుంది. ఇండిపెండెన్స్ స్క్వేర్, కింగ్స్ ప్యాలెస్, నేషనల్ మాన్యుమెంట్ , పెట్రోనాస్ ట్విన్ టవర్లను సందర్శిస్తారు.. తగిన భారతీయ రెస్టారెంట్‌లో భోజనం చేస్తారు. చాక్లెట్ హోల్‌సేల్ దుకాణం వద్ద్ ఆగుతారు. తర్వాత బెర్జయా టైమ్స్ స్క్వేర్‌లో షాపింగ్ చేయడానికి అవకాశం ఇస్తారు. ఇండియన్ రెస్టారెంట్‌లో డిన్నర్ చేసి, రాత్రికి హోటల్లోనే బస చేస్తారు.

డే 4 (గురువారం): అక్టోబర్ 31న హోటల్‌లో అల్పాహారం తీసుకున్నాక చెక్ అవుట్ చేసి, బస్సులో సింగపూర్‌కు వెళ్తారు. (5-6 గంటల డ్రైవ్). మార్గంలో తగిన రెస్టారెంట్లలో భోజనం చేస్తారు. మధ్యాహ్నానికి సింగపూర్ చేరుకుంటారు. హోటల్‌కి చెక్ ఇన్ చేస్తారు. ఇండియన్ రెస్టారెంట్‌లో డిన్నర్ చేసి, హోటల్లో బస చేస్తారు.

డే5 (శుక్రవారం): నవంబర్ 1న హోటల్‌లో అల్పాహారం తీసుకున్న ఆర్చిడ్ గార్డెన్, మెర్లియన్ పార్క్, సింగపూర్ ఫ్లైయర్ రైడ్‌లను కవర్ చేసే నగర పర్యటన కొనసాగుతుంది. మధ్యాహ్నం భారతీయ రెస్టారెంట్‌లో భోజనం చేస్తారు. కేబుల్ కారును సెంటోసాకు తీసుకెళ్తారు. ఎస్ఈఏ, మేడమ్ టుస్సాడ్స్, ఐఓఎస్, వింగ్స్ ఆఫ్ టైమ్, మొదటి ప్రదర్శనను చూడొచ్చు. రాత్రికి ఇండియన్ రెస్టారెంట్‌లో డిన్నర్ చేసి, హోటల్లో బస చేస్తారు.

డే6 (శనివారం): నవంబర్ 2న హోటల్‌లో అల్పాహారం తీసుకున్నాక ఫుడ్ కూపన్‌లతో యూనివర్సల్ స్టూడియోలను సందర్శిస్తారు.

డే 7 (ఆదివారం): నవంబర్ 3న హోటల్‌లో అల్పాహారం తీసుకున్నాక జురాంగ్ బర్డ్ పార్క్‌ని సందర్శిస్తారు. మధ్యాహ్నం భోజనం చేశాక కౌలాలంపూర్ నుంచి హైదరాబాద్‌కు చాంగి విమానాశ్రయం నుంచి బయలుదేరి రాత్రికి హైదరాబాద్ చేరుకుంటారు.

ప్యాకేజీని బుక్ చేసుకోవడానికి ఖర్చు ఇలా..

సింగిల్ షేరింగ్ కోసం ప్యాకేజీని బుక్ చేసుకుంటే రూ.1 లక్షా 56 వేల 30 ఖర్చవుతుంది. డబుల్ షేరింగ్ టికెట్ బుకింగ్ కు రూ.1 లక్షా 29 వేల 280, ట్రిపుల్ షేరింగ్ కు రూ.1 లక్షా 28 వేల 720 ఖర్చవుతుంది. మీతో ఈ ట్రిప్‌లో 5 సంవత్సరాల నుంచి 11 సంవత్సరాల లోపు పిల్లలు ఉంటే, మీకు విడిగా రూ. 1 లక్షా 11 వేల 860, అలాగే 2 నుంచి 11 సంవత్సరాల మధ్య పిల్లలు ఉంటే, మీకు రూ. 98 వేల 820 ఖర్చవుతుంది. .