నాయనమ్మకు ప్రేమతో.. ఈ వాహనమే గిరిజన యువకుడి రోల్స్ రాయిస్

www.mannamweb.com


గిరిశిఖర గ్రామానికి చెందిన ఓ యువకుడు తన నాయనమ్మ పడుతున్న అవస్థలు చూసి చలించాడు. ఎలాగైనా సరే తన నాయనమ్మకు ఇబ్బందులు లేకుండా తన వంతు సహకారం అందించాలని అనుకున్నాడు.
వెంటనే తన మెదడుకు పని చెప్పాడు. నాయనమ్మ అవసరం తీర్చి అందర్నీ అబ్బురుపరిచాడు. ఇదే ఇప్పుడు పార్వతీపురం మన్యం జిల్లాలో హాట్ టాపిక్‎గా మారింది. పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలం దిగువ చోరుపల్లి అనే గిరిశిఖర గ్రామంలో మండంగి చిన్నమ్మి అనే 75 సంవత్సరాల వృద్ధురాలు నివాసం ఉంటుంది. ఈమెకు కళ్లు సరిగా కనిపించవు. వృద్ధాప్యంపై పడటంతో సరిగ్గా నడవలేని స్థితిలో ఉంది. అయితే గిరిశిఖర గ్రామం కావడంతో ఆ గ్రామం నుండి ఏ చిన్నపాటి అవసరం ఉన్నా మైదాన ప్రాంతానికి రాక తప్పదు. గ్రామస్తులు అందరూ ఎన్నో ఇబ్బందులు పడి మోటార్ సైకిల్ వెళ్లగలిగే రహదారిని గ్రామానికి ఏర్పాటు చేసుకున్నారు. రాళ్లు, రప్పలతో ఉన్న ఆ రహదారిలో బైక్ ప్రయాణం కూడా అతికష్టం మీద చేయాల్సిందే.

అయితే ఇది ఇలా ఉండగా చిన్నమ్మికి కురుపాం మండల కేంద్రంలోనే ఏపి వికాస్ గ్రామీణ బ్యాంక్‎లో చిన్నమ్మికి బ్యాంక్ అకౌంట్ ఉంది. తనకు వచ్చే పెన్షన్ డబ్బుతో పాటు తన వద్ద ఉన్న కాస్తో కూస్తో డబ్బును ఆ అకౌంట్ లోనే దాచుకుంటుంది. తాను దాచుకున్న సొమ్ము కోసం తన ఖాతా ఉన్న ఏపి వికాస్ గ్రామీణ బ్యాంక్ కు వెళ్లాల్సి వచ్చింది. కానీ ఆమె అక్కడకు వెళ్లలేని పరిస్థితి తలెత్తింది. కనీసం మోటార్ సైకిల్ పై కూడా కూర్చునే ఓపిక ఆమెకు లేదు. దీంతో ఆమె పరిస్థితి గమనించిన ఆమె మనుమడు మండంగి శివ ఎలాగైనా సరే తన నాయనమ్మను బ్యాంక్ వద్దకు తీసుకెళ్లి ఆమె అవసరం తీర్చాలని నిర్ణయించుకున్నాడు. ఎప్పటికప్పుడు తన నాయనమ్మ అనారోగ్యానికి సంభందించిన అవసరం కానీ, ఇతరత్రా చిన్నపాటి అవసరాలను తీర్చడానికి ఇబ్బంది ఉండకూడదనే ఉద్దేశ్యంతో వినూత్నంగా ఆలోచించాడు.

తన వద్ద ఉన్న పరికరాలతోనే తన నాయనమ్మ కూర్చునేలా ఒక వాహనాన్ని తయారు చేయడానికి సిద్ధమయ్యాడు. అనుకున్నదే తడువుగా వాహనం తయారీలో నిమగ్నమయ్యాడు. తన వద్ద ఉన్న పాత మోటర్ సైకిల్ చక్రాలు ఒక పట్టె మంచానికి బిగించి తాళ్ళతో బలంగా కట్టి ఒక ట్రాలీలా తయారు చేశాడు. ఆ ట్రాలీలో కూర్చుంటే తన నాయనమ్మకు ఎండ తగులుతుందని ట్రాలీ పైన కర్రల సహాయంతో ఒక దుప్పటి ఏర్పాటుచేశాడు. అలా తయారు చేసిన ఆ ట్రాలీని మోటార్ సైకిల్ వెనుక తగిలించి తన నాయనమ్మని తీసుకొని కురుపాం బ్యాంక్ వద్దకు తీసుకువెళ్లాడు. అక్కడ బ్యాంక్‎లో నగదు విత్ డ్రా చేసుకొని తిరిగి ఇంటికి తీసుకొని వచ్చాడు. తనకు నాయనమ్మపై ఉన్న ప్రేమాభిమానాలే ఈ వాహనం తయారీకి ఆజ్యం పోసిందని, ఈ ట్రాలీ సహాయంతో తన నాయనమ్మకు కావలసిన అవసరాలు తీరుస్తాను అంటున్నాడు మనువడు మండంగి శివ.