మహిళలకు ఇది గుడ్ న్యూస్ అనే చెప్పుకోవచ్చు. ఏంటని అనుకుంటున్నారా.. ఇంటి వద్దనే ఉంటూ నెలకు రూ.30 వరకు సంపాదించొచ్చు. ప్రభుత్వం అందిస్తున్న ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోండి.
ఈ కియోస్క్‌ల ద్వారా మహిళలు ప్రతి నెలా కనీసం రూ.10,000 నుంచి రూ.30,000 వరకు ఆదాయం సంపాదించగలగడం ముఖ్య లక్ష్యం. ఇది మహిళల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచడమే కాక, కుటుంబ ఆర్థిక స్థితిని మెరుగుపర్చే మార్గంగా రాష్ట్ర ప్రభుత్వం దీన్ని అభివృద్ధి చేసింది. ఈ విధంగా, డిజి లక్ష్మి ఒక మహిళా సాధికారతకు మార్గం వేసే వినూత్న కార్యక్రమంగా నిలవనుంది. తూర్పు గోదావరి జిల్లాలో డిజి లక్ష్మి కియోస్క్‌లకు మహిళల ఎంపిక, శిక్షణ, సేవా ప్రారంభమైంది.
డిజి లక్ష్మి కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేయడంలో భాగంగా, ఈస్ట్ గోదావరి జిల్లాలోని కాకినాడ నగరపాలక సంస్థ, సామర్లకోట, పెద్దాపురం, పిఠాపురం, తుని పురపాలక సంఘాలు, గొల్లప్రోలు, ఏలేశ్వరం నగర పంచాయతీలు కీలక పాత్ర పోషిస్తున్నాయి.
ఈ పట్టణ ప్రాంతాల్లో పట్టణ మహిళా సంఘాల (Self Help Groups – SHGs)కు చెందిన సబ్-లెవల్ ఫెడరేషన్లు (SLFs) ఆధ్వర్యంలో అర్హులైన మహిళలను గుర్తించి ఎంపిక చేశారు. మొత్తం ఏడు పట్టణ స్థానిక సంస్థల్లో 450 మంది మహిళలు ఎంపిక చేశారు. వీరిలో చాలామంది మూడు సంవత్సరాల అనుభవం కలిగిన డిగ్రీ విద్యార్థినులు.
ఎంపికైన మహిళలందరికీ విశేష శిక్షణా కార్యక్రమాలు నిర్వహించి పూర్తి చేశారు. ఇప్పుడు వారికి అధికారిక లాగిన్లు (User Credentials) ఇవ్వడం పూర్తయ్యింది. ఈ క్రమంలో, డిజి ఆటమ్ కియోస్క్‌లకు అవసరమైన టెక్నికల్ పరికరాలు, సాఫ్ట్‌వేర్ , కనెక్టివిటీ సదుపాయాలు ప్రభుత్వం సమకూర్చింది.
మహిళలు ఈ సేవా కేంద్రాలను తమ ఇంట్లో నుంచే నిర్వహించుకునేలా లేదా చిన్న పరిమాణంలో స్వంత దుకాణాలు ఏర్పాటు చేసుకునేలా ప్రోత్సహం అందిస్తున్నారు. ఈ సేవా కేంద్రాల ద్వారా వారు బ్యాంకింగ్, బిల్లులు, ప్రభుత్వ పథకాలకు దరఖాస్తులు, ఆధార్ సేవలు, మొబైల్ రీఛార్జ్, ఇతర డిజిటల్ సేవలు అందించగలరు.
ఇప్పటికే కొన్ని మహిళలు లాగిన్లు పొందిన వెంటనే తమ సేవా కేంద్రాల కార్యకలాపాలను ప్రారంభించాయి. కొందరు ఇంటివద్దే సేవలు అందిస్తుండగా, మరికొందరు వీటిని తమ దుకాణాలలో భాగంగా ఏర్పాటు చేసుకుంటున్నారు. ఈ విధంగా, డిజి లక్ష్మి వారి ఆర్థిక స్వావలంబనకు మార్గం వేస్తోంది.
డిజి లక్ష్మి ఆటమ్ కియోస్క్ కేంద్రాల ద్వారా మహిళలు ప్రజలకు అందించే సేవలు మరింత విస్తృతం కావడం విశేషం. ఈ కేంద్రాల శాస్త్రీయ నిర్వహణకు ఈ-గవర్నెన్స్ సర్వీసెస్ ఇండియా లిమిటెడ్ (e-Governance Services India Ltd) సాంకేతిక భాగస్వామిగా మారనుంది. వారి సహకారంతో ఈ కేంద్రాల్లో మీ సేవా (MeeSeva) మరియు సీ ఎస్ సీ (Common Service Centre – CSC) మాదిరిగా అనేక ప్రభుత్వ మరియు బ్యాంకింగ్ సేవలు అందుబాటులోకి రానున్నాయి.
ఈ కేంద్రాల ద్వారా ప్రజలు కింది ముఖ్యమైన సేవలను పొందగలుగుతారు: రేషన్ కార్డు నమోదు , మార్పులు, పాన్ కార్డు దరఖాస్తు, పాస్‌పోర్ట్ అప్లికేషన్ సహాయ సేవలు, జనన మరణ ధ్రువీకరణ పత్రాల జారీ, ఓటరు కార్డు నవీకరణ, బ్యాంకు ఖాతాల ప్రారంభం, నగదు డిపాజిట్లు, ఇతర ప్రధాన బ్యాంకింగ్ లావాదేవీలు నిర్వహిస్తారు.
ఇక అసంఘటిత రంగ కార్మికులకు కూడా ఈ కేంద్రాలు ఉపయుక్తంగా ఉండనున్నాయి. ఈ-శ్రమ్ (e-SHRAM) కార్మిక రిజిస్ట్రేషన్ కోసం కార్మిక శాఖతో కూడిన సమన్వయంతో సేవలు అందించనున్నాయి. అదేవిధంగా, ఆస్తి పన్నులు, ఇతర మున్సిపల్ పన్నులు, తాగునీటి ఛార్జీలు వంటి నగర పాలక సంస్థలకు సంబంధించిన వసూళ్లను ఈ కేంద్రాల ద్వారా నిర్వహించేందుకు పురపాలక శాఖతోపాటు ఇప్పటికే మెప్మా (Mission for Elimination of Poverty in Municipal Areas – MEPMA) అవగాహన ఒప్పందం చేసుకుంది.
ఈ విధంగా, డిజి లక్ష్మి కేంద్రాలు పక్కాగా ప్రజలకు ప్రభుత్వ సేవలు అందించే నూతన డిజిటల్ సేవా కేంద్రాలుగా మారుతున్నాయి. ఇవి మహిళల ఆర్థిక అభివృద్ధి మాత్రమే కాకుండా డిజిటల్ ప్రభుత్వ సేవల డీసెంట్రలైజేషన్‌కు ఒక అడుగు ముందుకు వేస్తున్నాయనడం అతిశయోక్తి కాదు.
పట్టణ ప్రాంతాల్లో మహిళలకు ఆర్థిక స్వావలంబన కల్పించడాన్ని లక్ష్యంగా పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన డిజి లక్ష్మి ఆటమ్ కియోస్క్ కేంద్రాల ఏర్పాటు వేగంగా కొనసాగుతోంది. ఈ క్రమంలో, ఎంపికైన మహిళలకు ప్రతివ్యక్తికి రూ.2 లక్షల వరకు రుణం అందించేందుకు చర్యలు చేపట్టినట్లు మెప్మా ప్రాజెక్టు డైరెక్టర్ బి. ప్రియంవద తెలిపారు.
ఈ ప్రాజెక్టులో భాగంగా, ప్రతి సబ్ లెవల్ ఫెడరేషన్ (SLF) పరిధిలో సుమారు 250 మంది మహిళా సభ్యుల కోసం ఒక్కటిగా ఒక సేవా కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. దీనివల్ల సేవా విస్తీర్ణం పెరగడం తో పాటు ప్రజలకు సులభంగా సేవలు అందుబాటులోకి రానున్నాయి.
మెప్మా పీడీ బి. ప్రియంవద ప్రకారం.. “మేము డిగ్రీ విద్యార్హత కలిగి, కంప్యూటర్ నైపుణ్యం ఉన్న మహిళలనే ఎంపిక చేశాం. వీరికి అవసరమైన శిక్షణను పూర్తిగా అందించాం. ఇప్పటివరకు 91 మంది మహిళలకు యూజర్ ఐడీలు జారీ చేశాం. వారు తమ లాగిన్లను ఉపయోగించి త్వరలోనే సేవలందించడం ప్రారంభించనున్నారు” అని తెలిపారు.
ఇందులో భాగంగా, మొత్తం 450 మంది అర్హులైన మహిళలను ఎంపిక చేశామని, ఈ నెలాఖరులోగా అన్ని సేవా కేంద్రాలను పూర్తిస్థాయిలో ప్రారంభించేలా ఏర్పాట్లు చేస్తున్నామని స్పష్టం చేశారు. ప్రభుత్వ సూచనల మేరకు, మిగిలిన లాగిన్లను త్వరితగతిన జారీ చేసి, కియోస్క్‌లు పూర్తిస్థాయిలో ప్రారంభించేందుకు మెప్మా శ్రద్ధ తీసుకుంటోంది. కాగా కాకినాడలో 233 మంది, పెద్దాపురంలో 43 మంది, పిఠాపురంలో 40 మంది, ఏలేశ్వరంలో 28 మంది, గొల్లప్రోలులో 20 మంది, తునిలో 40 మంది, సామర్లకోటలో 46 మంది చొప్పున ఈ స్కీమ్ కింద ఎంపిక అయ్యారు.
































