ఏపీలో మహిళలు ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఫ్రీగా ప్రయాణించొచ్చు…కానీ ఈ బస్సులకే పరిమితం

పీలో కూటమి ప్రభుత్వం మహిళలకు తీపికబురు చెప్పింది. 2025 ఆగస్టు 15న ఈ పథకం ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పరిధిపై ఇప్పటి వరకు ఎలాంటి క్లారిటీ రాలేదు.


తొలుత ఈ పథకాన్ని జిల్లాల వరకే అనుమతించాలని నిర్ణయించారు. అంటే ఏ జిల్లా పరిధిలో ఉన్న వారు ఆ జిల్లాలో మాత్రమే ఉచిత ప్రయాణం చేసేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం భావించింది. అయితే తాజాగా ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కింద మహిళలు రాష్ట్రమంతటా ప్రయాణించవచ్చు అని తెలిపింది. ఈ మేరకు రవాణా శాఖమంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి, ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమల రావు ప్రకటించారు.

ఉచిత బస్సు ప్రయాణంపై పరిమితుల్లేవ్
ఏపీ మహిళలకు రవాణాశాఖ మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి తీపికబురు చెప్పారు. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై కీలక అప్డేట్ ఇచ్చారు. ఆగస్టు 15 నుంచి రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని స్పష్టం చేశారు. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కింద మహిళలు రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడి నుంచి ఎక్కడికైనా తిరగొచ్చు అని స్పష్టం చేసింది. దీనిపై ఎలాంటి పరిమితులు లేవు అని మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి వెల్లడించారు. దీనికి సంబంధించి త్వరలోనే తుది మార్గదర్శకాలు వెలువరిస్తామని మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి తెలిపారు. ఈ పథకం అమలుతో ప్రస్తుతం బస్సుల్లో తిరుగుతున్న మహిళల సంఖ్య 35 శాతం నుంచి 60 శాతానికి పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. రద్దీకి తగినట్లు బస్సుల నిర్వహణ, కండిషన్‌ను మెరుగుపరిచే చర్యలు చేపట్టాలని…ట్రిప్పుల సంఖ్యను పెంచాలని అధికారులను ఆదేశించినట్లు మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి తెలిపారు.

ఈ బస్సుల్లో మాత్రమే ఫ్రీ
పల్లెవెలుగు, అల్ట్రా డీలక్స్, ఎక్స్‌ప్రెస్, మెట్రో, సిటీ సర్వీసుల్లో మాత్రమే ఉచిత ప్రయాణం చేయవచ్చు అని రవాణా శాఖ మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి సూచించారు. త్వరలోనే 1,050 ఎలక్ట్రిక్ బస్సులు రానున్నాయని ఇవి కాకుండా దాదాపు 1500 బస్సులకు ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు వెల్లడించారు. సిబ్బంది కొరతను అధిగమించే మార్గాలు చూడాలని…బస్సు కండీషన్‌లో ఉంటేనే రోడ్డెక్కించాలని రవాణా శాఖ మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి ఆదేశించారు.

11 లక్షల మంది మహిళలు ప్రయాణం
రాష్ట్రంలో ఆర్టీసీ టికెట్ల జారీ ద్వారా ప్రభుత్వానికి ఏడాదికి రూ.3708 కోట్లు వస్తుంది. అందులో 40 శాతం మహిళల ప్రయాణాల ద్వారా రూ.1483 కోట్లు వస్తున్నట్లు ప్రభుత్వ అంచనా. ఈ పథకం అమలు చేస్తే మహిళలు ఎక్కువగా ప్రయాణాలు చేస్తారని…దీంతో మొత్తం రాబడి రూ.5051 కోట్లకు చేరుతుందని..అందులో మహిళల వాటా రూ.3182 కోట్లు ఉంటుందని అంచనా. కాబట్టి దీనికి అనుగుణంగా ప్రభుత్వం ఈ పథకం అమలుకు విధివిధానాలు ఖరారు చేయాల్సి ఉంది. ఈ పథకం అమలైతే రోజుకు రాష్ట్రవ్యాప్తంగా అదనంగా మరో 11 లక్షల మంది మహిళలు ప్రయాణాలు చేస్తారని ప్రభుత్వం అంచనా వేస్తోంది.

ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎంగా పవన్ కల్యాణ్ బాధ్యతలు చేపట్టిన అనంతరం పాలనపై స్పీడ్ పెంచారు. అంతేకాదు మరింత దూకుడు సైతం పెంచారు. ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని నిర్ణయించారు. ఇప్పటికే సూపర్ సిక్స్ హామీలను కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే కూటమి ప్రభుత్వం పింఛన్లు పెంచింది. అలాగే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసి పరీక్షలు సైతం నిర్వహించింది. తల్లికి వందనం పథకాన్ని సైతం అమలు చేసింది. తాజాగా మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం హామీ అమలుకు ముహూర్తం ఫిక్స్ చేసింది. ఆగస్టు 15న ఈ పథకాన్ని ప్రారంభిస్తామని సీఎం చంద్రబాబు నాయుడు ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే.

ఫ్రీ బస్సుకోసం ఈ డాక్యుమెంట్స్ తప్పనిసరి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బస్సుల సంఖ్య తక్కువగా ఉందని అధికారులు రవాణాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డికి తెలియజేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న బస్సులతో ఈ పథకం అమలు చేస్తే ఇబ్బందులు తప్పవని అధికారులు క్లారిటీ ఇచ్చారని టాక్ వినిపిస్తోంది. కొత్త బస్సులు తీసుకొనే వరకూ పథకం వాయిదా వేయాలనే సూచించినట్లు సమాచారం. అయితే ప్రభుత్వం మాత్రం పథకం అమలుపైనే దృష్టి సారించినట్లు తెలుస్తోంది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నెల వ్యవధిలోపే ఈ పథకాన్ని ప్రారంభించిందని కాబట్టి ఏపీలో కూడా ప్రభుత్వం ఏర్పడి దాదాపుగా ఏడాది కావస్తుంది. ఇక ఆలస్యం చేయకుండా ఆగస్టు 15న ప్రారంభించాలని సీఎం చంద్రబాబు నాయుడు నిర్ణయించారు. ఇకపోతే ఉచిత బస్సు ప్రయాణం అమలులోకి వస్తే ఖచ్చితంగా ప్రతీ మహిళ ఆధార్ కార్డును తీసుకుని బస్సులో ప్రయాణించాల్సి ఉంటుందని తెలుస్తోంది. ఇప్పటికే అటు కర్ణాటక ఇటు తెలంగాణ రాష్ట్రాలలో ఆధార్ కార్డు ప్రామాణికంగా ఫ్రీ బస్సు సౌకర్యం కల్పిస్తున్న సంగతి తెలిసిందే. ఏపీలో కూడా ఇదే అమలు చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఒకవేళ ఆధార్ కార్డు లేని పక్షంలో ఓటర్ ఐడీ, రేషన్ కార్డు, ఉపాధి హామీ పథకం కార్డులను తీసుకెళ్లొచ్చు అనే ప్రచారం జరుగుతుంది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.