మహిళలబ్యాంక్ ఖాతాల్లోకే .. నేరుగా డబ్బులు జమ చేయనున్నారు.

మహిళా సాధికారతే లక్ష్యంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో పథకాలను అమలు చేస్తున్నాయి. దీనిలో కేంద్ర ప్రభుత్వం మహిళల ఆర్థిక స్వావలంబనను పెంపొందించేందుకు స్వయం సహాయక సంఘాలను(డ్వాక్రా గ్రూప్స్) ప్రోత్సహిస్తోంది.


ఈ సంఘాలకు బ్యాంకులు, స్త్రీనిధి ద్వారా రుణాలు అందిస్తున్నా.. సంఘాల పురోగతి పై సమగ్ర సమాచారం కేంద్రానికి అందడం లేదు. దీని కారణంగా క్షేత్ర స్థాయిలో ప్రాథమిక నిర్ణయాలు తీసుకోవడం కష్టంగా మారుతుంది. అందుకే ఈ సమస్య నుంచి బయటపడేందుకు ప్రభుత్వం లోకోస్ యాప్ ను ప్రవేశపెట్టింది. జాతీయ జీవనోపాధి మిషన్ (ఎన్ఆర్ఎల్ఎం) ఆధ్వర్యంలో లోకోస్ యాప్ ద్వారా స్వయం సహాయక సంఘాల పూర్తి సమాచారాన్ని అప్‌లోడ్ చేయనున్నారు. సంఘం ఏర్పాటైన సంవత్సరం, సభ్యుల సంఖ్య, పొదుపు మొత్తం, బ్యాంకు రుణాలు, వాయిదా చెల్లింపులు తదితర వివరాలు ఈ యాప్‌లో పూర్తిగా నిక్షిప్తం అవుతాయి. దీని ద్వారా ఏ డ్వాక్రా గ్రూపులో ఎంత మంది ఉన్నారు.. ఎంత రుణం తీసుకున్నారు.. ఎంత వడ్డీ చెల్లిస్తున్నారు.. అనే క్షేత్రస్థాయిలో సంఘాల పురోగతి కేంద్ర ప్రభుత్వానికి స్పష్టంగా తెలుస్తుంది.

మహిళా సంఘాల సభ్యుల కోసం జీవన్ జ్యోతి బీమా, సురక్ష బీమా యోజన వంటి పథకాలను కేంద్రం అమలు చేస్తోంది. తక్కువ ప్రీమియంతో ఈ బీమా సదుపాయాన్ని పొందేలా ప్రోత్సహిస్తోంది. ప్రస్తుతం ఏన్ని సంఘాల సభ్యులు ఈ పథకాలకు లబ్ధిదారులుగా ఉన్నారనేది ఆన్‌లైన్‌లో నమోదు చేస్తారు. ఇప్పటి వరకు ఈ సమాచారం అందుబాటులో లేదు. ఇప్పడు దీని ద్వారా సమగ్ర సమాచారం ఒకేచోట లభిస్తుంది. ఇక ప్రభుత్వ నిధులను మూడవ వ్యక్తి చేతికి వెళ్లకుండా.. నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి జమ కానున్నాయి. దీని కోసమే లోకోస్ యాప్ ను తీసుకొచ్చారు.

ఈ విధానం అమలైతే స్వయం సహాయక సంఘాలకు అందించే వడ్డీ రాయితీ, ఇతర ఆర్థిక సాయం నేరుగా వారి ఖాతాల్లో జమ చేయనున్నారు. ఆయా జిల్లాల అధికారులు దీని ద్వారా లబ్ధిదారులకు మరింత పారదర్శకంగా.. ఎలాంటి అవకతవకలకు చోటు లేకుండా.. నేరుగా డబ్బులు అకౌంట్లోనే జమ అవుతాయని చెబుతున్నారు. అయితే ఇక్కడ కొన్ని రాష్ట్రాలు కేంద్రం అందించే డబ్బులను తామే అందిస్తున్నట్లు ప్రచారం చేసుకుంటున్నాయి. అంతే కాదు.. కొన్ని రాష్ట్రాల్లో ప్రభుత్వం అందించే డబ్బులను ఇతర అవసరాలకు వాడుకొని.. లబ్ధిదారులకు ఆలస్యంగా చెల్లిస్తున్నాయి. ఇటువంటి పరిస్థితులు లేకుండా ప్రభుత్వం ఈ కీలక నిర్ణయాన్ని తీసుకుంది. దీనిపై స్వయం సహాయక సంఘాల మహిళలు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.